అంతటా అవినీతి.. అక్కడ మాత్రం అశ్లీలం..
రాజకీయాలన్నాక స్కామ్ లు, కుంభకోణాలు.. అన్నీ సహజం. అయితే ఒక్కోచోట ఒక్కో స్థాయిలో అక్రమాలు, అవినీతి జరుగుతుంటాయి. ప్రపంచంలోని ఏ దేశ రాజకీయాలూ ఇందుకు అతీతం కాదు. అయితే అక్రమాలు, అవినీతితోపాటు అశ్లీలత కూడా ఉన్న రాజకీయాలు ఒక్క కర్నాటకలోనే బయటపడుతున్నాయి. దొరికేవరకు అందరూ దొరలే అన్నట్టు.. ఇతర ప్రాంతాల్లో ఇలాంటి వ్యవహారాలు జరిగినా, ఈ స్థాయిలో సాక్ష్యాధారాలతో బయటపడిన సందర్భాలు అరుదు. అయితే కర్నాటకలో మాత్రం ఈపాటికే చాలామంది రసిక రంగారావులు కెమెరాల సాక్షిగా అడ్డంగా […]
రాజకీయాలన్నాక స్కామ్ లు, కుంభకోణాలు.. అన్నీ సహజం. అయితే ఒక్కోచోట ఒక్కో స్థాయిలో అక్రమాలు, అవినీతి జరుగుతుంటాయి. ప్రపంచంలోని ఏ దేశ రాజకీయాలూ ఇందుకు అతీతం కాదు. అయితే అక్రమాలు, అవినీతితోపాటు అశ్లీలత కూడా ఉన్న రాజకీయాలు ఒక్క కర్నాటకలోనే బయటపడుతున్నాయి. దొరికేవరకు అందరూ దొరలే అన్నట్టు.. ఇతర ప్రాంతాల్లో ఇలాంటి వ్యవహారాలు జరిగినా, ఈ స్థాయిలో సాక్ష్యాధారాలతో బయటపడిన సందర్భాలు అరుదు. అయితే కర్నాటకలో మాత్రం ఈపాటికే చాలామంది రసిక రంగారావులు కెమెరాల సాక్షిగా అడ్డంగా బుక్కయ్యారు, బుక్కవుతూనే ఉన్నారు. కర్నాటక బీజేపీ ప్రభుత్వంలోని జలవనరుల శాఖ మంత్రి రమేశ్ జార్కిహొళి ఉదంతమే దీనికి తాజా ఉదాహరణ. తొలిరోజు ఏదో అశ్లీల సంభాషణకే వీరి బాగోతం పరిమితం అయిందని అనుకుంటే.. ఆ తర్వాత వరుసగా రోజుకో ఎపిసోడ్ తరహాలో వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అవన్నీ చూసి కూడా ఇదేదో కుట్ర అంటూ ఆయనగారు చెబుతున్న మాటలు, ఎన్నికల్లో ఓటర్లకు చెప్పే అబద్ధపు హామీలకంటే ఏమాత్రం తక్కువ కాదు.
రాసలీలలు, లైంగిక దాడులు, సెల్ ఫోన్ల లో బూతు పురాణం.. కర్నాటక రాష్ట్రానికి కొత్తేమీ కాదు. గతంలో కూడా చాలా మంది మంత్రులు ఇలాంటి సెక్స్ కుంభకోణాల్లో చిక్కుకుని రాజీనామాలు చేయాల్సి వచ్చింది.
నర్సుతో ఎమ్మెల్యే రేణుకాచార్య లవ్ స్టోరీ..
2007లో బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య, జయలక్ష్మి అనే నర్సుతో ముద్దుముచ్చట సాగిస్తున్న ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఎమ్మెల్యే తనను మోసం చేశారని ఆమె ఫొటోలు చూపెడుతూ ప్రెస్‌మీట్ పెట్టారు. అంతకు మించి ఇంకేమీ జరగలేదు కాబట్టి, ఆ ముద్దు ఫొటోలతో రేణుకాచార్యకు పెద్దగా నష్టం జరగలేదు. అయితే సీనియర్ అయినా ఇప్పటి వరకూ ఆయనకు మంత్రి పదవి దక్కలేదు.
