బీజేపీ దూకుడుకి కళ్లెం పడినట్టేనా..?
దుబ్బాక ఉప ఎన్నికలో అధికార పార్టీకి చుక్కలు చూపించిన తర్వాత తెలంగాణ బీజేపీ నేతల్లో ఆత్మవిశ్వాసం రెట్టింపయింది. అదే ఊపులో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అదిరిపోయే ఫలితాలు సాధించారు. మేయర్ పదవి దక్కకపోయినా గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీయే అసలైన విజేత అని చెప్పుకోవాలి. ఈ రెండు ఎన్నికలు ఇచ్చిన ఉత్సాహంతో సాగర్ ఉప ఎన్నికలకు సన్నద్ధమవుతున్న వేళ, మధ్యలో వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఆ పార్టీకి స్పీడ్ బ్రేకర్లుగా అడ్డుపడ్డాయి. ఒకచోట సిటింగ్ స్థానం పోగొట్టుకోవడం, మరోచోట నాలుగో […]
దుబ్బాక ఉప ఎన్నికలో అధికార పార్టీకి చుక్కలు చూపించిన తర్వాత తెలంగాణ బీజేపీ నేతల్లో ఆత్మవిశ్వాసం రెట్టింపయింది. అదే ఊపులో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అదిరిపోయే ఫలితాలు సాధించారు. మేయర్ పదవి దక్కకపోయినా గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీయే అసలైన విజేత అని చెప్పుకోవాలి. ఈ రెండు ఎన్నికలు ఇచ్చిన ఉత్సాహంతో సాగర్ ఉప ఎన్నికలకు సన్నద్ధమవుతున్న వేళ, మధ్యలో వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఆ పార్టీకి స్పీడ్ బ్రేకర్లుగా అడ్డుపడ్డాయి. ఒకచోట సిటింగ్ స్థానం పోగొట్టుకోవడం, మరోచోట నాలుగో స్థానానికి పడిపోవడంతో బీజేపీ శ్రేణులు డీలా పడ్డాయి. ఫలితాలు తమకు ఇంత అనుకూలంగా ఉంటాయని బహుశా టీఆర్ఎస్ కూడా ఊహించి ఉండదు. హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానంలో స్వతంత్ర అభ్యర్థికి మద్దతిస్తామంటూ చివరి వరకు తర్జన భర్జనలు పడి.. ఆఖరున పీవీ కుమార్తెకు అవకాశమిచ్చి ఆ సీటు కూడా గెలుచుకుంది టీఆర్ఎస్. రెండుచోట్లా గెలవడంతో ఆ పార్టీ శ్రేణులు పండగ చేసుకుంటున్నాయి.
బీజేపీ అంతర్మథనం..
వరుస ఓటములతో డీలా పడ్డ టీఆర్ఎస్, ఇతర పార్టీల మద్దతుతో బీజేపీని ఒంటరిని చేసిందని, అందుకే తమకి ఓటమి ఎదురైందని అంటున్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. తెలంగాణలో తన పార్టీకి పుట్టగతులుండవని తెలుసుకున్న కేసీఆర్, తాను బయటకు రాకుండా వేరే పార్టీ నేత ముఖం పెట్టుకుని వచ్చారని మండిపడ్డారు. అయితే ఊహించని విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓట్ షేర్ పెరిగిందని చెప్పారాయన. 70 శాతం మంది ఓటర్లు టీఆర్ఎస్ ను వ్యతిరేకించినట్టు స్పష్టమైందని లాజిక్ తీశారు. ఓట్లు చీలడంతో పాటు కోట్లు ఖర్చు పెట్టి టీఆర్ఎస్ గెలిచిందని ఎద్దేవా చేశారు. మరోవైపు ఉద్యోగులను మానసికంగా ఇబ్బంది పెట్టి, పీఆర్సీ ఇవ్వరనే భయాన్ని వారిలో కలుగజేసి టీఆర్ఎస్ గెలిచింది కానీ, ఆ పార్టీపై పట్టభద్రులకు ఏమాత్రం ప్రేమ లేదని అన్నారు సంజయ్.
సాగర్ పరిస్థితి ఏంటి..?
ఎమ్మెల్సీ ఫలితాలు ఒకరకంగా టీఆర్ఎస్ కి నైతిక బలాన్నిచ్చాయి. అటు బీజేపీ దూకుడుకి కళ్లెం వేశాయి. బీజేపీది జాక్ పాట్ విజయం అని ఎమ్మెల్సీ ఫలితాలతో తేలిందని టీఆర్ఎస్ నుంచి ఆల్రడీ అటాక్ మొదలైంది. కానీ కమలదళం మాత్రం తగ్గేది లేదంటోంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టింది. దుబ్బాక ఫలితాన్ని రిపీట్ చేస్తామంటూ ఈపాటికే సవాళ్లు విసురుతోంది బండి సంజయ్ బ్యాచ్. అటు అధిష్టానం నుంచి కూడా ఫుల్ సపోర్ట్ ఉండటంతో.. ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తామంటున్నారు. దుబ్బాక, గ్రేటర్, ఎమ్మెల్సీ ఎన్నికలు లీగ్ మ్యాచ్ లు అయితే.. రేపు జరగబోయే సాగర్ ఉప ఎన్నిక ఫైనల్ మ్యాచ్ లాంటిది. తెలంగాణలో నిజంగానే టీఆర్ఎస్ పై వ్యతిరేకత పెరుగుతోందా, బీజేపీ నిజంగానే బలపడుతోందా అనే ప్రశ్నలకు సాగర్ ఫలితమే సమాధానం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.