ఖమ్మంపై కాషాయం కన్ను

తెలంగాణలో దూకుడు మీదున్న బీజేపీ కన్ను ఇప్పుడు ఖమ్మంపై పడింది. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలతో జోష్ లో ఉన్న కాషాయ పార్టీ ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలనుకుంటోంది. రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకుంటున్న బీజేపీ ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడానికి సిద్ధంగా లేదు. అందుకే… త్వరలో జరగనున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నికతో పాటు, ఖమ్మం, వరంగల్ కార్పోరేషన్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బల ప్రదర్శనకు సిద్ధమవుతోంది. రెండు నెలల్లో ఖమ్మం కార్పోరేషన్ […]

Advertisement
Update:2021-01-08 12:51 IST

తెలంగాణలో దూకుడు మీదున్న బీజేపీ కన్ను ఇప్పుడు ఖమ్మంపై పడింది. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలతో జోష్ లో ఉన్న కాషాయ పార్టీ ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలనుకుంటోంది. రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకుంటున్న బీజేపీ ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడానికి సిద్ధంగా లేదు. అందుకే… త్వరలో జరగనున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నికతో పాటు, ఖమ్మం, వరంగల్ కార్పోరేషన్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బల ప్రదర్శనకు సిద్ధమవుతోంది.

రెండు నెలల్లో ఖమ్మం కార్పోరేషన్ కి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే అధికార పార్టీకి చెక్ పెట్టేందుకు బీజేపీ వ్యూహరచన చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన టీఆర్ఎస్ ఒకే ఒక స్థానాన్ని దక్కించుకోగలిగింది. గెలిచింది ఒక్క ఎమ్మెల్యేనే అయినా ఖమ్మం మీద పట్టు నిలుపునేందుకు జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న పువ్వాడ అజయ్ కి మంత్రిపదవిని కట్టబెట్టింది టీఆర్ఎస్. ఇప్పుడు పువ్వాడ కోటలో కమలం వికసించాలనుకుంటోంది.

కాంగ్రెస్ వరుస వైఫల్యాలతో నిస్తేజంలో ఉండడంతో ఖమ్మం కార్పోరేషన్ ఎన్నికల్లో ప్రధాన పోటీ అధికార పార్టీ, బీజేపీకి మధ్యే ఉండబోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇతర పార్టీలతో పోల్చుకుంటే ఖమ్మంలో అధికార పార్టీలో మంచి బలం ఉంది. మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామా నాగేశ్వరరావుతో పాటు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లాంటి కీలక నేతలు ఉన్నారు. అయినా… అంతర్గత తగాదాలు టీఆర్ఎస్ కు ప్రతికూల ఫలితాలిస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

పార్టీల బలాబలాలు పోల్చుకుంటే మొదటి నుంచీ కమ్యూనిస్టుల అడ్డాగా ఉన్న ఖమ్మం జిల్లాలో బీజేపీకి పెద్దగా బలంలేదు. కానీ దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల తరువాత బీజేపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవడంలో బీజేపీ నాయకులు దూకుడుమీదున్నారు. మరోవైపు అధికార పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు బీజేపీ వైపు చూస్తుండడం గమనార్హం. ఇప్పటికే పలువురు టీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఖమ్మం కార్పోరేషన్ ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి.

ఖమ్మం ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీజేపీ సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తోంది. అధికార పార్టీని బలహీనపరచడంపై ఎక్కువ దృష్టిసారిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు అధికార పార్టీ నేతలను ఇరకాటంలో పెట్టాలనుకుంటోంది. అందులో భాగంగానే మంత్రి పువ్వాడపై బండి సంజయ్ ఘాటు విమర్శలు చేశారు. పువ్వాడ భూకబ్జాల కోసమే ఎర్రజెండా వదిలి టీఆర్ఎస్ లో చేరాడని ఆరోపించారు. అజయ్ అక్రమాలపై విచారణ జరిపి జైలుకు పంపుతామంటూ హెచ్చరించారు. మొత్తానికి అధికార పార్టీని ఢీకొట్టేందుకు బీజేపీ గట్టి ప్రయత్నమే చేస్తోంది. మరి ఖమ్మం కోటలో కమలం వికసిస్తుందో లేదో చూడాలి.

Tags:    
Advertisement

Similar News