కోవిడ్ 19 లాక్ డౌన్... అలా మేలు చేసిందా?!
కరోనా కారణంగా అన్నీ నష్టాలు కష్టాలే. దానిని అడ్డుకోవడానికి విధించిన లాక్ డౌన్ వలన మరిన్ని అగచాట్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే లాక్ డౌన్ కారణంగా కొన్ని లాభాలూ కలిగాయి. అలాంటివాటిలో ఒకటి నెలలు నిండకుండా జన్మించే శిశువుల సంఖ్య…. అంటే ప్రీమెచ్యూర్ జననాలు తగ్గాయి. డెన్మార్క్ , ఐర్లాండ్ తో పాటు చాలాదేశాలు ఈ విషయాన్ని గమనించాయి. లాక్ డౌన్ కాలంలో చాలా దేశాల్లో… నెలలు నిండకుండా పుట్టే చిన్నారులకు చికిత్స, సంరక్షణని అందించే నియోనాటల్ […]
కరోనా కారణంగా అన్నీ నష్టాలు కష్టాలే. దానిని అడ్డుకోవడానికి విధించిన లాక్ డౌన్ వలన మరిన్ని అగచాట్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే లాక్ డౌన్ కారణంగా కొన్ని లాభాలూ కలిగాయి. అలాంటివాటిలో ఒకటి నెలలు నిండకుండా జన్మించే శిశువుల సంఖ్య…. అంటే ప్రీమెచ్యూర్ జననాలు తగ్గాయి. డెన్మార్క్ , ఐర్లాండ్ తో పాటు చాలాదేశాలు ఈ విషయాన్ని గమనించాయి. లాక్ డౌన్ కాలంలో చాలా దేశాల్లో… నెలలు నిండకుండా పుట్టే చిన్నారులకు చికిత్స, సంరక్షణని అందించే నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు ఖాళీగా కనిపించాయని పలు మీడియా నివేదికలను బట్టి తెలుస్తోంది.
వాతావరణ కాలుష్యం తగ్గటం వల్లనే ఇలాంటి మంచి ఫలితం వచ్చి ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు. గర్భం ధరించాక 37వ వారం మొదలుకాకముందే ప్రసవం జరిగితే దానిని ప్రీమెచ్యూర్ ప్రసవంగా భావిస్తారు. డెన్మార్క్ లో లాక్ డౌన్ కాలంలో 90శాతం వరకు నెలలు నిండని శిశువుల జననాలు తగ్గిపోవటం వైద్యులు గుర్తించారు. అలాగే ఐర్లాండ్ లోని యూనివర్శిటీ మేటర్నిటీ హాస్పటల్ లైమ్ రాక్ లో గత రెండు దశాబ్దాలతో పోలిస్తే ఈ ఏడాది… జనవరి నుండి ఏప్రిల్ వరకు నెలలు నిండని శిశువుల జననాలు 73 శాతం వరకు తగ్గాయి.
కెనడా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ ల్లో సైతం ఇలాంటి మెరుగైన పరిస్థితులు కనిపించాయి. అయితే ఈ అధ్యయన ఫలితాలను సమీక్షించాల్సి ఉందని… ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రాథమిక సమాచారంతో వైద్యపరమైన నిర్ణయాలు తీసుకోరాదని వైద్యులు భావిస్తున్నారు.
లాక్ డౌన్ కారణంగా గర్భిణులు ఇంట్లోనే ఉండటం వలన వైరల్ ఇన్ ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం తగ్గటం, గాల్లో కాలుష్యం బాగా తగ్గిపోవటం, లాక్ డౌన్ వలన కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఎక్కువగా లభించి గర్భిణుల్లో ఒత్తిడి తగ్గటం, వారు ఉద్యోగినులు అయితే… ఉద్యోగపరమైన ఒత్తిడి సైతం లేకపోవటం… ఇలాంటి కారణాల వలన ప్రీమెచ్యూర్ ప్రసవాలు తగ్గి ఉంటాయని వైద్యులు అంచనా వేస్తున్నారు.