అభినందించకపోయినా పర్వాలేదు... తప్పుడు వార్తలు రాయొద్దు " జవహర్‌ రెడ్డి

గ్రీన్‌ జోన్‌లను కాపాడుకుంటూ రెడ్‌జోన్లను నియంత్రించడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి. ప్రస్తుతం ఏపీలో 103 మండలాల్లో 181 క్లస్టర్లు ఉన్నట్టు వివరించారు. రెడ్‌జోన్‌లో 56 మండలాలు, ఆరెంజ్‌ జోన్‌ మండలాలు 47, గ్రీన్ జోన్‌లో 573 మండలాలు ఉన్నాయని వెల్లడించారు. కర్నూలు, గుంటూరు, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో ఎక్కువ కరోనా కేసులు నమోదు అవుతున్నాయని చెప్పారు. పరీక్షల సామర్థ్యం భారీగా పెంచుకోగలిగామని చెప్పారు. ఏప్రిల్‌ 7 […]

Advertisement
Update:2020-04-23 15:07 IST

గ్రీన్‌ జోన్‌లను కాపాడుకుంటూ రెడ్‌జోన్లను నియంత్రించడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి. ప్రస్తుతం ఏపీలో 103 మండలాల్లో 181 క్లస్టర్లు ఉన్నట్టు వివరించారు. రెడ్‌జోన్‌లో 56 మండలాలు, ఆరెంజ్‌ జోన్‌ మండలాలు 47, గ్రీన్ జోన్‌లో 573 మండలాలు ఉన్నాయని వెల్లడించారు. కర్నూలు, గుంటూరు, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో ఎక్కువ కరోనా కేసులు నమోదు అవుతున్నాయని చెప్పారు.

పరీక్షల సామర్థ్యం భారీగా పెంచుకోగలిగామని చెప్పారు. ఏప్రిల్‌ 7 నాటికి 3,930 పరీక్షలు చేశామని… ఏప్రిల్‌ 16 నాటికి 16వేల550 పరీక్షలు చేయగలిగామన్నారు. నేటికి ఆ సంఖ్య 48 వేల పరీక్షలకు పెరిగిందన్నారు.

ప్రస్తుతం 9 ల్యాబుల్లో రోజుకు 3,480 పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ట్రూనాట్‌ మిషన్ల ద్వారా 3,500 పరీక్షలు రోజుకు చేయగలుగుతున్నామన్నారు. మొత్తం మీద రోజుకు ఈ రెండు విధానాల్లోనే 6వేల900ల పరీక్షలు చేయగలుగుతున్నామన్నారు. దేశంలోనే అత్యధిక పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నెంబర్ వన్ స్థానంలో ప్రస్తుతం ఉందన్నారు.

ఏపీలో సరిగ్గా పరీక్షలు చేయడం లేదని విమర్శించే వారు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చేస్తున్న పరీక్షల డేటాను గమనిస్తే నిజం తెలుస్తుందన్నారు. దేశంలోనే పరీక్షల నిర్వహణలో ఏపీ నెంబర్‌ వన్‌గా ఉంటే కొందరు కొరియా తరహాలో భారీగా ఎందుకు పరీక్షలు చేయడం లేదు అని ప్రశ్నించడం సరికాదన్నారు.

కర్నూలు ఆస్పత్రిని స్టేట్ కోవిడ్ ఆస్పత్రిగా ప్రకటించామన్నారు. సీరియస్‌గా ఉన్న కోవిడ్ పేషంట్లకు వైద్యం అందించే విషయంలో సూచనలు చేసేందుకు ఒక నిపుణుల టీంను కూడా ఏర్పాటు చేశామన్నారు. నిపుణుల బృందం కంట్రోల్ రూం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లోని డాక్టర్లకు సూచనలు ఇస్తుందన్నారు.

ప్రస్తుతం లక్షా 40వేల ఎన్‌-95 మాస్కులు అందుబాటులో ఉన్నాయన్నారు. పీపీఈ కిట్లు మూడు లక్షలు ఉన్నాయన్నారు. 43 లక్షల మాస్కులు, 31 లక్షల గ్లౌజ్‌లు వైద్యులకు అందుబాటులో ఉంచామన్నారు. సామాన్యులకు మనిషికి మూడు చొప్పున 16 కోట్ల సాధారణ మాస్కులను అందిస్తున్నట్టు వెల్లడించారు. మాస్కులు సరఫరా చేసిన తర్వాత త్వరలోనే మాస్కులు తప్పనిసరిగా ధరించాలన్న నిబంధన తీసుకొస్తున్నట్టు చెప్పారు.

ఆక్సిజన్ సిలిండర్ల కెపాసిటీ లక్ష క్యూబిక్ మీటర్లు అవసరం ఉంటుందని అంచనా ఉండగా… ప్రస్తుతం రాష్ట్రంలో రెండు లక్షల 21 వేల క్యూబిక్ మీటర్ల ఆక్సిజన్ ను అందుబాటులో ఉంచామని జవహర్ రెడ్డి వివరించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క సిబ్బంది ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని… ఇలాంటి సమయంలో వారిని అభినందించకపోయినా పర్వాలేదని… లేనిపోని విమర్శలు, ఆరోపణలు మాత్రం చేయవద్దని మీడియాను కోరారు. ఏదైనా పొరపాటు జరిగినట్టు భావిస్తే ఒక సారి వివరణ తీసుకుని ఆ తర్వాత వార్తలు ప్రచురిస్తే బాగుంటుందని కోరారు.

60 సెంటర్ల నుంచి డేటా సేకరించి వివరాలు చెప్పాల్సి ఉంటుందని అందుకే రోజుకు ఒకసారి బులిటెన్ విడుదల చేస్తున్నట్టు చెప్పారు. అధికారికంగా ఇచ్చే వివరాలను మీడియాలో ప్రచురించాలని… తప్పుడు సమాచారం ప్రజలకు అందించవద్దని విజ్ఞప్తి చేశారు.

దేశంలోనే అత్యధిక పరీక్షలు రాష్ట్రం చేస్తుంటే ఇంకా కొందరు కేసులు దాస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారని ఆవేదన చెందారు. అసలు కరోనా కేసులు దాస్తే దాగే అవకాశమే ఉండదని… కరోనా సోకిన వ్యక్తులను అలా వదిలేస్తే వారు మరింత మందికి అంటిస్తారని… కాబట్టి కరోనాను దాచే పని చేస్తే ఇబ్బందులు ఇంకా పెరుగుతాయన్నారు. కాబట్టి కరోనా తీవ్రతను దాస్తే వచ్చే లాభం ఏమీ ఉండదన్నారు.

అందుకే తాము అత్యధిక పరీక్షలు చేసి… వీలైనంత త్వరగా కరోనా పేషెంట్లను గుర్తించి వారికి వైద్యం అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. తప్పుడు వార్తలు రాయవద్దని మీడియాకు విజ్ఞప్తి చేయడమే కాకుండా… ఒక విధంగా హెచ్చరిక కూడా చేస్తున్నామని జవహర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Tags:    
Advertisement

Similar News