భయంపోవడమే అత్యంత ప్రమాదకరం..
కరోనా ఫస్ట్ వేవ్, కరోనా సెకండ్ వేవ్.. ఈ రెండిటి మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తోంది. కరోనా తొలి దశలో ప్రజలు వైరస్ పేరు చెబితేనే వణికిపోయేవారు. ఎవర్ని చూసినా అనుమానం, ఏ వస్తువు తాకాలాన్నా భయం, జలుబు ఉన్నవారు పక్కకు వస్తే భయపడి పారిపోయే రోజులవి. కోవిడ్ భయంతో చాలామంది ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు పెట్టారు. కానీ ఇప్పుడు జనంలో ఆ భయం పోయింది. రెండో దశలో కేసుల సంఖ్య పెరుగుతున్నా ఎవరూ వైద్యానికి తొందరపడటంలేదు. […]
కరోనా ఫస్ట్ వేవ్, కరోనా సెకండ్ వేవ్.. ఈ రెండిటి మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తోంది. కరోనా తొలి దశలో ప్రజలు వైరస్ పేరు చెబితేనే వణికిపోయేవారు. ఎవర్ని చూసినా అనుమానం, ఏ వస్తువు తాకాలాన్నా భయం, జలుబు ఉన్నవారు పక్కకు వస్తే భయపడి పారిపోయే రోజులవి. కోవిడ్ భయంతో చాలామంది ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు పెట్టారు. కానీ ఇప్పుడు జనంలో ఆ భయం పోయింది. రెండో దశలో కేసుల సంఖ్య పెరుగుతున్నా ఎవరూ వైద్యానికి తొందరపడటంలేదు.
గడచిన 24గంటల్లో ఏపీలో 585 కేసులు నమోదయ్యాయి. అయితే వీరిలో కేవలం 42మంది మాత్రమే ఆస్పత్రుల్లో చేరారు. మిగతా 543మంది హోమ్ ఐసోలేషన్లో ఉండటానికే ఇష్టపడ్డారు. ఆస్పత్రుల్లో చేర్పిస్తామన్నా కూడా ఒప్పుకోలేదు. గతంలో బలవంతంగా అందర్నీ ఆస్పత్రులకు తరలించారు కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. అందుకే ఆ 543మంది తమ ఇష్టానికి ఇళ్లలోనే ఉంటామన్నారు. అయితే ఇలా ఇంట్లోనే ఉంటామని చెప్పిన పాజిటివ్ పేషెంట్లు క్వారంటైన్ పీరియడ్ పూర్తయ్యే వరకు జాగ్రత్తగా ఉంటున్నారా? అంటే అనుమానమే. పాజిటివ్ వచ్చినా, శరీరం సహకరిస్తే.. అన్ని పనులు చేసుకోవడానికే చాలామంది సిద్ధపడుతున్నారు. ఇంట్లో వరకు ప్రత్యేక గదిలో ఉంటున్నా.. బయటికొస్తే మాత్రం అందరితో కలసిపోతున్నారు. భయం లేకుండా తిరిగేస్తున్నారు.
కరోనా అంటే భయం పోవడమే ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన విషయం అని అర్థమవుతోంది. పాజిటివ్ పేషెంట్లంతా జనంలో తిరిగేస్తున్నారు. తెలిసో, తెలియకో వారికి దగ్గరగా ఉన్నవారంతా కరోనా బారిన పడుతున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్నవారిలో నిర్లక్ష్యం పాళ్లు మరింత ఎక్కువగా ఉన్నాయనే విషయం కూడా బయటపడుతోంది. వ్యాక్సిన్ వేయించుకున్నాం, ఇక మాకు కరోనా రాదు అనుకుంటూ మాస్కుల్లేకుండా తిరిగేస్తున్నారు. సెకండ్ వేవ్ మొదలైన తర్వాత కేసుల సంఖ్య విపరీతంగా పెరగడానికి ఇవే ప్రాథమిక కారణాలని చెబుతున్నారు నిపుణులు. గతంలో లాగా పాజిటివ్ వచ్చినవారు ఇల్లు కదలకుండా కఠిన నిబంధనలు అమలులోకి తెస్తేనే.. ప్రయోజనం ఉంటుందని అంటున్నారు. వ్యాక్సిన్ వేసుకున్నా జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనన్న ప్రచారం చేపట్టాలి. కరోనా పట్ల ప్రజల్లో భయం పోవడం ఒకరకంగా సంతోషకరమైన విషయమే అయినా, అదే ఇప్పుడు అసలు సమస్యగా మారడం మాత్రం ఆందోళనకరం. సెకండ్ వేవ్ కి అదే ఆజ్యం.