ఇక గ్రామ గ్రామాన వైఎస్ఆర్ క్లీనిక్స్... సీఎం జగన్ కీలక నిర్ణయాలు!

రాష్ట్రంలో ప్రతీ రెండు వేల జనాభాను ఒక యూనిట్‌గా తీసుకొని, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా విలేజ్ క్లీనిక్స్ అందుబాటులోకి తీసుకొని రావాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. గురువారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లీనిక్స్ అందుబాటులో ఉంచాలని.. అందులో బీఎస్సీ నర్సింగ్ చేసిన […]

Advertisement
Update:2020-02-28 06:43 IST

రాష్ట్రంలో ప్రతీ రెండు వేల జనాభాను ఒక యూనిట్‌గా తీసుకొని, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా విలేజ్ క్లీనిక్స్ అందుబాటులోకి తీసుకొని రావాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. గురువారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ప్రతీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లీనిక్స్ అందుబాటులో ఉంచాలని.. అందులో బీఎస్సీ నర్సింగ్ చేసిన స్టాఫ్ నర్స్‌ను నియమించాలని ఆయన అధికారులకు సూచించారు. అంతే కాకుండా ఈ క్లీనిక్స్ ఒక రెఫరల్ పాయింట్స్‌లా ఉపయోగపడాలని ఆయన చెప్పారు. ఆ క్లీనిక్ పరిధిలోని జనాభాకు ఉచితంగా ప్రాథమిక వైద్యం అందించాలని.. అలా ప్రజలకు భరోసా కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ఇక రాష్ట్రంలోని 6వ తరగతి లోపు చదువుతున్న విద్యార్థులందరికీ ‘డాక్టర్ వైఎస్ఆర్ చిరునవ్వు’ పథకం ద్వారా ఉచిత దంత వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రతీ విద్యార్థికి ఒక బ్రష్, టూత్ పేస్ట్ ఉచితంగా అందించాలని ఆయన చెప్పారు. ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో ఈ దంత పరీక్షలు నిర్వహించాలని.. రాష్ట్రంలోని 60 లక్షల మంది చిన్నారులను స్క్రీనింగ్ చేయాలని ఆయన చెప్పారు.

ఇక ప్రతీ పార్లమెంటు నియోజకవర్గంలో ఒక బోధనాసుపత్రి ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. బోధనాసుపత్రుల ద్వారానే ప్రజలకు స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయని ఆయన అన్నారు. కాగా, ఇప్పటికే రాష్ట్రంలో 11 బోధనాసుపత్రులు ఉన్నాయని.. మరో 7 ఆసుపత్రుల కోసం డీపీఆర్‌లు సిద్దమవుతున్నట్లు అధికారులు సీఎంకు చెప్పారు. అయితే బోధనాసుపత్రులలో దంత విద్య కూడా అందుబాటులో ఉండేలా చూడాలని సీఎం ఆదేశించారు.

Tags:    
Advertisement

Similar News