ఏపీకి మరిన్ని `మేఘా` ఆక్సిజన్ ట్యాంకులు
ఆంధ్రప్రదేశ్ లో ఆక్సిజన్ రవాణా సమస్యకు శాశ్వత పరిష్కారం లభించబోతోంది. బుధవారం రాత్రికి లేదా గురువారం ఉదయానికల్లా మేఘా సంస్థకు చెందిన ఆక్సిజన్ ట్యాంకర్లు ఏపీకి వచ్చేస్తాయి. మొత్తం మూడు ట్యాంకర్లు, ఒక్కో ట్యాంక్ కోటీ 40లక్షల లీటర్ల ఆక్సిజన్ తో దుర్గాపూర్ రూర్కెలా ఉక్కు కర్మాగారం నుంచి ఏపీకి ఆక్సిజన్ తెస్తున్నాయి. ఈరోజే ఈ మూడు ట్యాంకర్లు సింగపూర్ నుంచి దిగుమతి అయ్యాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజల అవసరాల నిమిత్తం 3 క్రయోజనిక్ ఆక్సిజన్ […]
ఆంధ్రప్రదేశ్ లో ఆక్సిజన్ రవాణా సమస్యకు శాశ్వత పరిష్కారం లభించబోతోంది. బుధవారం రాత్రికి లేదా గురువారం ఉదయానికల్లా మేఘా సంస్థకు చెందిన ఆక్సిజన్ ట్యాంకర్లు ఏపీకి వచ్చేస్తాయి. మొత్తం మూడు ట్యాంకర్లు, ఒక్కో ట్యాంక్ కోటీ 40లక్షల లీటర్ల ఆక్సిజన్ తో దుర్గాపూర్ రూర్కెలా ఉక్కు కర్మాగారం నుంచి ఏపీకి ఆక్సిజన్ తెస్తున్నాయి. ఈరోజే ఈ మూడు ట్యాంకర్లు సింగపూర్ నుంచి దిగుమతి అయ్యాయి.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజల అవసరాల నిమిత్తం 3 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకులను ప్రభుత్వానికి ఉచితంగా అందిస్తోంది మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ సంస్థ. సింగపూర్ నుంచి ఈ ట్యాంకర్లను మేఘా సంస్థ దిగుమతి చేసుకుంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు సింగపూర్ లో బయలుదేరిన భారత వైమానికదళ ప్రత్యేక విమానం రాత్రి ఏడు గంటలకు పశ్చిమబెంగాల్ లోని పానాగఢ్ వైమానిక స్థావరానికి మూడు క్రయోజనిక్ ట్యాంకులతో చేరుకుంది. క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకులను విమానం నుంచి దించిన వెంటనే ప్రత్యేక వాహనాల్లో 35 కిలోమీటర్ల దూరంలోని దుర్గాపూర్ ఉక్కు కర్మాగారానికి తరలించారు. ఆ ఉక్కు కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన విషయం తెలిసిందే. మూడు క్రయోజనిక్ ట్యాంకర్లు అక్కడ ఆక్సిజన్ నింపుకుని ఏపీకి వస్తాయి. ఆక్సిజన్ ట్యాంకులు రైలు మార్గం ద్వారా బుధవారం రాత్రికి లేదా గురువారం ఉదయానికి రాష్ట్రానికి చేరుకుంటాయని ఎంఈఐఎల్ వైస్ ప్రెసిడెంట్ పి. రాజేశ్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకులను తెలంగాణా ప్రభుత్వానికి మేఘా ఇంజనీరింగ్ థాయిలాండ్ నుంచి దిగుమతి చేసుకుని ఉచితంగా అందించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర రక్షణ, విదేశాంగ మంత్రిత్వ శాఖలు సింగపూర్ ప్రభుత్వం సమన్వయంతో త్వరితగతిన ట్యాంకర్లు దిగుమతి చేసుకుంది మేఘా సంస్థ.
ఆంధ్ర ప్రదేశ్ కు అందించే మూడు ట్యాంకర్ల ద్వారా 4.20 కోట్ల లీటర్ల ఆక్సిజన్ ను సరఫరా చేయవచ్చు. ఈ క్రయోజనిక్ ట్యాంకర్లను రాష్ట్ర ప్రభుత్వం తమ అవసరాలకు తగిన విధంగా వినియోగించుకుంటుంది. ఏపీకి కేటాయించిన ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల నుంచి లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ను తీసుకువచ్చి నేరుగా ఆసుపత్రులకు ఇవి అందచేస్తాయి. అదే సమయంలో అవసరాన్ని బట్టి నేరుగా ఆసుపత్రులకు సరఫరా చేసే విధంగా కూడా ఈ ట్యాంకర్లను ఉపయోగిస్తారు.
ఏపీ సీఎం వైఎస్. జగన్ మోహన్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారుల కమిటీ ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తోంది. ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలు దృష్టి లో ఉంచుకొని ఆక్సిజన్ సరఫరాకు క్రయోజనిక్ ట్యాంకర్స్ ను సింగపూర్ నుండి మేఘా ఇంజనీరింగ్ సంస్థ దిగుమతి చేసుకుంది. దేశంలో సరిపడా ఆక్సిజన్ ఉన్నా దాన్ని సరఫరా చేయడానికి అవసరమైన ట్యాంకులు, రవాణా లాంటి సదుపాయాలు లేకపోవడంతో ప్రాణవాయువు అవసరమైన వారికి అందడం లేదు. మన దేశంలో ఒక్కొక్క క్రయోజనిక్ ట్యాంకర్ తయారు చేయడానికి కనీసం మూడు నెలల సమయం పడుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాలంతో పోటీ పడి ట్యాంకర్లను సిద్ధం చేయాలి. అందుకే ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో గాలించి సింగపూర్ నుండి 3 క్రయోజనిక్ ట్యాంకర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోసం మేఘా ఇంజనీరింగ్ దిగుమతి చేసుకుంది.
కరోనా సమయంలో తమ వంతుగా దేశానికి సేవ చేయడం బాధ్యతగా ఎంఈఐఎల్ భావిస్తోంది. దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేయడం కోసం ప్రత్యేకంగా ఒక బృందం పనిచేస్తోంది. కరోనా సంక్షోభం తీవ్ర రూపం దాల్చి ఆక్సిజన్ కొరత అధికమవుతున్నప్పటి నుంచి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేస్తోంది. అందులో భాగంగా సంస్థ ఉన్నతస్థాయి యాజమాన్యమే కాకుండా మొత్తం యంత్రాంగం ఇదే పనిలో నిమగ్నమయ్యింది.
తెలంగాణలోని బొల్లారంలో గల ఎంఈఐఎల్ ప్లాంట్ లో ఆక్సిజన్ ను నిరంతరాయంగా ఉత్పత్తి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఉచితంగా సరఫరా చేస్తున్నారు. ఇది పూర్తిగా కోవిడ్ రోగుల అవసరాలకోసం అందిస్తున్నారు. ఒక్కొక్క సిలిండర్ సామర్థ్యం 7000 లీటర్లు కాగా రోజుకు సరాసరిన 400 సిలిండర్లను 17 ఆసుపత్రులకు సరఫరా చేస్తున్నారు. మే 9 నుంచి మే 31 వరకు 56014 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను ఎంఈఐఎల్ ఇలా సరఫరా చేసింది. ఇందుకోసం ఎంఈఐఎల్ ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది.