వ్యాక్సిన్ కొరత అధిగమించడానికి అదొక్కటే మార్గం..
ప్రతిపక్షాలు విమర్శించినా, కేంద్రం సర్ది చెప్పుకున్నా.. దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ కొరత ఉందన్న మాట వాస్తవం. పలు చోట్ల కొవిడ్ వ్యాక్సిన్ కోసం రాష్ట్రాలు కేంద్రానికి అభ్యర్థనలు పంపిస్తున్న ఉదాహరణలున్నాయి. చాలా చోట్ల కోవిడ్ టీకా నిండుకుందనే బోర్డులు కూడా దర్శనమిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 10.85 కోట్ల వ్యాక్సిన్ డోసులు మాత్రమే పంపిణీ చేయగలిగారు అధికారులు. ఈ దశలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా విదేశాల్లో అభివృద్ధి చేసిన టీకాలకు భారత్ అనుమతి […]
ప్రతిపక్షాలు విమర్శించినా, కేంద్రం సర్ది చెప్పుకున్నా.. దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ కొరత ఉందన్న మాట వాస్తవం. పలు చోట్ల కొవిడ్ వ్యాక్సిన్ కోసం రాష్ట్రాలు కేంద్రానికి అభ్యర్థనలు పంపిస్తున్న ఉదాహరణలున్నాయి. చాలా చోట్ల కోవిడ్ టీకా నిండుకుందనే బోర్డులు కూడా దర్శనమిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 10.85 కోట్ల వ్యాక్సిన్ డోసులు మాత్రమే పంపిణీ చేయగలిగారు అధికారులు. ఈ దశలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
సాధారణంగా విదేశాల్లో అభివృద్ధి చేసిన టీకాలకు భారత్ అనుమతి ఇవ్వాలంటే, ఇక్కడే రెండో దశ, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాలి. దీంతో స్పుత్నిక్-వి, నోవావాక్స్ టీకాల ప్రయోగాలు భారత్ లో కూడా ఆయా కంపెనీలు చేపట్టాయి. ఇవి విదేశాల్లో అనుమతులు పొందినప్పటికీ భారత్ లో వినియోగంలోకి రావడానికి కొంత ఆలస్యం అవుతోంది. ఈ నేపథ్యంలో వీటి ప్రయోగాలు, ఫలితాల విశ్లేషణ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది.
వారం రోజుల ప్రయోగాలు..
ప్రపంచ ఆరోగ్యసంస్థ జాబితాలో ఉన్న అమెరికా ఎఫ్.డి.ఎ., ఈఎంఎ, బ్రిటన్ ఎంహెచ్‌ఆర్‌ఏ, జపాన్ పీఎండీఏ వంటి విదేశీ ఔషధ నియంత్రణ సంస్థలు ఇప్పటికే ఆయా దేశాల్లో పలు టీకాలకు ఆమోదం తెలిపాయి. ఇలా ఇతర దేశాలు ఆమోదం తెలిపిన వ్యాక్సిన్ లకు భారత్ లో కూడా అత్యవసర వినియోగం కింద అనుమతి ఇచ్చేందుకు వ్యాక్సిన్ లపై ఏర్పాటు చేసిన జాతీయ నిపుణుల బృందం కీలక సిఫార్సు చేసింది. విదేశాల్లో అనుమతి పొందిన టీకాలను భారత్ లో అనుమతించే ముందు.. తొలుత 100మంది వాలంటీర్లకు ఇచ్చి వాటి భద్రత, ఫలితాలపై వారం పాటు విశ్లేషించి అనుమతి జారీ చేయొచ్చని సూచించింది. ఈమేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. వ్యాక్సిన్ కొరతకు ఇదే సరైన చర్య అని కేంద్రం తెలిపింది. దేశీయంగా వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచడంతో పాటు వివిధ దేశాల్లో అనుమతి పొందిన టీకాలకు అత్యవసర వినియోగానికి అనుమతించి, కొరతను అధిగమించవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఇప్పటికే స్పుత్నిక్-వి టీకాకు డీసీజీఐ అనుమతి మంజూరు చేసిన విషయం తెలిసిందే. మరికొన్ని నెలల్లోనే జాన్సన్ అండ్ జాన్సన్, జైడస్ క్యాడిలా, నోవావాక్స్, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన నాసల్ డ్రాప్స్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది.