మరో 14 నెలల్లో తెలుగుజాతి స్వప్నాన్ని నిజం చేయనున్న 'మేఘా'
గోదావరిలో మహాయజ్ఞం మొదలైంది. పోలవరం నిర్మాణానికి అటు ప్రభుత్వం ఇటు మేఘా సర్వశక్తులు సమీకరించి ఒక మహా క్రతువుకు నడుంబిగించాయి. అనునిత్యం శ్రామికులు అంకుఠిత దీక్షతో పాటు భారీ యంత్రాలు, అత్యధిక సంఖ్యలో వాహనాల రణగొణధ్వనులు సైతం ప్రాజెక్ట్‌కు సవ్వడిలా మారిపోయాయి. వరద ప్రవాహంతో ఉప్పొంగే గోదావరి నదిలో పోలవరం పనులు పరవళ్లు తొక్కుతున్నాయి. దశాబ్దాల క్రితం రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్ట్ పనులు ప్రారంభమై పుష్కరకాలం గడిచిపోయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా తయారైన […]
గోదావరిలో మహాయజ్ఞం మొదలైంది. పోలవరం నిర్మాణానికి అటు ప్రభుత్వం ఇటు మేఘా సర్వశక్తులు సమీకరించి ఒక మహా క్రతువుకు నడుంబిగించాయి. అనునిత్యం శ్రామికులు అంకుఠిత దీక్షతో పాటు భారీ యంత్రాలు, అత్యధిక సంఖ్యలో వాహనాల రణగొణధ్వనులు సైతం ప్రాజెక్ట్‌కు సవ్వడిలా మారిపోయాయి.
వరద ప్రవాహంతో ఉప్పొంగే గోదావరి నదిలో పోలవరం పనులు పరవళ్లు తొక్కుతున్నాయి. దశాబ్దాల క్రితం రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్ట్ పనులు ప్రారంభమై పుష్కరకాలం గడిచిపోయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా తయారైన పరిస్థితి నుంచి ఇప్పుడు పనులు చకచకా సాగుతున్నాయి.
నత్తతో పోటీ పడుతున్నట్లుగా సాగిన పోలవరం ప్రాజెక్ట్ పనులు ఇటీవలే ఉరకలు వేసే స్థాయికి ఊపందుకున్నాయి. వరద నీరు సముద్రంలోకి కలిసిపోకుండా అడ్డుకట్ట వేసి రైతులను ఆదుకునే విధంగా నీరందించే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఇంతకాలానికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పట్టుదల వల్ల దిశ-దశను నిర్దేశించుకొని ముందుకు సాగుతోంది. దేశంలోనే భారీ ప్రాజెక్ట్‌ల్లో ఒకటైన పోలవరం ప్రాజెక్ట్‌లో మేఘా స్థాయిలో పనులు పరుగందుకున్నాయి.
రికార్డు స్థాయిలో 3.07 లక్షల ఘనపు మీటర్ల కాంక్రీట్ పనిని ఏడు నుంచి ఏనిమిది నెలల్లో పూర్తిచేయాలనేది మేఘా ఇంజనీరింగ్ లక్ష్యంగా నిర్ణయించుకుని అందుకు అవసరమైన ఇంజనీరింగ్ సిబ్బంది, అధునాతన యంత్రాలతో పాటు కనీసం 5 వేల మంది కార్మికులు అనునిత్యం పనిచేసే విధంగా పండగ వాతావరణం నెలకొంది.
శ్రమైక జీవన వాతావరణంలో అందరూ అకుంఠిత దీక్షతో పోలవరం క్రతువులో నిమగ్నమయ్యారు. ఈ పరిస్థితుల్లో పనులను పరిశీలించి మరింత వేగవంతం చేయడానికి అవసరమైన మార్గనిర్దేశం చేయడానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 27న ప్రాజెక్ట్‌ను పరిశీలించనున్నారు.
లక్ష్యం ప్రకారం ‘మేఘా’ ముందుకు
బహుళార్ధక సాధక ప్రాజెక్ట్ పోలవరం నిర్మాణం ఇప్పుడు క్రియాశీల దశకు చేరుకుంది. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం, హంద్రీ-నీవా, పట్టిసీమ లాంటి అనేక ప్రాజెక్టులను నిర్ణీత గడువుకన్నా ముందే పూర్తిచేసిన మేఘా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఇఐఎల్) ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పనులను చేపట్టింది. ఇందులో జలాశయానికి సంబంధించిన ప్రధానమైన పనులు ముఖ్యంగా స్పిల్‌వే, ఎర్త్‌కమ్ ర్యాక్‌ఫిల్ డ్యామ్ మొదలైనవి 2021 ఖరీఫ్ సీజన్‌లో పూర్తిచేసేలా ప్రభుత్వం, మేఘా సంస్థ ప్రణాళికను రూపొందించింది. వచ్చే ఏడాది జూన్ నాటికి పనులు పూర్తిచేయాలనే ముఖ్యమంత్రి లక్ష్యానికి తగిన విధంగా ప్రాజెక్ట్ పనులల్లో మైల్‌స్టోన్స్‌ను స్పష్టంగా మేఘా సంస్థ నిర్దేశించింది.
ఆ ప్రకారం 2021 ఏప్రిల్ చివరి నాటికి ఎటువంటి అవాంతరాలు ఎదురుకాకపోతే పూర్తిచేయాలనేది లక్ష్యంగా పనులు మొదలయ్యాయి. వేగంగా జరుగుతున్న పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో స్పిల్‌వేకు సంబంధించిన 53 బ్లాకులు ముఖ్యమైనవి కాగా వాటిని నిర్దేశించిన గడువులోగా పూర్తిచేసే విధంగా ఇంజనీరింగ్ యంత్రాంగంతో పాటు అవసరమైన అధునాతన యంత్ర సామాగ్రి వినియోగంలోకి వచ్చాయి. అదే సమయంలో మట్టి, కాంక్రీట్ పనులు లక్ష్యానికి తగిన విధంగా ప్రతినెలా పూర్తిచేయడానికి అవసరమైన ఏర్పాట్లు కూడా ప్రాజెక్ట్ వద్ద సమకూరాయి.
