ముందు లోకేష్‌పై సీక్రెట్ ఓటింగ్ పెట్టండి- టీడీపీ మాజీ ఎమ్మెల్యే పంచకర్ల
టీడీపీ మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వైసీపీలో చేరారు. జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పంచకర్ల రమేష్ బాబు .. చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఉత్తరాంధ్ర, విశాఖ అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకునేందుకు కుట్రచేస్తున్నారని మండిపడ్డారు. ఐదు నెలల క్రితం టీడీపీకి రాజీనామా చేసినట్టు పంచకర్ల రమేష్ బాబు చెప్పారు. ఉత్తరాంధ్ర వెనుకబడింది అని చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తూ వచ్చారే గానీ ఆ ప్రాంత అభివృద్ధికి చేసింది ఏమీ […]
టీడీపీ మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వైసీపీలో చేరారు. జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పంచకర్ల రమేష్ బాబు .. చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఉత్తరాంధ్ర, విశాఖ అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకునేందుకు కుట్రచేస్తున్నారని మండిపడ్డారు.
ఐదు నెలల క్రితం టీడీపీకి రాజీనామా చేసినట్టు పంచకర్ల రమేష్ బాబు చెప్పారు. ఉత్తరాంధ్ర వెనుకబడింది అని చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తూ వచ్చారే గానీ ఆ ప్రాంత అభివృద్ధికి చేసింది ఏమీ లేదన్నారు. విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేసేందుకు జగన్‌మోహన్ రెడ్డి నిర్ణయిస్తే… చంద్రబాబు మాత్రం కేవలం ఒక ప్రాంతమే అభివృద్ధి చెందాలి.. కేవలం తన మనుషుల రియల్ ఎస్టేట్ వ్యాపారం అభివృద్ధి చెందాలి… కేవలం తన వర్గమే లబ్ది పొందాలి అని అడ్డుపడుతున్నారని విమర్శించారు.
మూడు రాజధానులకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని రోజూ తమకు మేసేజ్‌లు పెట్టేవారని చెప్పారు. ఆ ప్రాంతం నుంచి రాజకీయంగా పైకి వచ్చి అదే ప్రాంతానికి వ్యతిరేకంగా తమతో తప్పులు చేయించాలని చంద్రబాబు ప్రయత్నించారన్నారు. అందుకే తాను రాజీనామా చేసి బయటకు వచ్చానన్నారు.
కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఆరునెలలు కూడా గడువు ఇవ్వాలన్న జ్ఞానం లేకుండా చంద్రబాబు, ఆయన కుమారుడే కాకుండా తమతోనూ ప్రభుత్వంపై బురదజల్లించేందుకు చంద్రబాబు ప్రయత్నించారన్నారు. రాష్ట్రాన్ని వదిలేసి వెళ్లి జూమ్‌లో కూర్చుని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు నిర్వహించే జూమ్ మీటింగ్‌కు చాలా మంది రావడం లేదని తన పాత మిత్రులు చెబుతున్నారన్నారు. చంద్రబాబు విధానాల వల్ల టీడీపీ నాశనం అయిపోతోందన్నారు.
ఉత్తరాంధ్రలో కనీసం ఒక గెస్ట్ హౌస్ కూడా కట్టడానికి వీల్లేదని చంద్రబాబు అడ్డుకోవడం దారుణమన్నారు. కేంద్రం నుంచి పెద్దలు ఎవరైనా వస్తే సురక్షితమైన గెస్ట్ హౌస్ లేదని… విశాఖలో స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మిస్తుంటే దాన్ని కూడా కోర్టుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నైజం ఏంటో అందరికీ అర్థమైపోయిందన్నారు. చంద్రబాబు , ఆయన చుట్టూ ఉన్న మనుషుల వల్ల తెలుగుదేశం పార్టీ బాగుపడే పరిస్థితే లేదన్నారు.
ప్రతిదానికి ప్రజా తీర్పు కోరాలని చెప్పే చంద్రబాబు… ముందు నారా లోకేష్ నాయకత్వంపై పార్టీలో అభిప్రాయం కోరాలన్నారు. నారా లోకేష్ నాయకుడిగా పనికి రాడు అని తామంతా చెప్పామన్నారు. సీక్రెట్ పోలింగ్ పెడితే పార్టీలో ఏ ఒక్కరూ కూడా లోకేష్ నాయకత్వం కోరుకోరన్నారు. దొడ్డిదారిలో లోకేష్‌ను మంత్రిని చేసి ఆయన నాయకత్వంలో పనిచేయాలంటూ తమను రాచి రంపాన పెట్టారని చంద్రబాబుపై పంచకర్ల రమేష్ బాబు మండిపడ్డారు.