హోమ్ క్వారంటయిన్ లో ఎవరు ఉండవచ్చు? కేంద్ర ప్రభుత్వ తాజా మార్గదర్శకాలు ఇవే....
హోమ్ క్వారంటయిన్… మనకిప్పుడు చాలా సుపరిచితమైన మాట. రోజుకి చాలా సార్లు వింటున్నాం. మనకు తెలిసినవారు, తెలియనివారు…. ఎవరెవరో హోం క్వారంటయిన్ అవుతున్నారని తెలుసుకుంటున్నాం. అయితే కరోనా మరింతగా విజృంభిస్తున్న ఈ తరుణంలో హోం క్వారంటయిన్ గురించిన అవగాహన మరింతగా పెరగాల్సిన అవసరం ఉంది. కరోనా లక్షణాలు ఏవిధంగా ఉన్నపుడు హోం క్వారంటయిన్ లో ఉండవచ్చు. ఎలా ఉంటే ఉండకూడదు… ఎన్ని రోజులు ఇంట్లోనే ఉండాలి, ఎప్పుడు బయటకు రావాలి….బయటకు వచ్చాక మళ్లీ కరోనా నిర్దారణ పరీక్ష […]
హోమ్ క్వారంటయిన్… మనకిప్పుడు చాలా సుపరిచితమైన మాట. రోజుకి చాలా సార్లు వింటున్నాం. మనకు తెలిసినవారు, తెలియనివారు…. ఎవరెవరో హోం క్వారంటయిన్ అవుతున్నారని తెలుసుకుంటున్నాం.
అయితే కరోనా మరింతగా విజృంభిస్తున్న ఈ తరుణంలో హోం క్వారంటయిన్ గురించిన అవగాహన మరింతగా పెరగాల్సిన అవసరం ఉంది. కరోనా లక్షణాలు ఏవిధంగా ఉన్నపుడు హోం క్వారంటయిన్ లో ఉండవచ్చు. ఎలా ఉంటే ఉండకూడదు… ఎన్ని రోజులు ఇంట్లోనే ఉండాలి, ఎప్పుడు బయటకు రావాలి….బయటకు వచ్చాక మళ్లీ కరోనా నిర్దారణ పరీక్ష చేయించుకోవాలా….ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ కేంద్ర ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఇంతకుముందు ఉన్న నిబంధనలను సులభతరం చేస్తూ కొన్ని మార్పులను సైతం చేసింది.
ప్రభుత్వం తెలియజేస్తున్న సూచనల ప్రకారం…
- కరోనా పాజిటివ్ వచ్చి లక్షణాలు చాలా తక్కువగా తేలిగ్గా ఉన్నవారు హోం క్వారంటయిన్ లో ఉండవచ్చు.
- అరవై ఏళ్లు పైబడినవారు, బిపి, మధుమేహం, గుండెజబ్బులు ఉన్నవారు, ఊపిరితిత్తులు, లివర్, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు తదితర తీవ్రమైన అనారోగ్యాలు ఉన్నవారు… వైద్యులు పూర్తి పరీక్షలు చేసి అనుమతి ఇస్తేనే హోమ్ ఐసోలేషన్ లో ఉండవచ్చు.
- హెచ్ ఐవి ఉన్నవారు, అవయవ మార్పిడి చేయించుకున్నవారు, క్యాన్సర్ కి చికిత్స తీసుకుంటున్నవారు హోం క్వారంటయిన్ లో ఉండకూడదు.
- తక్కువ లక్షణాలున్నవారితో పాటు అసలు లక్షణాలు లేనివారు సైతం హోం క్వారంటయిన్ కావచ్చు.
