కరోనా వచ్చినా, వరద వచ్చినా.. ఆగని పోలవరం పనులు..
కరోనా కష్టకాలంలో కూడా పోలవరం పనులకు ఆటంకం లేకుండా పరుగులు పెట్టించింది మేఘా ఇంజినీరింగ్ సంస్థ. ఇప్పుడు వరద సమయంలో కూడా ఎక్కడా పనులకు ఆటంకం లేకుండా చూస్తోంది. గోదావరికి వరదనీరు వస్తున్నా కూడా పనులు మాత్రం ఆగలేదు. ఆ విధంగా నిర్మాణ సంస్థ ముందస్తు అంచనాలతో, ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తోంది. ఎగువ కాఫర్ డ్యామ్ పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. 42.5 అడుగుల ఎత్తు వరకు జరగాల్సిన కాఫర్ డ్యామ్ పనులు, ప్రస్తుతం 39 అడుగుల […]
కరోనా కష్టకాలంలో కూడా పోలవరం పనులకు ఆటంకం లేకుండా పరుగులు పెట్టించింది మేఘా ఇంజినీరింగ్ సంస్థ. ఇప్పుడు వరద సమయంలో కూడా ఎక్కడా పనులకు ఆటంకం లేకుండా చూస్తోంది. గోదావరికి వరదనీరు వస్తున్నా కూడా పనులు మాత్రం ఆగలేదు. ఆ విధంగా నిర్మాణ సంస్థ ముందస్తు అంచనాలతో, ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తోంది. ఎగువ కాఫర్ డ్యామ్ పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. 42.5 అడుగుల ఎత్తు వరకు జరగాల్సిన కాఫర్ డ్యామ్ పనులు, ప్రస్తుతం 39 అడుగుల మేరకు చేరుకున్నాయి. దిగువ కాఫర్ డ్యామ్ పనులు 30మీటర్ల ఎత్తు వరకు జరగాల్సి ఉండగా.. ఇప్పుడవి 21 మీటర్లకు చేరుకున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ ప్లాన్ ప్రకారం ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు కొనసాగుతున్నాయి. డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో కలసి సకాలంలో పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
టార్గెట్ ని మించి పనులు..
ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత 2019 నవంబర్ నుంచి మేఘా ఇంజినీరింగ్ సంస్థకు పోలవరం పనులు అప్పజెప్పారు. 2020 ఏప్రిల్ నుంచి 2021 మార్చి వరకు 4.03 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేయాలనేది ప్రభుత్వ టార్గెట్. అయితే అంతకు మించి నిర్మాణ సంస్థ పనుల్లో పురోగతి సాధించింది. మార్చి 2021 లోపు 5.58 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని పూర్తి చేసింది. 48రేడియల్ గేట్లలో 42 గేట్లను అమర్చింది. 96 హైడ్రాలిక్ సిలిండర్లలో 84 సిలిండర్లను అమర్చే ప్రక్రియ కూడా పూర్తయింది.
ఈనెలాఖరులోగా సీఎం జగన్ పర్యటన..
ఈరోజు జరగాల్సిన సీఎం జగన్ పోలవరం ప్రాజెక్ట్ సందర్శన వాయిదా పడిందని, ఈనెలాఖరులోగా ఆయన పోలవరం ప్రాజెక్ట్ పై సమీక్ష నిర్వహిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. ప్రాజెక్ట్ లో మిగిలి ఉన్న పనుల పూర్తి, పునరావాసం, నష్టపరిహారంకు సంబంధించిన పనులపై జగన్ సమీక్ష నిర్వహిస్తారని చెబుతున్నారు.