మంత్రి కొడాలి నానిపై ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆంక్షలు..

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తర్వాత మరో మంత్రి కొడాలి నానిపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చర్యలు తీసుకున్నారు. మంత్రి పెద్ది రెడ్డిపై పెట్టిన గృహ నిర్బంధం వంటి భారీ ఆంక్షలను హైకోర్టు కొట్టివేయడంతో, కొడాలి నానిని మాత్రం కేవలం మీడియాతో మాట్లాడొద్దని సింపుల్ గా తేల్చేశారు. దానికి అనుబంధంగా సమావేశాల్లోనూ, బృందాలతో కూడా బహిరంగంగా మాట్లాడొద్దని ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాలు తక్షణం అమలులోకి వస్తాయని, కృష్ణాజిల్లా కలెక్టర్, ఎస్పీ, విజయవాడ పోలీస్ కమిషనర్ ఈ ఆంక్షలు […]

Advertisement
Update:2021-02-13 04:14 IST

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తర్వాత మరో మంత్రి కొడాలి నానిపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చర్యలు తీసుకున్నారు. మంత్రి పెద్ది రెడ్డిపై పెట్టిన గృహ నిర్బంధం వంటి భారీ ఆంక్షలను హైకోర్టు కొట్టివేయడంతో, కొడాలి నానిని మాత్రం కేవలం మీడియాతో మాట్లాడొద్దని సింపుల్ గా తేల్చేశారు. దానికి అనుబంధంగా సమావేశాల్లోనూ, బృందాలతో కూడా బహిరంగంగా మాట్లాడొద్దని ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాలు తక్షణం అమలులోకి వస్తాయని, కృష్ణాజిల్లా కలెక్టర్, ఎస్పీ, విజయవాడ పోలీస్ కమిషనర్ ఈ ఆంక్షలు అమలయ్యేలా చూడాలని ఆదేశించారు ఎస్ఈసీ. ఈనెల 21న పంచాయతీ తుది దశ ఎన్నికల పోలింగ్ ముగిసే వరకు కొడాలిపై ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు.

ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు మంత్రి కొడాలి నాని ఎస్ఈసీపై విమర్శలు చేసిన సందర్భాలున్నాయి. అయితే షెడ్యూల్ విడుదలకావడం, తొలివిడత ఎన్నికలు పూర్తి కావడం.. రెండో విడతకు రంగం సిద్ధం కావడం.. ఇలా రోజులు జరిగాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఎక్కడా, మంత్రి నాని ఎస్ఈసీ గురించి మాట్లాడలేదు. మిగతా మంత్రులు, అధికార ప్రతినిధులు, ఎమ్మెల్యేలు ఎస్ఈసీ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా.. నాని మౌనాన్ని ఎవరూ ఊహించలేదు. అయితే తన శాఖకి సంబంధించి రేషన్ సరకుల ఇంటింటి పంపిణీని అడ్డుకుంటున్నారనే క్రమంలో నాని మీడియా ముందు ఎస్ఈసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటింటికీ రేషన్ పంపిణీ వల్ల పంచాయతీ ఎన్నికల్లో అధికార పక్షానికి లాభం చేకూరుతుందని ఒకసారి, అసలా పంపిణీయే సక్రమంగా జరగడంలేదని దానివల్ల ప్రయోజనం లేదని మరోసారి టీడీపీ అనుకూల మీడియా అవాస్తవాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు నాని. పనిలో పనిగా చంద్రబాబుని, ఎస్ఈసీ నిమ్మగడ్డని కూడా అదే గాటన గట్టేస్తూ విమర్శలు ఎక్కుపెట్టారు. దీంతో ఆ ప్రెస్ మీట్ జరిగిన గంటల వ్యవధిలోనే ఎస్ఈసీ, మంత్రి వివరణ కోరారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల లోగా మంత్రికానీ, ఆయన తరపున ఎవరైనా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. దీంతో మంత్రి తన న్యాయవాది చిరంజీవి ద్వారా ఎస్‌ఈసీకి బదులిచ్చారు. తాను ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని, తొలిదశ పంచాయతీ ఎన్నికల ఫలితాల విషయంలో ప్రతిపక్ష పార్టీ అరాచకాల్ని బయటపెట్టే క్రమంలో మీడియా సమావేశం నిర్వహించానని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థల పట్ల తనకు గౌరవం ఉందని, ఎన్నికల కమిషన్‌ ను గౌరవిస్తానని, షోకాజ్‌ నోటీసు ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ వివరణతో సంతృప్తి చెందని ఎస్ఈసీ.. మంత్రిపై చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో కూడా మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేసినా తాము పట్టించుకోవడంలేదని, ఎన్నికలు జరుగుతుండగా చేసిన ఈ వ్యాఖ్యల్ని మాత్రం పరిగణలోకి తీసుకుంటున్నామని, ఎన్నికల కమిషన్ ని కించపరుస్తూ, కమిషన్ పనితీరుని ప్రభావితం చేసేలా ఉన్న వ్యాఖ్యలను గర్హిస్తున్నామని అన్నారు. ఈనెల 21 వరకు మీడియాతో కానీ, సమావేశాల్లో కానీ, బృందాలతో కానీ మంత్రి నాని మాట్లాడకూడదంటూ ఆంక్షలు విధించారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ఆంక్షల విషయంలో హైకోర్టుకు వెళ్లి వాటిని రద్దు చేయించుకున్నారు. మరి మంత్రి కొడాలి నాని, ఈ ఆంక్షలపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Tags:    
Advertisement

Similar News