ఎన్నికల ప్రక్రియ మొదలైనా.. పంతాలు వీడలేదు..

ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలైనా.. ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ మధ్య పంతాలు, పట్టింపులు ఇంకా వీడిపోలేదు. గవర్నర్ దగ్గర పంచాయితీ జరిగినా కూడా ఇరు వర్గాలు ఇంకా ఒకరిపై ఒకరు పైచేయికోసం ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేది లేదంటూ ప్రభుత్వం ఆయన ఉత్తర్వులను తిప్పి పంపడం గమనార్హం. అటు ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయంపై ఎన్నికల కమిషనర్ వివరణ కోరడం కూడా సంచలనంగా […]

Advertisement
Update:2021-01-27 16:53 IST

ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలైనా.. ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ మధ్య పంతాలు, పట్టింపులు ఇంకా వీడిపోలేదు. గవర్నర్ దగ్గర పంచాయితీ జరిగినా కూడా ఇరు వర్గాలు ఇంకా ఒకరిపై ఒకరు పైచేయికోసం ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేది లేదంటూ ప్రభుత్వం ఆయన ఉత్తర్వులను తిప్పి పంపడం గమనార్హం. అటు ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయంపై ఎన్నికల కమిషనర్ వివరణ కోరడం కూడా సంచలనంగా మారింది.

వారిద్దరినీ అభిశంసించే అధికారం మీకు లేదు..
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించారంటూ ఏపీ పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజా శంకర్‌ పై ఎన్నికల కమిషనర్ అభిశంసన ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సెన్సూర్ ప్రొసీడింగ్స్‌ జారీ చేస్తూ.. వారిని బదిలీ చేస్తూ, సర్వీసు రికార్డుల్లో రిమార్కులు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు ఎస్ఈసీ నిమ్మగడ్డ. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆదేశాలను తిప్పిపంపడం ఇప్పుడు మరింత సంచలనంగా మారింది. పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజా శంకర్‌ పై ఎన్నికల కమిషనర్ జారీ చేసిన అభిశంసన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం తిప్పి పంపింది. ఐఏఎస్ అధికారులపై సెన్సూర్ ప్రొసీడింగ్స్‌ జారీ చేసే అధికారం ఎస్‌ఈసీకి లేదని ప్రభుత్వం లేఖను జతచేసింది. వారి వివరణ కోరకుండానే ప్రొసీడింగ్స్‌ జారీ చేయలేరని లేఖలో పేర్కొంది.

మమ్మల్ని అడగకుంటా ప్రకటన ఎలా ఇస్తారు..?
మరోవైపు ఏకగ్రీవాలపై ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనపై సమాచార ప్రసార శాఖను ఎన్నికల కమిషనర్ వివరణ కోరారు. ఇదే అంశంపై నాలుగైదు పార్టీలు ఎన్నికల కమిషన్ ను సంప్రదించినట్టు నిమ్మగడ్డ తెలిపారు. ఏకగ్రీవాలపై ప్రకటన చేసేటప్పుడు ఎస్‌ఈసీని సంప్రదించాల్సిందేనని అన్నారు. ఎన్నికలకు సంబంధించిన ఏ అంశమైనా ఎస్‌ఈసీ పరిధిలోనే ఉంటుందని.. ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనపై సమాచార, ప్రసార శాఖను వివరణ కోరినట్లు చెప్పారు. ఏకగ్రీవాలకు ప్రోత్సాహకాలను భారీగా పెంచడం, వాటి గురించి ఇచ్చిన ప్రకటన.. పంచాయతీ ఎన్నికలను పరోక్షంగా ప్రభావితం చేసే అంశమేనని, అలాంటి అంశాలను తప్పనిసరిగా ఎస్ఈసీ దృష్టికి తీసుకు రావాల్సి ఉంటుందని, అది ప్రభుత్వం ప్రాథమిక విధి అని అన్నారు నిమ్మగడ్డ. ఏకగ్రీవాలు అపరిమితంగా పెరిగితే వాటిపై దృష్టిసారించాలని అధికారులకు ఆయన ఆదేశాలిచ్చారు. ఎస్‌ఈసీ విధులకు భంగం కలిగితే కోర్టుకు వెళ్లేందుకు సైతం సిద్ధమని చెప్పారు నిమ్మగడ్డ.

మొత్తానికి ఎన్నికల ప్రక్రియ మొదలై అంతా సానుకూలంగా జరుగుతుందనుకుంటున్న టైమ్ లో కూడా.. అటు ఎన్నికల సంఘం.. ఇటు ప్రభుత్వం ఒకరిపై మరొకరు పైచేయుకోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఎస్ఈసీ అడ్డుకుంటుంటే.. ఆయన ఉత్తర్వులను తిప్పి పంపుతూ ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గేది లేదని సందేశమిస్తోంది. ఈ ఎత్తులు, పై ఎత్తుల మధ్య ఎన్నికలు ఎలా జరుగుతాయో వేచి చూడాలి.

Tags:    
Advertisement

Similar News