పవన్ ఉక్కు సంకల్పాన్ని సాహో అనాలా..? శంకించాలా..?
పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్ లు వదిలిపెట్టి రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటు పరం కాకుండా ఉండేందుకు ఆయన బీజేపీ పెద్దల్ని కలసి వినతి పత్రాలు ఇస్తున్నారు. ఇటు రాష్ట్రంలో జనసేన కార్యకర్తలు, నేతలు కూడా ఉద్యమంలో పాల్గొంటారని అంటున్నారు. పవన్ కల్యాణ్ రాయబారం వల్ల, ఉక్కు ఉద్యమంలో జనసేన కలసి పనిచేయడం వల్ల లాభం ఉందా? పవన్ మాటల్నిబట్టి చూస్తే స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై కేంద్రం పూర్తి క్లారిటీతో […]
పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్ లు వదిలిపెట్టి రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటు పరం కాకుండా ఉండేందుకు ఆయన బీజేపీ పెద్దల్ని కలసి వినతి పత్రాలు ఇస్తున్నారు. ఇటు రాష్ట్రంలో జనసేన కార్యకర్తలు, నేతలు కూడా ఉద్యమంలో పాల్గొంటారని అంటున్నారు. పవన్ కల్యాణ్ రాయబారం వల్ల, ఉక్కు ఉద్యమంలో జనసేన కలసి పనిచేయడం వల్ల లాభం ఉందా? పవన్ మాటల్నిబట్టి చూస్తే స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై కేంద్రం పూర్తి క్లారిటీతో ఉందని, వెనక్కి తగ్గే అవకాశమే లేదని అర్థమవుతోంది.
టార్గెట్ జగన్..
విశాఖ ఉక్కు ప్రైవేటుపరం కాబోతోందనే వార్తలు గుప్పుమనగానే అందరికంటే ముందుగా స్పందించారు చంద్రబాబు. కేంద్రాన్ని పల్లెత్తు మాట అనకుండా, సీఎం జగన్ ని టార్గెట్ చేస్తూ ఆయన విమర్శలు ఎక్కుపెట్టారు. సీఎం జగన్ వల్లే విశాఖ ఉక్కు ప్రైవేటుపరం కాబోతోందని, కేసులవల్ల జగన్ కేంద్రంతో లాలూచీ పడ్డారని అన్నారు చంద్రబాబు. అసలు బాబు హయాంలోనే 56 సంస్థలు ప్రైవేటు పరం అయ్యాయని, విశాఖ ఉక్కుపై కూడా అప్పట్లోనే నిర్ణయం జరిగిందని వైసీపీ సాక్ష్యాధారాలు బయటకు తీయడంతో ఆయన నోరు మూగబోయింది. తీరా ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా జగన్ పైనే విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ప్రధానికి లేఖ రాసి సరిపెడతారా, ప్రజా ప్రతినిధులెవరూ లేని జనసేన విశాఖ ఉక్కుకోసం ఇంత పోరాటం చేస్తుంటే, 22మంది ఎంపీలున్నవైసీపీ ఇంకెంత చేయాలని లాజిక్ తీస్తున్నారు. నెపం జగన్ పైకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు.
పవన్ మాటల్లో ఆంతర్యం ఏంటి..?
వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయొద్దంటూ ప్రధాని నరేంద్ర మోదీని వ్యక్తిగతంగా కలసి విన్నవించేందుకు పవన్ ఢిల్లీ వెళ్లారు. ఆమేరకు ముందుగానే జనసేన తరపున ఓ ప్రెస్ నోట్ విడుదల చేయించుకుని మరీ ఆయన హస్తిన బాట పట్టారు. తీరా రెండు రోజులవుతున్నా అక్కడ పీఎం అపాయింట్ మెంట్ దొరకలేదు. ఈలోగా అమిత్ షా, కిషన్ రెడ్డి ని కలసి వినతిపత్రాలిస్తూ వస్తున్నారు పవన్. ఆయన మాటల్ని బట్టి చూస్తే కేంద్రం ప్రైవేటీకరణవైపే మొగ్గు చూపుతున్నట్టు, మెత్తబడే అవకాశమే లేనట్టు స్పష్టమవుతోంది. కేంద్రంనుంచి సానుకూల సంకేతాలున్నాయని తన తరపున ఏపీ ప్రజలకు భరోసా ఇవ్వలేకపోతున్నారు పవన్ కల్యాణ్. అదే సమయంలో ప్రైవేటీకరణకు సిద్ధంగా ఉన్న కేంద్రాన్ని పల్లెత్తు మాట అనే సాహసం కూడా ఆయన చేయలేరు. పొత్తు ధర్మం ఆయన నోరు కట్టేస్తోంది. అందుకే జగన్ పై విమర్శలు ఎక్కుపెట్టి ఆపాపాన్ని వైసీపీకి అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు చూపిన దారి ఎలాగూ ఉంది కాబట్టి.. అదే దారిలో అధికార పక్షంపై నిందలు వేసే పని మొదలు పెట్టారు పవన్. వైసీపీ చేసిన తప్పుకి ప్రతిఫలం అనుభవించాల్సి వస్తే ఇక పవన్ ఢిల్లీ వెళ్లి లాభం ఏంటి? కేంద్రంలోని పెద్దలకు ఆయన వినతి పత్రాలు ఇవ్వడంలో ఆంతర్యం ఏంటి? రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలకంటే ముందు నేరుగా ఢిల్లీ వెళ్లి మంత్రుల్ని కలుస్తున్నందుకు జనసేనానిని అభినందించాలా? లేక కేంద్రం వెనక్కు తగ్గదని తెలిసి కూడా కంటితుడుపు యాత్రలు చేస్తున్నందుకు ఆయన నిబద్ధతను శంకించాలా..?