కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్న తెలంగాణ లాక్ డౌన్..
నాలుగు రోజుల క్రితం వరకు అసలు లాక్ డౌన్ వద్దే వద్దని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. హడావిడిగా ఆంక్షలు అమలు చేయడం, అందులోనూ కేవలం 4 గంటల సేపు మాత్రమే వ్యాపార కార్యకలాపాలకు అనుమతివ్వడం కొత్త సమస్యలు తెచ్చి పెడుతోంది. ఉదయం 6 గంటలనుంచి 10 గంటల వరకే నిత్యావసరాల కొనుగోలుకి అనుమతి ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, అదే సమయంలో కరోనా వ్యాప్తికి పరోక్షంగా కారణం అవుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ సమస్య […]
నాలుగు రోజుల క్రితం వరకు అసలు లాక్ డౌన్ వద్దే వద్దని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. హడావిడిగా ఆంక్షలు అమలు చేయడం, అందులోనూ కేవలం 4 గంటల సేపు మాత్రమే వ్యాపార కార్యకలాపాలకు అనుమతివ్వడం కొత్త సమస్యలు తెచ్చి పెడుతోంది. ఉదయం 6 గంటలనుంచి 10 గంటల వరకే నిత్యావసరాల కొనుగోలుకి అనుమతి ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, అదే సమయంలో కరోనా వ్యాప్తికి పరోక్షంగా కారణం అవుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ సమస్య తీవ్రంగా కనపడుతోంది. ప్రయాణం తప్పనిసరి కావడంతో.. 4గంటల్లోనే అన్నీ ముగించుకోడానికి ప్రజలు నిబంధనలు గాలికొదిలేశారు. మాస్క్ ధారణ, సామాజిక దూరం, శానిటైజర్ వాడకం ఇవేవీ పట్టించుకోకుండా ఆ 4 గంటల సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు తాపత్రయ పడుతున్నారు. అందుకే హైదరాబాద్ లో ప్రతి షాపు కరోనా హాట్ స్పాట్ గా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో దాదాపు అన్నిచోట్ల షాపుల ముందు ప్రజలు గుంపులు గుంపులుగా కనపడుతున్నారు. నిత్యావసర వస్తువులతోపాటు, మద్యం షాపుల ముందు తీవ్ర రద్దీ కనపడుతోంది. ఇక కూరగాయలు, చికెన్, మటన్ షాపులు, మెడికల్ షాపుల సంగతి సరే సరి. ఇలా ఉంటే లాక్ డౌన్ పెట్టి కూడా ఉపయోగం లేదని తెలుస్తోంది.
వారం రోజులపాటు నిల్వ చేసుకుని వాడుకునే వస్తువులకు సైతం ప్రతిరోజూ అవకాశం ఉంది కదా అని రోడ్లపైకి వచ్చేస్తున్నారు ప్రజలు. పోలీసులు కూడా 10 దాటితే ఎక్కడివారినక్కడ చెదరగొట్టే ప్రయత్నాల్లో ఉంటున్నారే కానీ, ఆ లోపు ఎవరినీ పట్టించుకోవడంలేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. లాక్ డౌన్ ప్రారంభమైన తొలిరోజుతోపాటు.. నాలుగో రోజైన నేడు కూడా పరిస్థితి ఇలాగే ఉంది. నగర వాసులు ఒక్కసారిగా బయటకు రావడంతో ఉదయం 6 గంటలనుంచి 10గంటల వరకు రోడ్లన్నీ రద్దీగా కనిపిస్తున్నాయి. 4 గంటలసేపు నగరంలో కలియదిరిగే వారిలో ఏ ఒక్కరికి వైరస్ ఉన్నా వారు సూపర్ స్ప్రైడర్లుగా మారే ప్రమాదం ఉంది. వైరస్ ఉన్నా లక్షణాలు కనపడనివారంతా తెలిసీ తెలియక చాలామందికి కరోనాని అంటిస్తున్నారు.
భారీగా పెరిగిన నిత్యావసరాల రేట్లు..
లాక్ డౌన్ విధించి నాలుగురోజులే అవుతున్నా.. నిత్యావసరాలకు రెక్కలొచ్చాయి. స్టాక్ లేదని, రవాణా సమస్యగా ఉందని వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి రేట్లు పెంచి అమ్మేస్తున్నారు. మాల్స్, హోల్ సేల్ మార్కెట్లలో రద్దీ విపరీతంగా ఉండటంతో.. చిన్న చిన్న షాపులు లాక్ డౌన్ టైమ్ ని క్యాష్ చేసుకుంటున్నాయి.