2వారాల కోవిడ్ కాదు.. ఇది 12వారాల మహమ్మారి..

కోవిడ్ వైరస్ మానవ శరీరంలో కేవలం 2 వారాలు మాత్రమే ఉంటుందని, కరోనా నిర్థారణ అయిన 2 వారాల తర్వాత మరోసారి పరీక్ష చేయిస్తే నెగెటివ్ రిపోర్ట్ వస్తుందని మనకు తెలుసు. కానీ ఈలోపే అంతులేని నష్టాన్ని కలిగిస్తోంది కరోనా వైరస్. అయితే 2వారాల తర్వాత కూడా కరోనా లక్షణాలు వెంటాడతాయని, దాన్ని దీర్ఘకాలిక కోవిడ్ అంటారని ఇటీవల జరిగిన పరిశోధనలు చెబుతున్నాయి. కోవిడ్ వైరస్ 12వారాలపాటు, అంటే దాదాపు 3 నెలల పాటు చాలామందిని ఇబ్బంది […]

Advertisement
Update:2021-06-24 11:23 IST

కోవిడ్ వైరస్ మానవ శరీరంలో కేవలం 2 వారాలు మాత్రమే ఉంటుందని, కరోనా నిర్థారణ అయిన 2 వారాల తర్వాత మరోసారి పరీక్ష చేయిస్తే నెగెటివ్ రిపోర్ట్ వస్తుందని మనకు తెలుసు. కానీ ఈలోపే అంతులేని నష్టాన్ని కలిగిస్తోంది కరోనా వైరస్. అయితే 2వారాల తర్వాత కూడా కరోనా లక్షణాలు వెంటాడతాయని, దాన్ని దీర్ఘకాలిక కోవిడ్ అంటారని ఇటీవల జరిగిన పరిశోధనలు చెబుతున్నాయి. కోవిడ్ వైరస్ 12వారాలపాటు, అంటే దాదాపు 3 నెలల పాటు చాలామందిని ఇబ్బంది పెడుతున్నట్టు తెలుస్తోంది. కోవిడ్ సోకినవారిలో మూడోవంతు మంది 12వారాలపాటు ఆ లక్షణాలతో ఇబ్బందులు పడ్డారని బ్రిటన్ లోని ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశోధన వెల్లడించింది.

ఇంపీరియల్ కాలేజ్ నిర్వహించిన రియాక్ట్‌ (రియల్‌ టైమ్‌ అసెస్‌ మెంట్‌ ఆఫ్‌ కమ్యూనిటీ ట్రాన్స్‌ మిషన్‌) సర్వేలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. కరోనా వైరస్‌ సోకిన వ్యక్తుల్లో మూడో వంతు మందికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లక్షణాలు దాదాపు 12 వారాల పాటు ఉన్నట్లు తేలింది. దాదాపు 5 లక్షల మందిపై ఈ సర్వే చేశారు. ఇంగ్లాండ్‌ లో కనీసం 20 లక్షల మంది దీర్ఘకాలిక కోవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్నట్లు తేలింది. కరోనా తగ్గిపోయిన తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్ లతో వీటిని పోల్చలేమని, కరోనా లక్షణాలే ఎక్కువరోజులు ఉండి ఇబ్బంది పెడుతున్నాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. దీర్ఘకాలిక కరోనా లక్షణాలపై అధ్యయనం చేసేందుకు బ్రిటన్ ప్రభుత్వం 500కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ సర్వేను సెప్టెంబర్‌ 2020 నుంచి ఫిబ్రవరి 2021 మధ్య నిర్వహించారు. ఇందులో కోవిడ్‌ వచ్చి తగ్గిన వారిని ఎంపిక చేసుకుని 29 లక్షణాలపై ప్రశ్నించారు. దీర్ఘకాల కోవిడ్‌ పై అవగాహన తక్కువగా ఉందని, తమ పరిశోధన, చికిత్సావిధానానికి కొంత ఉపయోగపడవచ్చని పేర్కొన్నారు ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌ ప్రొఫెసర్‌ పాల్‌ ఇలియాట్‌.

పరిశోధన ప్రధానాంశాలు..
– కరోనా వచ్చి తగ్గిపోయిన తర్వాత అలసట, దగ్గు, గుండెల్లో నొప్పి, తలనొప్పి, కండరాల నొప్పులు ఉన్నాయి.
– 37శాతం మందిలో 12 వారాలు లేదా అంతకంటే ఎక్కువ రోజులు కనీసం ఒక లక్షణం కొనసాగింది.
– 15 శాతం మందిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ లక్షణాలు 12 వారాలకు పైగా కొనసాగాయి.
– మహిళలు, వృద్ధుల్లో దీర్ఘకాల సమస్యలు ఎక్కువ.
– అధిక బరువు, పొగతాగే అలవాటు, దీర్ఘకాలిక వ్యాధులు కలవారు, తరచూ ఆస్పత్రిపాలయ్యేవారిలో కరోనా లక్షణాలు కూడా దీర్ఘకాలంపాటు ఉన్నాయి.
– ఎక్కువమందిలో అలసట కనిపిస్తోంది. ఆసుపత్రి పాలైనవారిలో మాత్రం శ్వాస సమస్యలు అధికంగా ఉంటున్నాయి.

యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌, కింగ్స్‌ కాలేజ్‌ లండన్‌ లు నిర్వహించిన మరో సర్వేలో కోవిడ్‌ వచ్చి తగ్గిన మధ్య వయస్కుల్లో ప్రతి ఆరుగురిలో ఒకరికి దీర్ఘకాల లక్షణాలు కనిపిస్తున్నట్లు గుర్తించారు.

Tags:    
Advertisement

Similar News