ఈ-కేవైసీ నమోదుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

రేషన్ కార్డు దారులు ఈ కేవైసీ నమోదు చేయించుకోకపోతే రేషన్ కార్డులను తొలగిస్తారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుండడంతో కార్డుదారులు మీసేవ, ఆధార్ కేంద్రాల వద్దకు క్యూ కడుతున్నారు. ఈ కేవైసీ నమోదు పెద్దలకు ఆగస్టు వరకు, పిల్లలకు సెప్టెంబర్ వరకు గడువు ప్రకటించడంతో ఈ కేవైసీ నమోదును త్వరగా పూర్తిచేసుకోవడానికి ప్రజలు మీసేవ, ఆధార్ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేవైసీ నమోదుకు గడువు అంటూ […]

Advertisement
Update:2021-08-19 08:15 IST

రేషన్ కార్డు దారులు ఈ కేవైసీ నమోదు చేయించుకోకపోతే రేషన్ కార్డులను తొలగిస్తారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుండడంతో కార్డుదారులు మీసేవ, ఆధార్ కేంద్రాల వద్దకు క్యూ కడుతున్నారు. ఈ కేవైసీ నమోదు పెద్దలకు ఆగస్టు వరకు, పిల్లలకు సెప్టెంబర్ వరకు గడువు ప్రకటించడంతో ఈ కేవైసీ నమోదును త్వరగా పూర్తిచేసుకోవడానికి ప్రజలు మీసేవ, ఆధార్ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేవైసీ నమోదుకు గడువు అంటూ ఏమీ లేదని.. నమోదు ఎప్పుడైనా చేసుకోవచ్చని ప్రకటించింది. రేషన్ కార్డు దారులు ఈ కేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలని.. అయితే ఇందుకు ఎటువంటి గడువు లేదని, ప్రజలు మీసేవ, ఆధార్ కేంద్రాల వద్దకు వెళ్లడం తగ్గించాలని ప్రభుత్వం కోరింది.

కేంద్ర ప్రభుత్వం కొన్ని నెలల కిందట వన్ నేషన్ -వన్ రేషన్ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రేషన్ కార్డు ఉన్నవాళ్లు దేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరుకులు తీసుకునే వీలు కల్పించింది. ఇందుకోసం దేశంలోని అన్ని రాష్ట్రాలు తమ కార్డుదారులు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకునేలా చూడాలని కోరింది. ఇందులో భాగంగా ప్రతి రేషన్ దారుడు తమ ఆధార్ డేటా తో ఈ కేవైసీ నమోదు చేసుకోవాల్సి ఉంది. రేషన్ కార్డుల్లో పేర్లు ఉన్న ఐదేళ్లలోపు పిల్లలకూ కొత్తగా నమోదు చేయించి ఈ కేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంది.

ఏపీలో ఈ-కేవైసీ నమోదుకు పెద్దలకు ఆగస్టు వరకు పిల్లలకు సెప్టెంబర్ వరకు గడువు ఇవ్వడంతో ఆధార్, మీ సేవా కేంద్రాల వద్దకు జనాలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఈ కేవైసీ నమోదు ప్రక్రియ కోసం గంటల తరబడి అక్కడే నిరీక్షిస్తున్నారు. దానికితోడు ఈ కేవైసీ నమోదు చేయించుకోకపోతే రేషన్ కార్డు రద్దు అవుతుందని ప్రచారం విస్తృతంగా వ్యాపించింది. దీంతో ప్రజలు కూడా తొందరగా ఈ కేవైసీ ప్రక్రియ ముగించుకోవాలని ఆధార్, మీసేవా కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. ఆధార్, మీసేవా కేంద్రాల వద్ద జనం రద్దీని గుర్తించిన ప్రభుత్వం.. కరోనా నేపథ్యంలో జనం ఒకచోట గుమికూడితే వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో ఈ కేవైసీ ప్రక్రియకు గడువు అంటూ ఏమీ లేదని, ప్రజలు ఎప్పుడైనా ఈ కేవైసీని నమోదు చేసుకోవచ్చని తాజాగా ప్రకటించింది.

ఈ కేవైసీ నమోదు చేసుకోకపోతే రేషన్ కార్డు రద్దు చేస్తారనేది అవాస్తవం అని పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో సెక్రటరీ కోన శశిధర్ వెల్లడించారు. రాష్ట్రంలో ఇంకా పది శాతం మంది ఈ కేవైసీ నమోదు చేసుకోవాల్సి ఉందని ఆయన తెలిపారు. గడువు లేకపోయినా ఈ కేవైసీ ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్రంలో మొత్తం 1.48 కోట్ల రేషన్ కార్డుల్లో నాలుగు కోట్ల మందికి పైగా సభ్యులు ఉన్నారు. వీరిలో ఇంకా 35 లక్షల మందికి పైగా ఈ కేవైసీ నమోదు చేయించుకోవాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News