ఎలక్షన్ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌పై సీఎం జగన్ ఫైర్

కరోనా పేరుతో ఎన్నికలు ఆపారు. మరి అధికారుల బదిలీ ఎందుకు..? ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్‌ను కమిషనర్ చదివారు. కరోనాపై ఆందోళన తగదు. ఏపీ ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్దంగా ఉంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న వేళ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏక పక్షంగా వాయిదా వేయడంపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో గంటకు పైగా భేటీ అయ్యారు. ఆ తర్వాత ఆయన […]

Advertisement
Update:2020-03-16 02:01 IST
  • కరోనా పేరుతో ఎన్నికలు ఆపారు.
  • మరి అధికారుల బదిలీ ఎందుకు..?
  • ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్‌ను కమిషనర్ చదివారు.
  • కరోనాపై ఆందోళన తగదు.
  • ఏపీ ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్దంగా ఉంది.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న వేళ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏక పక్షంగా వాయిదా వేయడంపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో గంటకు పైగా భేటీ అయ్యారు. ఆ తర్వాత ఆయన క్యాంపు కార్యాలయంలో మీడియాకు పలు విషయాలు వెల్లడించారు.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రెస్ మీట్ పెట్టడం బాధకరంగా ఉందన్నారు. కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఎన్నికలను నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. అప్పట్లో చంద్రబాబు తన సామాజిక వర్గానికి చెందిన ఒక ఐఏఎస్ అధికారిని ఏరికోరి ఎన్నికల కమిషనర్‌గా నియమింపజేసుకున్నారని జగన్ ఆరోపించారు.

ఎన్నికల కమిషనర్‌కు ప్రాథమికంగా ఉండాల్సిన లక్షణం నిష్పాక్షికత.. కాని ఈయనకు నిష్ఫాక్షితే కాదు కనీసం విచక్షణ కూడా లేనట్లు ప్రవర్తిస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో ఉన్న అధికారి కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా పని చేయాలి. అప్పుడే ఆయన స్థానానికి ఒక గౌరవం వస్తుంది.

కానీ ఈయన ఎన్నికల వాయిదాకు చూపించిన సాకు.. ఆ తర్వాత ఆయన చేస్తున్న పనులకు పొంతనే లేదు. కరోనా వైరస్ వ్యాపిస్తున్నందుకు ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు చెప్పి.. ఆ తర్వాత గుంటూరు, చిత్తూరు కలెక్టర్లు, ఎస్పీలతో పాటు మరి కొందరు అధికారులను, మాచర్ల సీఐని తప్పిస్తున్నట్లు ప్రకటన చేశారు. అలా ఎవరైనా చేయగలుగుతారా..?

ఎన్నికలు జరిగే కాలంలో తాను ఏమైనా చేయవచ్చునని అనుకుంటున్నారా అని సీఎం జగన్ ప్రశ్నించారు. మరి మాకు ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలను ఇస్తే అధికారంలోని వచ్చాం. సీఎంగా తనకూ అధికారాలు ఉంటాయని జగన్ అన్నారు. తన విచక్షణ అధికారం మేరకు ఎన్నికలను వాయిదా వేస్తున్నారని చెప్పారు. ఈ మధ్య ‘విచక్షణాధికారం’ అనడం అందరూ నేర్చుకున్నారంటూ పరోక్షంగా మండలిలో చైర్మన్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలను జగన్ ఉఠంకించారు.

పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే సంతోషించాల్సింది పోయి.. వెంటనే ఆపేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు అధికారులకు ఇళ్ల స్థలాలు పంచొద్దని మెమోలు ఇస్తున్నారు. ఇవ్వాళేమో ఏకంగా ఎన్నికలు వాయిదా అని ప్రకటించారు. అయినా నిన్నటికి, ఇవ్వాళ్టికి తేడా ఏముంది. పొద్దునకల్లా ఏం మారిపోయిందని జగన్ ప్రశ్నించారు.

రాష్ట్రవ్యాప్తంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీలను వైసీపీ ఏకగ్రీవంగా గెలవడం ఇతర పార్టీల వారికి దుర్వార్తగా మారింది. చంద్రబాబు ఇంకా దారుణంగా దెబ్బతింటున్నాడని గ్రహించి ఉదయానికల్లా నాలుగు పేజీల రద్దు ఆర్డర్ చదివి వినిపించారని జగన్ అన్నారు. ఏకగ్రీవాలు తప్పెలా అవుతాయి.. 2013 స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో టీడీపీ ఏకగ్రీవాల్లో సత్తా చాటిందని ఈనాడు పేపర్ రాసింది. ఏకగ్రీవం అనేది కొత్త కాదు, తప్పేమీ కాదు.

