సాగర్ ఉప ఎన్నిక.. టీఆర్ఎస్ కి వార్నింగ్ బెల్..
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక టీఆర్ఎస్ కి నల్లేరుపై నడకలాంటిది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పార్టీ కానీ, పార్టీ అధినేత కేసీఆర్ కానీ అంత ధైర్యంగా ముందడుగు వేయలేకపోతున్నారు. దీనికి రకరకాల కారణాలున్నాయి. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో టీఆర్ఎస్ ఆచుతూచి వ్యవహరిస్తోంది. అభ్యర్థిని ప్రకటించే విషయంలో కూడా కేసీఆర్ ఇంకా ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కొడుకు భరత్ సహా, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, స్థానిక నేత కోటిరెడ్డి పేర్లు సైతం […]
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక టీఆర్ఎస్ కి నల్లేరుపై నడకలాంటిది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పార్టీ కానీ, పార్టీ అధినేత కేసీఆర్ కానీ అంత ధైర్యంగా ముందడుగు వేయలేకపోతున్నారు. దీనికి రకరకాల కారణాలున్నాయి. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో టీఆర్ఎస్ ఆచుతూచి వ్యవహరిస్తోంది. అభ్యర్థిని ప్రకటించే విషయంలో కూడా కేసీఆర్ ఇంకా ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కొడుకు భరత్ సహా, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, స్థానిక నేత కోటిరెడ్డి పేర్లు సైతం కేసీఆర్ పరిశీలనలో ఉన్నాయి.
ఫార్మా అభ్యర్థుల వార్నింగ్..
తెలంగాణలో ఫార్మా-డి వైద్యులను గుర్తించాలని, లేకపోతే ప్రగతి భవన్, అసెంబ్లీ ముట్టడిస్తామని ఫార్మా-డి వైద్యుల సంక్షేమ సంఘం హెచ్చరించింది. రాష్ట్రంలో దాదాపు 8 వేల మంది ఫార్మా-డి వైద్యులు ఉన్నారని, మరో 12 వేల మంది ఈ కోర్సు అభ్యసిస్తున్నారని, తమకు ఒక్క ఉద్యోగం కూడా రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న డ్రగ్ ఇన్ స్పెక్టర్లు, ఫార్మసిస్ట్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఫార్మా ఉద్యోగార్ధులు అక్కడితో ఆగలేదు. ఏకంగా టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా పనిచేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా ప్రచారం చేయడమే కాకుండా నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో పోటీ చేస్తామని అన్నారు. సుమారు 60మంది అభ్యర్థులు బరిలో దిగుతారని హెచ్చరించారు.
నిజాబామాబాద్ చేదు అనుభవం..
గతంలో నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ కి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. సిట్టింగ్ ఎంపీ కవితకు వ్యతిరేకంగా 178మది రైతులు నామినేషన్ వేశారు. తెలంగాణ చరిత్రలోనే తొలిసారిగా 185 మంది అభ్యర్థులు ఒకే లోక్ సభ స్థానానికి పోటీపడ్డారు. దేశంలోనే తొలిసారి 12 బ్యాలెట్ యూనిట్లను వినియోగించి ఎన్నికలు జరిపారు. రైతుల ఆందోళన, భారీ పోలింగ్ ఏర్పాట్లు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. కవిత ఓటమికి పరోక్ష కారణంగా నిలిచారు రైతు అభ్యర్థులు. ఇప్పుడు సాగర్ లో కూడా ఇలాంటి సీిన్ రిపీటవుతుందని హెచ్చరిస్తున్నారు ఫార్మా స్టూడెంట్స్. వారి సమస్యలు తీర్చి కేసీఆర్ రాజీ కుదుర్చుకుంటారా లేక, బెదిరింపుల్ని లెక్కలోకి తీసుకోరా అనేది తేలాల్సి ఉంది.
సాగర్ పైనే కేసీఆర్ ఫోకస్..
నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించిన కేసీఆర్ ఏడుగురు ఎమ్మెల్యేలు, ఓ మున్సిపల్ మేయర్ కు క్షేత్రస్థాయిలో ప్రచార బాధ్యతలు అప్పగించారు. వారిని ఇన్ చార్జిలుగా నియమించారు. ఎన్నికలు ముగిసేవరకు సాగర్ నియోజకవర్గంలోనే ఉండాలని ఆదేశించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత మరికొందరు ఎమ్మెల్యేలకు కూడా ప్రచార బాధ్యతలు అప్పగించే అవకాశముంది. అటు జానారెడ్డి రూపంలో కాంగ్రెస్, సాగర్ సీటుపై కన్నేసింది. బీజేపీ కూడా బలమైన అభ్యర్థిని బరిలోదింపే ఆలోచనలో ఉంది. వీరిద్దరితో పోటీ పడుతూనే ఇప్పుడు టీఆర్ఎస్ కి ఫార్మా అభ్యర్థుల రూపంలో కొత్త తలనొప్పులు రాబోతున్నాయి. మరి వీటిని ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాలి.