తిరుపతి సీటు.. పవన్ కావాలనే వదులుకున్నాడా?
త్వరలో తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వైసీసీ, టీడీపీలు వారి అభ్యర్థులను ప్రకటించాయి. ఇక పొత్తులో ఉన్న జనసేన, బీజేపీ నుంచి ఎవరు పోటీచేస్తారన్న విషయంపై కొంతకాలంగా నెలకొన్న ప్రతిష్ఠంభనకు తెరపడింది. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీయే పోటీచేయబోతున్నదని జనసేన ప్రకటించడంతో ఈ వివాదానికి తెరపడింది. అయితే పవన్ కల్యాణ్ కావాలనే తిరుపతి సీటు వదులుకున్నారన్న వాదన తెరమీదకు వస్తున్నది. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గ ఓటర్లు […]
త్వరలో తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వైసీసీ, టీడీపీలు వారి అభ్యర్థులను ప్రకటించాయి. ఇక పొత్తులో ఉన్న జనసేన, బీజేపీ నుంచి ఎవరు పోటీచేస్తారన్న విషయంపై కొంతకాలంగా నెలకొన్న ప్రతిష్ఠంభనకు తెరపడింది. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీయే పోటీచేయబోతున్నదని జనసేన ప్రకటించడంతో ఈ వివాదానికి తెరపడింది. అయితే పవన్ కల్యాణ్ కావాలనే తిరుపతి సీటు వదులుకున్నారన్న వాదన తెరమీదకు వస్తున్నది.
తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్నారని.. మాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని జనసేన ఇప్పటివరకు వాదిస్తూ వచ్చింది. తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రమని ఆ సీటులో బీజేపీ కచ్చితంగా గెలుస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతూ వచ్చారు. ఇదిలా ఉంటే జనసేనాని పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగానే తిరుపతి సీటును వదులుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఏపీలో విశాఖ ఉక్కు లొల్లి నడుస్తున్నది. ఈ విషయంపై ఏపీ ప్రజలు బీజేపీపై గుర్రుగా ఉన్నారు. విభజన హామీలు నెరవేర్చకపోవడం.. రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోవడం తదితర విషయాలపై కూడా ప్రజలు కోపంగానే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో పోటీచేస్తే ఓడిపోవడం ఖాయమని జనసేన భావించిందట. దీంతో ఆ సీటును వదులుకోవడమే మేలని ఆ పార్టీ నేతలు ఓ అభిప్రాయానికి వచ్చారట.
మరోవైపు జనసేన సైడ్ కావడంతో వైసీసీకి లైన్ క్లియర్ అయ్యిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇది వైసీపీకి సిట్టింగ్ సీటు. మరోవైపు చిత్తూరు జిల్లాలో వైసీసీ బలంగా ఉంది. ఇదిలా ఉంటే బీజేపీ ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించనే లేదు. తెలుగుదేశం పార్టీ పనబాక లక్ష్మిని అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ ఆమె పోటీచేస్తారో? లేదో? నామినేషన్ వేసేవరకు తెలియదు. ఎందుకంటే ఇటీవల టీడీపీ చేపట్టిన ఏ కార్యక్రమాల్లోనూ ఆమె పాల్గొనలేదు. పైగా ఓ ప్రెస్మీట్ కూడా పెట్టలేదు. అసలు ఆమె కడదాకా పోటీలో ఉంటారో? లేదో? తెలియని పరిస్థితి.
టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా ఆమె పేరును తెరమీదకు తెచ్చారు. అయితే పోటీచేసేందుకు ఆమె ఏ మాత్రం సుముఖంగా లేరట. దీంతో ఎన్నికల ఖర్చు మొత్తం తామే పెట్టుకుంటామని చంద్రబాబు సర్దిచెబితే ఆమె ఒప్పుకున్నారట. అయినప్పటికీ ఆమె ఇప్పుడు పోటీకి ఆసక్తిగా లేరు. ఈ పరిస్థితుల్లో వైసీపీ అభ్యర్థి సులువుగా గెలుస్తారని ఆ పార్టీ భావిస్తున్నది. ఒకవేళ జనసేన బరిలో ఉంటే కొంత పోటీ ఉంటుందని వైసీసీ నేతలు భావించారు. కానీ, ఇప్పుడు బీజేపీ పోటీచేస్తుందని తేలడంతో వైసీసీకి లైన్ క్లియర్ అయ్యింది. బీజేపీకి డిపాజిట్ కూడా దక్కదని కొందరు విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం విశాఖ ఉక్కు ఆందోళనతో ఏపీ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. దానికి తోడు బీజేపీకి అక్కడ ఏ మాత్రం బలం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో తిరుపతి సీటును ఎవరు ? గెలుస్తారో ? వేచి చూడాలి.