- ఎప్పుడు వైద్యులను సంప్రదించాలి…అనే విషయంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు… ఆక్సిజన్ లెవల్ తగ్గిపోవటం, స్పష్టంగా మాట్లాడలేకపోవటం, మూర్చ రావటం, ముఖంలో లేదా ఏదైనా అవయవంలో బలహీనత, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, ఛాతీలో నొప్పి ఒత్తిడి, పెదవులు, మొహం నీలం రంగులోకి మారిపోవటం…ఇలాంటి లక్షణాలు కనిపించినట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
- హోం ఐసోలేషన్ లో ఉన్నవారు… లక్షణాలు కనిపించిన పది రోజుల అనంతరం అందులోంచి బయటకు రావచ్చు. అయితే లక్షణాలు పూర్తిగా తగ్గటంతో పాటు మూడు రోజులు వరుసగా జ్వరం రాకుండా కూడా ఉండాలి. ఇంతకుముందు అయితే… లక్షణాలు కనిపించిన తరువాత 17 రోజుల అనంతరం, పది రోజులు వరుసగా జ్వరం లేకపోతేనే బయటకు రావాలని ప్రభుత్వం చెప్పింది. ఇందులో మార్పులు చేశారు.
- మార్చిన నిబంధనల ప్రకారం లక్షణాలు తగ్గి హోం క్వారంటయిన్ నుండి బయటకు వచ్చినవారు మరొకసారి కరోనా పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదు.
- హోం ఐసోలేషన్ లో ఉన్నవారు వైద్య సలహాలతో పాటు…కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. వీరు ప్రత్యేకమైన గదిలో ఉండాలి. ముఖ్యంగా పెద్దవయసు వారికి దూరంగా ఉండాలి. మూడు పొరలతో ఉన్న మాస్క్ ని అన్నివేళలా ధరిస్తుండాలి. వైద్య నిపుణులు అందిస్తున్న సూచనల ప్రకారం ప్రతి ఎనిమిది గంటలకు ఒకసారి ధరించిన మాస్క్ ని తీసేస్తుండాలి.
- శరీరంలో టెంపరేచర్ పరిశీలించుకుంటూ… ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.
- తరచుగా సబ్బు, నీళ్లతో చేతులు కడుక్కుంటూ ఉండాలి. కనీసం 40 సెకన్లపాటు కడగాలి.
- తాము వాడిన ఏ వస్తువూ ఇతరులు వాడకుండా చూసుకోవాలి.
- కరోనా ఉన్నవారికి సేవలు అందించేవారు సైతం జాగ్రత్తగా ఉండాలి. ఆ గదిలో ఉన్నంత సేపు మూడు పొరల మాస్క్ ని ధరించి… బయటకు రాగానే దానిని తీసేయాలి. ఈ సమయంలో తమ మొహాన్ని చేతులతో ముట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. కరోనా పాజిటివ్ వ్యక్తిని ముట్టుకోవాల్సి వస్తే… చేతులకు గ్లౌజులు ధరించాలి. వాటిని చేతులకు వేసుకునే ముందు, తీసేసిన తరువాత చేతులను బాగా శుభ్రం చేసుకోవాలి.
- పేషంట్ లాలాజలం కానీ, ముక్కునుండి కారే నీరు కానీ… తమ చేతులకు అంటుకోకుండా సేవలు అందించేవారు జాగ్రత్తపడాలి.
- పేషంట్ వాడుతున్న గిన్నెలు, గ్లాసులవంటివి గ్లౌజ్ వేసుకుని శుభ్రం చేయాలి.
- పేషంటు పట్టుకునే తలుపులు, ట్యాపులు, టేబుల్ ఉపరితలం వంటివి వన్ పర్సెంట్ హైపో క్లోరైట్ సొల్యుషన్ తో శుభ్రం చేయాలి.
- చేతులను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. కడిగిన చేతులను వాడి పారేసే పేపర్ టవల్స్ తో శుభ్రం చేసుకోవాలి.
- సేవలు అందించేవారు తప్పకుండా తమ ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ తీసుకోవాలి. టెంపరేచర్ చూసుకుంటూ ఉండాలి. లక్షణాలు కనబడితే వెంటనే టెస్ట్ చేయించుకోవాలి.
- పేషంట్లకు ఆహారం వారి గదిలోనే ఇస్తుండాలి.