స్టెరాయిడ్స్ కంటే షుగరే డేంజర్..
కరోనా తర్వాత ఇప్పుడు భారత్ ను బ్లాక్ ఫంగస్ ఎక్కువగా భయపెడుతోంది. కరోనా కంటే ముందే బ్లాక్ ఫంగస్ ఉన్నా కూడా.. ఇప్పుడు దీని ప్రభావం మరింత ఎక్కువైంది. కరోనా ఫస్ట్ వేవ్ లో కూడా బ్లాక్ ఫంగస్ జాడలేదు, సెకండ్ వేవ్ లో విజృంభిస్తోంది. అసలు బ్లాక్ ఫంగస్ సోకడానికి ప్రధాన కారణం ఏంటి అని జరిగిన పరిశోధనలన్నీ స్టెరాయిడ్ మందులవైపే వేలెత్తి చూపిస్తున్నాయి. కరోనా నివారణకు కేవలం పారాసెట్మాల్, సిట్రజిన్ వాడినప్పుడు బ్లాక్ ఫంగస్ […]
కరోనా తర్వాత ఇప్పుడు భారత్ ను బ్లాక్ ఫంగస్ ఎక్కువగా భయపెడుతోంది. కరోనా కంటే ముందే బ్లాక్ ఫంగస్ ఉన్నా కూడా.. ఇప్పుడు దీని ప్రభావం మరింత ఎక్కువైంది. కరోనా ఫస్ట్ వేవ్ లో కూడా బ్లాక్ ఫంగస్ జాడలేదు, సెకండ్ వేవ్ లో విజృంభిస్తోంది. అసలు బ్లాక్ ఫంగస్ సోకడానికి ప్రధాన కారణం ఏంటి అని జరిగిన పరిశోధనలన్నీ స్టెరాయిడ్ మందులవైపే వేలెత్తి చూపిస్తున్నాయి. కరోనా నివారణకు కేవలం పారాసెట్మాల్, సిట్రజిన్ వాడినప్పుడు బ్లాక్ ఫంగస్ కనపడలేదు. సెకండ్ వేవ్ లో స్టెరాయిడ్స్ వాడకం ఎక్కువైంది, దీంతో బ్లాక్ ఫంగస్ కేసులు కూడా ఎక్కువయ్యాయి. అయితే సమస్య స్టెరాయిడ్స్ తోనా, అదుపులో లేని షుగర్ లెవల్స్ తోనా ఆనేది ఇప్పుడు మరో కీలక అంశంగా మారింది.
ప్రపంచ దేశాలన్నీ కరోనా చికిత్సకు వేర్వేరు మందులు వాడుతున్నా.. సత్వరం శరీరం కోలుకోడానికి స్టెరాయిడ్స్ ఇస్తున్నారు వైద్యులు. మరి బ్లాక్ ఫంగస్ కేసులు కేవలం భారత్ లోనే ఎందుకు ఎక్కువగా ఉన్నాయంటే.. ఇక్కడ మధుమేహ రోగుల సంఖ్య అధికం కాబట్టి. అవును షుగర్ రోగులు భారత్ లో ఎక్కువ కాబట్టి, ఆటోమేటిక్ గా బ్లాక్ ఫంగస్ బాధితులు కూడా ఇక్కడే ఎక్కువగా ఉన్నారు. షుగర్ లెవల్స్ ని అదుపులో ఉంచుకుంటే బ్లాక్ ఫంగస్ దాడి చేసే అవకాశాలు తక్కువ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే కరోనా చికిత్సలో వాడుతున్న స్టెరాయిడ్స్ వల్ల కూడా షుగర్ లెవల్స్ పెరిగే అవకాశముంది. కరోనా చికిత్స పూర్తయిన తర్వాత ఆ మందుల ప్రభావంతో కొందరిలో అసాధారణంగా షుగర్ లెవల్స్ పెరిగిపోతున్నాయి. మరికొందరిలో కొత్తగా డయాబెటిస్ బయటపడుతోంది. అంటే పరోక్షంగా స్టెరాయిడ్స్ కారణం అని తేలుతున్నా.. షుగర్ ని కంట్రోల్ లో ఉంచుకోవడం మాత్రం ముఖ్యం. ప్రస్తుత పరిస్థితుల్లో డయాబెటిక్ పేషెంట్లు ఎవరైనా.. షుగర్ ని నియంత్రణలో ఉంచుకుంటే.. ఒకవేళ కరోనా వచ్చినా, వచ్చి తగ్గిపోయినా పెద్ద ప్రమాదం ఉండదు. కరోనా సోకినా, అది తగ్గిన తర్వాత బ్లాక్ ఫంగస్ వస్తుందనే భయం ఉండదు.
కొవిడ్ నుంచి బయటపడినవారు పరిశుభ్రత, మంచి ఆహారం, షుగర్ ను అదుపులో ఉంచుకోవడం వంటి నియమాలు పాటిస్తే.. బ్లాక్ ఫంగస్ సోకే అవకాశాలు తక్కువ. ఒకవేళ బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనపడినా.. త్వరగా చికిత్స ప్రారంభిస్తే మెదడుకు పాకకుండా నివారించి, ప్రాణాపాయం నుంచి బయట పడవచ్చని నిపుణులు చెబుతున్నారు.