తెలంగాణలో మారిన సీన్.. టీఆర్ఎస్ ఫోకస్ అంతా కాంగ్రెస్ పైనే..

తెలంగాణలో ఇప్పటి వరకూ టీఆర్ఎస్ ఫోకస్ అంతా బీజేపీపైనే ఉంది. బీజేపీకి పెరుగుతున్న ఆదరణ, దుబ్బాక బైపోల్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాలతో ఒకరకంగా కేసీఆర్ డైలమాలో పడ్డారు. ఆమధ్య బండి సంజయ్, టీఆర్ఎస్ నాయకుల మధ్య పేలిన మాటల తూటాలు సంచలనంగా మారాయి కూడా. అయితే ఆ ఎపిసోడ్ కి కాస్త విరామం వచ్చినట్టయింది. వాస్తవంగా.. ఈటల రాజేందర్ హుజూరాబాద్ నుంచి బీజేపీ తరపున ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్న సందర్భంలో బీజేపీ-టీఆర్ఎస్ […]

Advertisement
Update:2021-08-26 02:33 IST

తెలంగాణలో ఇప్పటి వరకూ టీఆర్ఎస్ ఫోకస్ అంతా బీజేపీపైనే ఉంది. బీజేపీకి పెరుగుతున్న ఆదరణ, దుబ్బాక బైపోల్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాలతో ఒకరకంగా కేసీఆర్ డైలమాలో పడ్డారు. ఆమధ్య బండి సంజయ్, టీఆర్ఎస్ నాయకుల మధ్య పేలిన మాటల తూటాలు సంచలనంగా మారాయి కూడా. అయితే ఆ ఎపిసోడ్ కి కాస్త విరామం వచ్చినట్టయింది. వాస్తవంగా.. ఈటల రాజేందర్ హుజూరాబాద్ నుంచి బీజేపీ తరపున ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్న సందర్భంలో బీజేపీ-టీఆర్ఎస్ మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంటుందని అనుకున్నారంతా. కానీ విచిత్రంగా మధ్యలో కాంగ్రెస్ ఎంట్రీ ఇచ్చింది. రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పగించిన తర్వాత టీఆర్ఎస్ ఫోకస్ బీజేపీనుంచి కాంగ్రెస్ పైకి మళ్లింది. అందులోనూ కేసీఆర్ ప్రభుత్వం దళితబంధుని ప్రకటించిన తర్వాత రేవంత్ రెడ్డి వరుసగా దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్షలతో హోరెత్తిస్తున్నారు. అడుగడుగునా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కేసీఆర్, కేటీఆర్ సహా.. అందర్నీ ఇరుకున పెట్టేలా మాట్లాడుతున్నారు.

తాజాగా రేవంత్ రెడ్డి కోసం మంత్రి మల్లారెడ్డి తెలంగాణ భవన్ లో తొడగొట్టారు. మంత్రి స్థాయిలో ఉన్న ఓ నాయకుడు మరీ అంతగా ఉద్వేగానికి లోనవుతారని ఎవరూ అనుకోలేం. అందులోనూ కాంగ్రెస్, తెలంగాణలో ఏమంత బలంగా లేదు, కాంగ్రెస్ నాయకుల మాటల్ని ఎవరూ పట్టించుకోరని, వారిని ఎవరూ లక్ష్యపెట్టరని పదే పదే టీఆర్ఎస్ నాయకులే చెబుతుంటారు. అలాంటి సందర్భంలో.. రేవంత్ రెడ్డి చేసిన విమర్శలకు సమాధానంగా.. మంత్రి మల్లారెడ్డి స్టేజ్ పై, మీడియా ముందు తొడగొట్టారు. దమ్ముంటే రా.. రాజీనామా చేద్దాం, తాడో పేడో తేల్చుకుందామంటూ సవాల్ విసిరారు. ఒకరకంగా ఇది రేవంత్ విజయమేనని చెప్పాలి. టీఆర్ఎస్ మంత్రుల్ని సైతం ఆయన కుదురుగా ఉండనీయడంలేదు. నేరుగా కేసీఆర్, కేటీఆర్ పై కూడా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసి టాక్ ఆఫ్ తెలంగాణ అయ్యారు.

మొన్న మూడో అడుగు.. ఇప్పుడు ప్రగతి భవన్ పేరుమార్పు..
ఇటీవల మూడో అడుగు నేరుగా కేసీఆర్ నెత్తినే పెడతామంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి, కేసీఆర్ దత్తత గ్రామం మూడు చింతల పల్లిలో జరిగిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్షలో ప్రగతి భవన్ పేరు మార్చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ప్రగతి భవన్‌ ను డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్ బహుజన భవన్‌ గా మారుస్తామని చెప్పారు. దానిని దళిత, గిరిజన, ఆదివాసీల పిల్లలను డాక్టర్లు, ఇంజినీర్లు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ లుగా ఉత్పత్తి చేసే కర్మాగారంగా చేస్తామని అన్నారు.

కేసీఆర్ కి టైమ్ అయిపోయింది..
తెలంగాణ కోసం కేసీఆర్‌ ఉద్యమం చేసి ఉండొచ్చుని, అయితే ఆయన కష్టానికంటే ఎక్కువ కూలీ దక్కిందని ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక కొందరే బాగుపడ్డారని అన్నారు. టైమొస్తే బీసీ, మైనార్టీ, బ్రాహ్మణులకు కూడా దళిత బంధు లాగే పథకాలను ప్రకటిస్తామని కేసీఆర్ చెప్పడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. టైమ్ వస్తే అవన్నీ చేస్తానంటున్న కేసీఆర్ కు.. ఇప్పుడు టైమ్ అయిపోయిందని, తెలంగాణ సమాజానికి టైమ్ వచ్చిందని, కేసీఆర్ ఇక ఇంటికేనని చురకలంటించారు. మొత్తమ్మీద బీజేపీ దూకుడు కాస్త తగ్గిన సమయంలో కేసీఆర్ ని, టీఆర్ఎస్ ని రేవంత్ రెడ్డి బాగా డిస్ట్రబ్ చేయడం మొదలు పెట్టారు.

Tags:    
Advertisement

Similar News