హాలప్ప రేప్ స్టోరీ..
బీజేపీ ప్రభుత్వంలో పౌరసరఫరాల మంత్రిగా పనిచేసిన హరతాళ్ హాలప్ప, తన స్నేహితుని ఇంటికి వెళ్లి అతని భార్యపై అత్యాచారం చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. రాజీనామా చేసినా కేసు నమోదు కావడంతో ఇబ్బందులు పడ్డారు. చివరకు కోర్టు నిర్దోషిగా తీర్పునివ్వడంతో 2018లో హాలప్ప తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఆ మచ్చ మాత్రం ఆయనపై తొలగిపోలేదు.
కర్నాటక పరువు తీసిన అసెంబ్లీలో నీలి చిత్రం..
ప్రపంచ వ్యాప్తంగా కర్నాటక పరువు తీసిన ఉదంతం 2012లో జరిగింది. చట్టసభలో ముగ్గురు మంత్రులు నిస్సిగ్గుగా నీలి చిత్రాలు చూస్తూ ఎంజాయ్ చేసిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. అప్పటి బీజేపీ ప్రభుత్వంలో సహకార మంత్రి లక్ష్మణ సవది, పర్యావరణ శాఖ మంత్రి కృష్ణ పాలెమార్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీసీ పాటిల్ మొబైల్ ఫోన్లో బ్లూ ఫిలిం లు చూస్తూ కెమెరాలకు చిక్కారు. ఆ దెబ్బతో వారి మంత్రి పదవులు ఊడిపోయాయి. పాలెమార్ తర్వాత ఎన్నికల్లో ఓడిపోగా.. బూతు మంత్రులిద్దరూ ప్రజామోదంతో మరోసారి చట్టసభలకు వెళ్లడం విశేషం.
కూలీ మహిళను కూడా వదలని అమాత్యుడు..
మూడేళ్ల కిందట సిద్ధరామయ్య ప్రభుత్వంలో అబ్కారీ మంత్రిగా ఉన్న మేటీ, ఓ ఆయుర్వేద ఆస్పత్రిలో రోజూవారీ కూలీగా పనిచేస్తున్న మహిళతో లైంగిక సంబంధం ఏర్పరచుకున్నారని ఆరోపణలు వినిపించాయి. బాగల్ కోటలోని అతిథిగృహంలో మంత్రి ఆమెతో గడిపిన వీడియోలు బయటకొచ్చాయి. సదరు మహిళ తరఫున ఓ సామాజిక కార్యకర్త ఢిల్లీలో రాసలీలల సీడీలు విడుదల చేయడంతో మంత్రి రాజీనామా చేశారు.
తాజా వికెట్ జార్కిహొళి..
తనకంటే ముందు చాలామంది ఇలాంటి ముచ్చట్లతో మంత్రి పదవులు ఊడగొట్టుకుని రోడ్డునపడ్డా.. జార్కిహొళి కూడా అదే తప్పు చేసి అడ్డంగా దొరికిపోవడం ఇప్పుడు విశేషం. ఉద్యోగం అవసరం అంటూ ఆ యువతి మంత్రికి దగ్గరైందా, లేక ఆమె అవసరాన్ని అడ్డు పెట్టుకుని మంత్రి ఈమెను వాడుకున్నారా అనే విషయం తేలాల్సి ఉంది. అయితే పక్కాగా తమ రాసలీలలన్నీ రికార్డు చేసిన ఆ యువతి మాత్రం మంత్రిని అడ్డంగా బుక్ చేసి తాను అజ్ఞాతంలోకి వెళ్లింది. వీడియోలు ఒక్కొక్కటే బయటకు రావడంతో బుకాయించడానికి అవకాశమే లేని దశలో మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది.
మిగతా రాష్ట్రాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతి ఇతర కుంభకోణాలతో వార్తల్లోకెక్కితే, కర్నాటక అమాత్యులు మాత్రం తమ రూటే సపరేటు అంటూ సెక్స్ స్కాండల్స్ లో ఇరుక్కుపోతున్నారు. సాక్ష్యాధారాలతో సహా అడ్డంగా బుక్కవుతున్నారు.