ఇంటింటి సర్వేతో వాస్తవాలు ఇలా బైటపడుతున్నాయి..
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే సత్ఫలితాలనిస్తోంది. సగటున వారానికి తెలంగాణలో 25వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతుండగా.. వారం పాటు చేపట్టిన ఇంటింటి సర్వేలో ఏకంగా లక్షన్నర మంది కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నట్టు తేలింది. వీరంతా కరోనా బాధితులు అని చెప్పలేం కానీ, కరోనా సోకే ముప్పు అత్యథికంగా ఉన్నవారేనని చెప్పాలి. ఇలాంటి వారంతా వ్యాధి నిర్ధారణ పరీక్షలకు దూరంగా ఉండటం గమనార్హం. అందుబాటులో ఉన్న మందులను వాడుకుంటూ, డాక్టర్లను సంప్రదించకుండా ప్రాణాలను రిస్క్ లో […]
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే సత్ఫలితాలనిస్తోంది. సగటున వారానికి తెలంగాణలో 25వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతుండగా.. వారం పాటు చేపట్టిన ఇంటింటి సర్వేలో ఏకంగా లక్షన్నర మంది కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నట్టు తేలింది. వీరంతా కరోనా బాధితులు అని చెప్పలేం కానీ, కరోనా సోకే ముప్పు అత్యథికంగా ఉన్నవారేనని చెప్పాలి. ఇలాంటి వారంతా వ్యాధి నిర్ధారణ పరీక్షలకు దూరంగా ఉండటం గమనార్హం. అందుబాటులో ఉన్న మందులను వాడుకుంటూ, డాక్టర్లను సంప్రదించకుండా ప్రాణాలను రిస్క్ లో పెడుతున్నారు. ప్రస్తుతం ఇంటింటి సర్వేతో వీరందరికీ హోం ఐసోలేషన్ కిట్లు పంపిణీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. అవసరం ఉన్నవారిని ఆస్పత్రులో చేర్పించింది. వీరితోపాటు.. ఓపీ సేవల్లో దాదాపు 14 లక్షలకు పైగా ఐసోలేషన్ కిట్లు అందించినట్టు వైద్య వర్గాలు తెలిపాయి.
కరోనా పరీక్షల్లో వ్యాధి నిర్ధారణ తర్వాత ఎవరికి వారే జాగ్రత్తలు పాటిస్తున్నా.. అంతకు ముందు వరకు మాత్రం సూపర్ స్ప్రైడర్లుగానే ఉంటున్నారు. తమకు వ్యాధి ఉందని తెలియక సమూహాల్లో తిరుగుతూ తమ చుట్టూ ఉన్నవారికి, కుటుంబ సభ్యులకు కూడా వైరస్ ని అంటిస్తున్నారు. ఇలాంటి వారిని గుర్తించేందుకే ఇంటింటి సర్వే చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం కోవిడ్ లక్షణాలున్న వారందర్నీ గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.
ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 1,064 కేంద్రాల్లో ఉచితంగా కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ లో రోజూ సుమారు లక్షన్నర మందికి పరీక్షలు జరిపిన సిబ్బంది, ఇప్పుడు మాత్రం కేవలం 60నుంచి 70వేల పరీక్షలు మాత్రమే చేస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్దకు వచ్చి రోజూ వెనుదిరిగిపోయేవారు కూడా ఉన్నారు. వీరిలో కోవిడ్ ఉన్నవారు, అనుమానితులు, అసలు లేనివారు కూడా ఉంటారు. పరీక్షా కేంద్రాల వద్ద రద్దీతో వీరిలో చాలామందికి కొత్తగా వైరస్ సోకిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. అసలు వైరస్ సోకిందని నిర్థారణ కాకుండానే దాని ప్రభావంతో చనిపోయినవారు కూడా ఉన్నారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వారు అవగాహన లోపంతో బాధితులుగా మారి, ఆఖరి నిమిషంలో ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. అప్పటికే పరిస్థితి చేయిదాటిపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటి వరకూ ఇలాంటి వారిని గుర్తించడం మందులు అందించడం జరగ లేదు. ప్రస్తుతం ఇంటింటి సర్వేలో ప్రభుత్వ సిబ్బంది.. గ్రామాలు, పట్టణాల్లో తిరుగుతూ జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి తదితర సమస్యలున్నవారిని గుర్తిస్తున్నారు, సకాలంలో మందులు అందిస్తున్నారు. ఇంటింటి సర్వేతో వైరస్ మరీ ఉధృతంగా వ్యాపించకుండా అడ్డుగట్ట వేయగలుగుతున్నామని చెబుతున్నారు అధికారులు.