ఓట్లు వేయించండి.. డబ్బులు పంచేద్దాం.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆఫర్..!
ప్రస్తుతం తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. దుబ్బాక, జీహెచ్ఎంసీ లో దెబ్బతిన్న అధికార టీఆర్ఎస్ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. ఎక్కడికక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించారు. టీఆర్ఎస్ తన క్యాడర్‌ను విస్తృతంగా వాడుకుంటున్నది. మంత్రుల నుంచి సర్పంచ్ స్థాయి వరకు అందరూ తమ అభ్యర్థుల గెలుపుకోసం అన్ని విధాలా శ్రమిస్తున్నారు. ప్రచారం ముగియడంతో ప్రలోభాలకు తెరతీశారు. బీజేపీ, కాంగ్రెస్ కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఎన్నికలు […]
ప్రస్తుతం తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. దుబ్బాక, జీహెచ్ఎంసీ లో దెబ్బతిన్న అధికార టీఆర్ఎస్ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. ఎక్కడికక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించారు. టీఆర్ఎస్ తన క్యాడర్‌ను విస్తృతంగా వాడుకుంటున్నది. మంత్రుల నుంచి సర్పంచ్ స్థాయి వరకు అందరూ తమ అభ్యర్థుల గెలుపుకోసం అన్ని విధాలా శ్రమిస్తున్నారు. ప్రచారం ముగియడంతో ప్రలోభాలకు తెరతీశారు.
బీజేపీ, కాంగ్రెస్ కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. రెండు స్థానాల్లోనూ ఇండిపెండెంట్లు సైతం గట్టి పోటీ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా టీఆర్ఎస్ వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ‘ఓటర్లకు డబ్బులు పంచండి’ అంటూ ఆయన పార్టీ సమావేశంలో నేరుగా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దీంతో ప్రతిపక్షాలు టీఆర్ఎస్పై దుమ్మెత్తి పోస్తున్నాయి.
ప్రస్తుతం హైదరాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి స్థానానికి, నల్లగొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం స్థానానికి ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. వైరా నియోజకవర్గ బాధ్యతలను టీఆర్ఎస్ ఆ పార్టీ ఎమ్మెల్యే రాములునాయక్‌కు అప్పగించింది. ఆయన ఇటీవల కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ.. ‘ ముందుగా ఓటర్ లిస్ట్ తెప్పించుకోండి. ఓటర్లను ఏబీసీడీలుగా వర్గీకరించండి. మనవాళ్లు ఎవరో గుర్తించండి. వాళ్లకు పక్కకు పెట్టి.. ఇతర పార్టీల వాళ్లను టార్గెట్ చేసి ఓటు వెయ్యో.. రెండు వేలో పంచండి.. డబ్బుల గురించి భయపడకండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు. మనపార్టీకి ఓటు వేయరు అనుకున్నవాళ్లను ముందుగా టార్గెట్ చేయండి. వాళ్లకే డబ్బులు పంచండి’ అంటూ ఆయన కార్యకర్తలకు సూచించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఎన్నిక ఏదైనా ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం మామూలే. అయితే ఓ ఎమ్మెల్యే నేరుగా పార్టీ సమావేశంలో ఇలా మాట్లాడటం .. అందుకు సంబంధించిన వీడియో బయటకు రావడం వివాదాస్పదంగా మారింది. ఈ విషయంపై ఎన్నికల సంఘం జోక్యం చేసుకోని సదరు ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలని విపక్ష నేతలు కోరుతున్నారు.