కానీ వైసీపీ ఏకగ్రీవంగా గెలవడాన్ని వాళ్లు జీర్ణించుకోలేక పోతున్నారు. 9 నెలల క్రితం 151 స్థానాలు గెలిచాం.. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుంటే చంద్రబాబు తట్టుకోలేక పోతున్నారు. అందుకే తన సామాజిక వర్గానికి చెందిన అధికారులను వాడుకుంటున్నారని జగన్ ఆరోపించారు.

ఈ నెల 31లోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోతే 14వ ఆర్థిక సంఘం నిధులు దాదాపు 5 వేల కోట్లు రాష్ట్రం కోల్పోతుంది. ఆ డబ్బు ఎందుకు కోల్పోవాలి. అభివృద్ధి కార్యక్రమాలకు ఎంతో కొంత ఉపయోగపడతాయి కదా అని ఎన్నికలు జరుపుతున్నాం. కాని ఆ డబ్బు వస్తే ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయనే అక్కసు చంద్రబాబుది. కేవలం తాను ముఖ్యమంత్రి కాలేకపోయాననే ఇలా ప్రవర్తిస్తున్నారు. రాబోయే రోజుల్లో పరిస్థితులు ఏమైనా మారిపోతాయా..? 10 రోజుల్లో ఎన్నికలు అయిపోతే ఆ నిధులు వచ్చేవి.. అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగేవి అని సీఎం ఆవేదన చెందారు.

అధికారం చెలాయించాలనే ఇలా ప్రవర్తించడం సరికాదని.. ప్రజలకు మంచి చేస్తున్నామా? కీడు చేస్తున్నామా? అని ఆలోచించుకోవాలని జగన్ హితవు పలికారు. ఎన్నికల కమిషనర్‌ను పిలిపించి మాట్లాడమని గవర్నర్ ను కోరామని.. అయినా కమిషనర్‌లో మార్పు రాకపోతే పై స్థాయికి ఈ విషయాన్ని తీసుకెళ్తామని జగన్ స్పష్టం చేశారు.

ఎన్నికల రద్దుకు ముందు ఆరోగ్య శాఖకు చెందిన, ప్రభుత్వ ఉన్నతాధికారులను అసలు సంప్రదించనే లేదు. కాని ఆ రద్దు ఆర్డర్‌లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇన్‌పుట్స్ తీసుకున్నామని కమిషనర్ చెప్పడం సిగ్గు చేటని జగన్ అన్నారు.

కరోనా పట్ల ప్రజలు ఆందోళన చెందవద్దు..

ప్రజలు కరోనా పట్ల ఆందోళన చెందవద్దని సీఎం జగన్ అన్నారు. కరోనా ఇతర దేశాల నుంచి మన దగ్గరకు ప్రబలిన వైరస్. దీన్ని వ్యాది అని కూడా అనలేం. లక్ష మందికి చైనాలో ఈ వైరస్ సోకితే 60 వేల మందికి పైగా ఇప్పటికే కోలుకొని ఇండ్లకు వెళ్లిపోయారు. సాధారణంగా ఈ వైరస్ వల్ల 60 ఏళ్లు పైబడిన వారికీ.. డయాబెటిక్, బీపీ, కిడ్నీ, లివర్, ఆస్తమా ఉన్న రోగులకు ప్రమాదకరంగా మారవచ్చు.

ఇప్పటికే ప్రభుత్వం తరపున అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం.. నిమోనియా వచ్చినప్పుడు ఎలా స్పందించామో.. ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇతర దేశాల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్లు, కార్మికులను ఆయా దేశాలు వెనక్కి పంపించే అవకాశం ఉంది. అదే జరిగితే వారందరికీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం.. అనుమానితులను 14 రోజుల పాటు క్వారంటైన్‌లో పెట్టడం చేయాలి.

ఇదంతా ఒక నిరంతర ప్రక్రియ అని జగన్ చెప్పారు. దేశంలో కరోనా పరీక్షల ల్యాబ్స్ 51 ఉంటే.. ఏపీలో రెండు ఉన్నాయని.. ప్రస్తుతం ఉన్న తిరుపతి, విజయవాడలో ల్యాబ్స్ ఏర్పాటు చేస్తున్నాం. కాకినాడలో మరో ల్యాబ్ కూడా సిద్దం చేస్తున్నామని అన్నారు. నెల్లూరులో ఒక పాజిటీవ్ కేసు రాగానే ఒక కిలో మీటర్ పరిధిలో 40 మందితో కలసి సర్వే చేయించాం. ఇలా కరోనా పట్ల ఎంతో అప్రమత్తంగా ఉన్నామని.. ప్రజలు భయాందోళనలు చెందవద్దని సీఎం జగన్ చెప్పారు.

Tags:    
Advertisement

Similar News