జనసేనాని శాసించాలా..? సాగిల పడాలా..?

తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరగబోయే ఉప ఎన్నిక అభ్యర్థిపై అధికార పక్షం ఆల్రడీ హింట్ ఇచ్చేసింది. ప్రతిపక్షం ఏకంగా అభ్యర్థిని ప్రకటించి ప్రచార పర్వం మొదలు పెడుతోంది. ఇక ప్రధాన ప్రతిపక్షం తామేనని చెబుతున్న బీజేపీ-జనసేన మాత్రం సంయుక్త కార్యాచరణ అంటూ కాలం నెట్టుకొస్తోంది. ఒకరు ఆవేశ పడితే ఇంకొకరు అడ్డుపుల్ల వేస్తున్నారు. ఈనెల 21న తిరుపతిలో మీటింగ్ అంటూ జనసేన తరపున ప్రకటన రావడం ఆలస్యం.. అటు విశాఖలో మీటింగ్ పెట్టుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు […]

Advertisement
Update:2021-01-18 03:12 IST

తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరగబోయే ఉప ఎన్నిక అభ్యర్థిపై అధికార పక్షం ఆల్రడీ హింట్ ఇచ్చేసింది. ప్రతిపక్షం ఏకంగా అభ్యర్థిని ప్రకటించి ప్రచార పర్వం మొదలు పెడుతోంది. ఇక ప్రధాన ప్రతిపక్షం తామేనని చెబుతున్న బీజేపీ-జనసేన మాత్రం సంయుక్త కార్యాచరణ అంటూ కాలం నెట్టుకొస్తోంది. ఒకరు ఆవేశ పడితే ఇంకొకరు అడ్డుపుల్ల వేస్తున్నారు. ఈనెల 21న తిరుపతిలో మీటింగ్ అంటూ జనసేన తరపున ప్రకటన రావడం ఆలస్యం.. అటు విశాఖలో మీటింగ్ పెట్టుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తిరుపతి అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదని తేల్చి చెప్పేశారు. ఉమ్మడి అభ్యర్థి బరిలో దిగుతారని, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని పవన్ ఆవేశానికి అడ్డుపుల్ల వేశారు.

డిమాండ్ చేయాల్సిన పవన్ మెత్తబడుతున్నారా..?
గ్రేటర్ లో పోటీకి దిగుతున్నారనుకున్న టైమ్ లో కిషన్ రెడ్డి రాయబారంతో మెత్తబడ్డ పవన్, తిరుపతి విషయంలో మాత్రం తన పంతం నిలబెట్టుకుంటారని అనుకున్నారంతా. కానీ ఢిల్లీ పర్యటనలో ఆ విషయం తేలలేదు. కనీసం తిరుపతి విషయంపై మాట్లాడ్డానికి వచ్చానని చెప్పుకునే ధైర్యం కూడా పవన్ చేయలేదంటే ఆ పర్యటన ఎంత అసంతృప్తిగా ముగిసిందో అర్థం చేసుకోవచ్చు. పోనీ రెండు పార్టీలు చెప్పినట్టు.. తిరుపతిలో ఉమ్మడి కార్యాచరణ ఏమైనా సాగుతుందా అంటే అదీ లేదు. అభ్యర్థి ఎంపిక కోసం ఇరు పార్టీలు చేసిన కసరత్తులేవీ లేవు. ఎవరికి వారే, యమునా తీరే అన్నట్టుగా ఉన్నారు. పవన్ ఆవేశాన్ని మెల్లగా చల్లార్చి, ఉమ్మడి అభ్యర్థిని ఎంపిక చేసి, కమలం పువ్వు గుర్తుపై పోటీ చేయించాలనేదే బీజేపీ మాస్టర్ ప్లాన్. అందుకు అనుగుణంగానే పావులు కదుపుతోంది, పవన్ ని దువ్వుతోంది.

ఎవరి బలం ఎంత..?
వాస్తవానికి తిరుపతి బరిలో బీజేపీ-జనసేన రెండు పార్టీలకు పెద్ద సీన్ లేదు. 2019లో జనసేన నేరుగా పోటీ చేయకుండా బీఎస్పీకి అవకాశమిచ్చింది. ఫలితాల విషయానికొచ్చే సరికి బీజేపీ, జనసేన బలపరచిన బీఎస్పీ రెండు నోటా చేతిలో ఓడిపోయాయి. మహా అయితే ఆ రెండు పార్టీలు కలసి ఉంటే నోటా కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకునేవి, అంతే. ఏడాదిన్నర కాలంలో ఏపీలో పెద్దగా వచ్చిన మార్పేమీ లేదు. వైసీపీ వేవ్ పెరిగిందే కానీ తగ్గలేదు. ప్రతిపక్షంగా టీడీపీ వైఫల్యం బీజేపీ-జనసేన కూటమికి లాభం చేకూర్చే అవకాశం కనిపిస్తోంది. కూటమి అభ్యర్థికి కాలం కలిసొస్తే రెండో స్థానానికి ఎగబాకొచ్చు.. ఏపీలో అసలు సిసలు ప్రత్యామ్నాయం మేమేనంటూ బీజేపీ-జనసేన ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయొచ్చు, 2024 ఎన్నికలకోసం సిద్ధం కావొచ్చు. ఇదంతా జరగాలంటే బీజేపీ-జనసేన మధ్య సయోధ్య కొనసాగాలి, ఉమ్మడి అభ్యర్థి విజయం కోసం రెండు పార్టీలు నమ్మకంగా పనిచేయాలి. కానీ జనసైనికుల వాలకం చూస్తుంటే అది సాధ్యమయ్యేలా లేదు. తిరుపతి సీటుని డిమాండ్ చేసి సాధించాల్సిన పవన్, ఇలా బీజేపీ ముందు సాగిల పడటం వారికి అస్సలు నచ్చడంలేదు. మరి పవన్ ధైర్యం చేస్తారో లేదో వేచి చూడాలి.

Tags:    
Advertisement

Similar News