మున్సిపల్ ఫలితం.. 3 రాజధానులకు ప్రజామోదం

మీకు పౌరుషం లేదా, మీలో చేవ చచ్చిందా.. వైసీపీని గెలిపిస్తే మూడు రాజధానులకు మద్దతు తెలిపినట్టేనని చంద్రబాబు విజయవాడ, గుంటూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రజలపై విరుచుకుపడ్డారు. పరోక్షంగా మున్సిపల్ ఎన్నికలను మూడు రాజధానుల అంశానికి రెఫరెండంగా మార్చేశారు. అయితే ఫలితాలతో ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. గుంటూరు, విజయవాడే కాదు.. ఏపీలో అన్నిచోట్లా వైసీపీకే పట్టం కట్టారు. దీంతో వైసీపీ నేతలు చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని విజయవాడ, గుంటూరు ప్రజలు సమర్థించారని, చంద్రబాబుకి పౌరుషం […]

Advertisement
Update:2021-03-15 02:50 IST

మీకు పౌరుషం లేదా, మీలో చేవ చచ్చిందా.. వైసీపీని గెలిపిస్తే మూడు రాజధానులకు మద్దతు తెలిపినట్టేనని చంద్రబాబు విజయవాడ, గుంటూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రజలపై విరుచుకుపడ్డారు. పరోక్షంగా మున్సిపల్ ఎన్నికలను మూడు రాజధానుల అంశానికి రెఫరెండంగా మార్చేశారు. అయితే ఫలితాలతో ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. గుంటూరు, విజయవాడే కాదు.. ఏపీలో అన్నిచోట్లా వైసీపీకే పట్టం కట్టారు. దీంతో వైసీపీ నేతలు చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని విజయవాడ, గుంటూరు ప్రజలు సమర్థించారని, చంద్రబాబుకి పౌరుషం ఉంటే తక్షణం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. గుంటూరు జనం బాబుకి మిరప ఘాటు చూపించారని, విజయవాడ, వైజాగ్ ప్రజలు తమ పౌరుషం చూపించారని, పౌరుషం లేనిదల్లా చంద్రబాబుకేనని ఎద్దేవా చేశారు.

పంచాయతీ ఫలితాలతో గ్రామాల ప్రజలు వైసీపీ వెంటే ఉన్నారని తేలిందని, ఇప్పుడు మున్సిపల్ ఫలితాలతో అర్బన్ ఓటర్లు కూడా వైసీపీవెంటే నడిచారని అన్నారు. 14ఏళ్లపాటు సీఎంగా పనిచేసిన చంద్రబాబు కార్పొరేషన్ ఎన్నికలకోసం ఊరూరా తిరిగినా ఫలితం లేదని, సీఎం జగన్.. ఎక్కడా ఎవరినీ ఓటు వేయమని అడగలేదని, కనీసం ప్రచారం కూడా చేయలేదని, అయినా వైసీపీ ఘన విజయం సాధించిందని చెప్పారు. మహా భారతంలో శ్రీకృష్ణుడు ఆయుధం పట్టకుండా యుద్ధంలో పాల్గొన్నట్టు, జగన్ కూడా ప్రచారం జోలికెళ్లకుండా ఎన్నికల యుద్ధాన్ని గెలిచారని కితాబిచ్చారు. రాష్ట్ర రాజకీయాల్లో నిజమైన హీరో జగన్ అని, చంద్రబాబు జీవితంలోనే వరస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చారని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడం వల్లే వైసీపీ గెలిచిందని చంద్రబాబు చేసిన ఆరోపణల్ని గుర్తు చేశారు అంబటి. ఇప్పుడు బ్యాలెట్ పోరులో కూడా ఓడిపోయారు కదా ఇప్పేడమంటావు బాబూ అని ప్రశ్నించారు. ఏకగ్రీవాలైనా, ఎన్నికలైనా వైసీపీదే విజయం అని చెప్పారు.

వైసీపీ గెలిస్తే రాజధాని ప్రాంత ప్రజలు పాచిపనులకు హైదరాబాద్ వెళ్లాలంటూ చంద్రబాబు ప్రచారంలో చెప్పారని, ఇప్పుడు ఫలితాల తర్వాత ఆయన కొడుకు హైదరాబాద్ లో ఎందుకు దాక్కున్నారని, పాచిపనులకోసమేనా అని సెటైర్లు వేశారు అంబటి. చంద్రబాబు, ఆయన సుపుత్రుడు, దత్త పుత్రుడు.. ఇలా ఎంతమంది కలిసొచ్చినా వైసీపీని ఏమీ చేయలేరని, వారంతా హైదరాబాద్ లో ఉంటూ ఏపీలో రాజకీయాలు చేసే టూరిస్ట్ నాయకులని అన్నారు.

రాష్ట్రంలో టీడీపీ భూస్థాపితం అయిపోయిందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికలనాటికి టీడీపీకి అభ్యర్థులు కరువవుతారని అన్నారు. తెలుగు తమ్ముళ్లు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని హితవు పలికారు. టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రుల వార్డుల్లో కూడా వైసీపీ గెలిచిందని, పరిషత్ ఎన్నికల్లో ఇంతకంటే ఘన విజయం సాదిస్తామని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని హితవు పలితారు.

Tags:    
Advertisement

Similar News