విశాఖలో ప్రజా పోరాటం " ఢిల్లీలో రాజకీయ పోరాటం.. " ఎంపీ విజయసాయిరెడ్డి

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఇతర నేతలతో కలసి చేపట్టిన పాదయాత్రకు అనూహ్య స్పందన లభించింది. విశాఖ జీవీఎంసీ దగ్గర మహాత్మా గాంధీ విగ్రహం నుంచి ప్రారంభమైన పాదయాత్ర దాదాపు 25 కిలో మీటర్ల మేర నగరంలోని అన్ని నియోజకవర్గాలను కలుపుతూ.. స్టీల్‌ ప్లాంట్‌ వరకు సాగింది. స్టీల్‌ ప్లాంట్‌ ఆర్చ్‌ వద్ద భారీ బహిరంగ సభలో వైసీపీ కార్యాచరణ ప్రకటించారు విజయసాయిరెడ్డి. సీఎం జగన్ ఆదేశాల మేరకు పాదయాత్ర చేపట్టినట్టు తెలిపిన […]

Advertisement
Update:2021-02-21 02:19 IST

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఇతర నేతలతో కలసి చేపట్టిన పాదయాత్రకు అనూహ్య స్పందన లభించింది. విశాఖ జీవీఎంసీ దగ్గర మహాత్మా గాంధీ విగ్రహం నుంచి ప్రారంభమైన పాదయాత్ర దాదాపు 25 కిలో మీటర్ల మేర నగరంలోని అన్ని నియోజకవర్గాలను కలుపుతూ.. స్టీల్‌ ప్లాంట్‌ వరకు సాగింది. స్టీల్‌ ప్లాంట్‌ ఆర్చ్‌ వద్ద భారీ బహిరంగ సభలో వైసీపీ కార్యాచరణ ప్రకటించారు విజయసాయిరెడ్డి.

సీఎం జగన్ ఆదేశాల మేరకు పాదయాత్ర చేపట్టినట్టు తెలిపిన విజయసాయిరెడ్డి.. ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ పూర్తి వ్యతిరేకం అని మరోసారి స్పష్టం చేశారు. విశాఖ నుంచి ఢిల్లీ వరకు ఎక్కడైనా పోరాటం చేస్తామని చెప్పారు. వామపక్ష పార్టీల ఎంపీలను కలుపుకొని వైసీపీ ఎంపీలంతా ప్రధానిని కలసి ఈమేరకు ఒత్తిడి తెస్తామని చెప్పారాయన. విశాఖ స్టీల్ ప్లాంట్ జోలికి రావొద్దని, కావాలంటే కడపలో లేదా, కృష్ణపట్నంలో స్టీల్‌ ప్లాంట్ పెట్టుకోడానికి అవసరమైన భూమి, అనుమతులు ఇస్తామని గతంలోనే తాము పోస్కో కంపెనీకిస్పష్టం చేసినట్టు తెలిపారు విజయసాయిరెడ్డి. కేపిటివ్ మైన్స్ కేటాయించడం, సంస్థ విస్తరణకోసం చేసిన రుణభారాన్ని కేంద్ర ప్రభుత్వం ఈక్విటీగా మార్చడం.. ఈ రెండు ప్రత్యామ్నాయాలను కేంద్రానికి రాసిన లేఖలో సీఎం జగన్ ప్రస్తావించారని అన్నారు. కార్మిక సంఘాలు కూడా సంయమనం పాటించాలని ఉత్పత్తి తగ్గితే నష్టాలు మరింతగా పెరుగుతాయని, కారణాలు చూపడానికి కేంద్రానికి మరో అవకాశం ఇచ్చినట్లు అవుతుందని చెప్పారు. ఉత్పత్తి తగ్గించవద్దని కార్మికులను మనసారా కోరుతున్నానన్నారు విజయసాయిరెడ్డి.

మేనేజ్ మంట్ మార్పు అవసరం..
విశాఖ ఉక్కు కర్మాగారంలో స్థానికులను కేవలం కార్మికులుగా మాత్రమే తీసుకుంటున్నారని, టాప్‌ మేనేజ్ ‌మెంట్ అంతా పక్క రాష్ట్రాలకు చెందినవారు ఉంటున్నారని, ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలకు ఇది కూడా ఒక కారణం అని అన్నారు విజయసాయిరెడ్డి. కేంద్ర మంత్రిని తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. తెలుగులో రాత పరీక్షకు ఉన్న 15 మార్కుల్ని కూడా ఇప్పుడు తొలగించారని, దీని ద్వారా స్థానికులకు అన్యాయం జరుగుతోందనే విషయం తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. ఈ వ్యవహారాలన్నిటిపై కేంద్రాన్ని కలసి వివరిస్తామని అన్నారు. వైసీపీ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని, విశాఖలో ప్రజా పోరాటం, అటు ఢిల్లీలో రాజకీయ పోరాటం.. అన్నిటికీ తమ పార్టీయే ముందుంటుందని స్పష్టం చేశారు.

లేఖ రాయడానికి చేతులు రావా బాబూ..?
విశాఖ వచ్చి అధికార పక్షంపై విమర్శలు చేసి వెళ్తున్న చంద్రబాబుకి కనీసం ప్రధానికి లేఖ రాయాలన్న జ్ఞానం కూడా ఎందుకు లేదని నిలదీశారు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు అడిగితే ప్రధాని అపాయింట్ మెంట్ ఇవ్వకుండా ఉంటారా అని ప్రశ్నించారు. టీడీపీ నాయకులకు చిత్తశుద్ధి లేదని, వారివంతా కంటితుడుపు చర్యలని మండిపడ్డారు. విశాఖలో పాదయాత్రలతో ప్రయోజనం లేదని, ఢిల్లీ వెళ్లి పోరాటాలు చేయాలని చంద్రబాబు ఉచిత సలహాలివ్వడంపై కూడా విజయసాయిరెడ్డి మండిపడ్డారు. భారత దేశానికి స్వాతంత్రం రావడానికి లండన్ వెళ్లి పోరాటాలు చేయలేదని, భారతీయులంతా మనదేశంలోనే ఉండి పోరాడారని గుర్తు చేశారు. పాదయాత్రలో కలిసొచ్చిన నాయకులకు, కార్మిక సంఘాలకు విజయసాయిరెడ్డి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.

Tags:    
Advertisement

Similar News