మీరూ మీరూ ఒకటే.. హుజూరాబాద్ లో నయా రాజకీయం..
కేసీఆర్ బీ టీమ్ ఎవరు, బీజేపీకి లోపాయికారీగా మద్దతిచ్చేది ఎవరు, కాంగ్రెస్ తో ఏ పార్టీ కుమ్మక్కయింది. హుజూరాబాద్ లో త్రిముఖ పోరు తప్పకపోవడంతో ఇప్పుడంతా ఏ టీమ్ లు, బీ టీమ్ లు అంటూ విమర్శలు మొదలయ్యాయి. మీరూ మీరూ ఒకటేనంటూ.. మిగిలిన రెండు పార్టీలపై ఆరోపణలు చేస్తున్నారు నేతలు. నిన్న మొన్నటి వరకూ హుజురాబాద్ రేస్ లో కాంగ్రెస్ లేదు. కాంగ్రెస్ తరపున పోటీ చేస్తాడనుకున్న కౌశిక్ రెడ్డి కాస్తా టీఆర్ఎస్ లో చేరడంతో, […]
కేసీఆర్ బీ టీమ్ ఎవరు, బీజేపీకి లోపాయికారీగా మద్దతిచ్చేది ఎవరు, కాంగ్రెస్ తో ఏ పార్టీ కుమ్మక్కయింది. హుజూరాబాద్ లో త్రిముఖ పోరు తప్పకపోవడంతో ఇప్పుడంతా ఏ టీమ్ లు, బీ టీమ్ లు అంటూ విమర్శలు మొదలయ్యాయి. మీరూ మీరూ ఒకటేనంటూ.. మిగిలిన రెండు పార్టీలపై ఆరోపణలు చేస్తున్నారు నేతలు. నిన్న మొన్నటి వరకూ హుజురాబాద్ రేస్ లో కాంగ్రెస్ లేదు. కాంగ్రెస్ తరపున పోటీ చేస్తాడనుకున్న కౌశిక్ రెడ్డి కాస్తా టీఆర్ఎస్ లో చేరడంతో, అక్కడ బలమైన నాయకుడు లేరని, ఆ పార్టీ లెక్కలో లేదని అనుకున్నారంతా. రేవంత్ రెడ్డికి టీపీసీసీ పగ్గాలు అప్పగించిన తర్వాత పరిస్థితి మారింది, రేవంత్ దూకుడుతో మళ్లీ కాంగ్రెస్ లో ఆశలు చిగురించాయి. ఇప్పటి వరకూ అక్కడ సెకండ్ ప్లేస్ కాపాడుకుంటూ వస్తున్న కాంగ్రెస్ ఈ ఉప ఎన్నికల్లో అంతకంటే దిగజారకూడదని నిర్ణయించుకుంది. అన్నీ అనుకూలిస్తే హుజూరాబాద్ లో కాంగ్రెస్ విజయం అసాధ్యమేమీ కాదని అంటున్నారు ఆ పార్టీ నేతలు. ఈ క్రమంలో ఇప్పటి వరకూ కేసీఆర్, టీఆర్ఎస్ పైనే విమర్శలు ఎక్కుపెట్టిన రేవంత్ రెడ్డి, తాజాగా బీజేపీపై కూడా ఫోకస్ పెంచారు. బీజేపీ, టీఆర్ఎస్ రెండూ ఒకటేనన్నారు.
ఈటల కేసు ఎటు పోయింది..?
ఈటల రాజేందర్ అసైన్డ్ భూములను ఆక్రమించారని, అవినీతికి పాల్పడ్డారని హడావుడి చేసి ఆయన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ఈటల బీజేపీలో చేరిన తర్వాత దాని గురించి ఆయన ఎందుకు మాట్లాడటం లేదని, విచారణ నివేదికలు ఎటు పోయాయని అన్నారు. ఈటల బీజేపీలో చేరిక సందర్భంగా ఆయనతో చర్చించేందుకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వచ్చిన ప్రైవేట్ విమానం కేసీఆర్ ఏర్పాటు చేసిందేనని ఆరోపించారు. బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ల యాత్రలపై తనదైన శైలిలో స్పందించారు రేవంత్ రెడ్డి. అవి బీజేపీలోని కేసీఆర్ అనుకూల, వ్యతిరేక వర్గాలు చేస్తున్న యాత్రలని అన్నారు.
దత్తత గ్రామాలపై వివక్ష ఎందుకు..?
సీఎం హోదాలో కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామాల్లో అభివృద్ధి శూన్యమని, మేడ్చల్ జిల్లాలోని మూడుచింతలపల్లి కూడా అదే కోవలోకి వస్తుందని అన్నారు రేవంత్ రెడ్డి. ఆ గ్రామం దుస్థితిని మీడియాకు చూపిస్తామన్నారు. అందుకోసమే ఆ గ్రామంలో 24, 25 తేదీల్లో దళిత గిరిజన ఆత్మగౌరవ దీక్ష చేపడుతున్నామని చెప్పారు. మూడో అడుగు కేసీఆర్ నెత్తిమీద పెట్టడం ఖాయమని, ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాను గజ్వేల్ కు వెళ్లడం ఖాయమని అన్నారు రేవంత్ రెడ్డి.