గత ఇంజనీరింగ్ తప్పిదాలతో పనులకు అవాంతరాలు
ప్రభుత్వానికి 628 కోట్లు ఆదా అయ్యే విధంగా మేఘా ఇంజనీరింగ్ ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పనులును రివర్స్ టెండరింగ్‌లో దక్కించుకుంది. నవంబర్‌లో పనులను ప్రారంభించినప్పటికీ వెనువెంటనే నిర్మాణ పనులు వేగం చేయడానికి వీలు కాలేదు. అందుకు కారణం గతంలో నిర్మాణ పనులను ఇంజనీరింగ్ పద్ధతిలో కాకుండా ఇతరత్రా అవసరాలకు తగిన విధంగా ప్రారంభించడం వల్ల ఇప్పుడు పనులను వేగం చేయడానికి ప్రారంభంలో సమస్యలు తలెత్తాయని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు.
కాఫర్ డ్యాం వల్లే ఆలస్యం
ఈమధ్య కాలంలో ఎప్పుడూ లేనివిధంగా గత ఏడాది గోదావరికి భారీ వరదలు వచ్చాయి. అవి ఎక్కువ రోజులు కొనసాగాయి. అప్పట్లో ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో ఇంజనీరింగ్ పద్ధతి పాటించకుండా ముందు కాఫర్ డ్యాం నిర్మించడం వల్ల స్పిల్‌వే ప్రాంతంలో వరద ముంపు అధికమయ్యింది. అదే సమయంలో దాదాపు 4 టిఎంసీల వరద నీరు నిర్మాణ ప్రాంతంలో చేరింది. దీనివల్ల ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించిన ప్రాంతమంత ముంపునకు గురవ్వడంతో పాటు అక్కడి రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి.
దాంతో మేఘా ఇంజనీరింగ్ సంస్థ పని చేపట్టిన తరువాత ఆ ముంపు సమస్య (డీ-వాటరింగ్) నుంచి బయటపడడంతో పాటు మళ్లీ రహదారులు నిర్మించుకుని వర్క్స్ స్పేస్‌ను తయారు చేసుకోవడానికి మూడు నెలల సమయం పట్టింది. ఈ మొత్తం సమస్యకు ముందుగా అప్పటి ప్రభుత్వం కాఫర్ డ్యామ్ నిర్మించడమే ప్రధాన కారణమనేది ఇంజనీరింగ్ వర్గాలు స్పష్టంగా చెబుతున్నాయి.
ఎట్టకేలకు ఇప్పుడు ఆ అవాంతరాలను అధిగమించి నిర్మాణ పనులు ఫిబ్రవరి నుంచి వేగవంతమయ్యాయి. పోలవరం ప్రాజెక్ట్ ద్వారా ఉభయగోదావరి జిల్లాల్లో లక్షా ముప్పైవేలు సాగులోకి రావడంతో పాటు 80 టిఎంసీల నీటిని కృష్ణకు తరలించడమే కాకుండా గోదావరి డెల్టాలో 13 లక్షల ఆయకట్టు రబీలో స్థిరీకరించి ఎడమ కాలువ క్రింద లక్షా అరవైవేల ఎకరాలకు నీరందిస్తారు. అదే సమయంలో విశాఖ నగరానికి తాగునీటి అవసరాల కోసం 23.44 టిఎంసీల నీరు అందిస్తారు.
శరవేగంగా 2.05 లక్షల కాంక్రీట్ పనులు
ప్రస్తుతం పోలవరం పనులు ఊపందుకున్నాయి. జలాశయంలో స్పిల్‌వే కీలకమైనది. ఇందుకు సంబంధించి 53 బ్లాకులను నిర్మించాలి. ఒక్కొక్క బ్లాకు 55 మీటర్ల ఎత్తు ఉండే విధంగా స్పిల్‌వే పియర్స్ ఊపందుకున్నాయి. ఒక బ్లాకులో ఒక మీటర్ ఎత్తు నిర్మించడానికి (కాంక్రీట్ వేయడానికి) నాలుగు రోజుల సమయం పడుతుంది. అయితే ప్రతీరోజు సరాసరిన 12 బ్లాకుల్లో ఎత్తు పెంచే పని చురుగ్గా జరుగుతోంది. ఈ మొత్తం స్పిల్‌వేలో రెండున్నర లక్షల క్యూబిక్ మీటర్ల పనిచేయాలి.
ప్రాజెక్ట్ నిర్మాణంలో వరద వల్ల అవాంతరాలు ఎదురయిన తరువాత వాటిని అధిగమించి జనవరి నెలాఖరు నాటికి 25 వేల క్యూబిక్ మీటర్ల పనిని ఎంఇఐఎల్ పూర్తిచేసింది. ఫిబ్రవరిలో 40 వేల క్యూబిక్ మీటర్లు పూర్తి చేసే విధంగా పనులు వేగవంతమయ్యాయి. మార్చిలో 50 వేల క్యూబిక్ మీటర్లకు పెంచాలనే లక్ష్యానికి తగిన విధంగా దిశ-దశను నిర్దేశించుకొని నీటి పారుదల శాఖ పర్యావేక్షణలో ప్రాజెక్ట్ ఇంజనీర్లు శ్రమిస్తున్నారు.
ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో మొత్తం పనిని అంటే 2.05 లక్షల క్యూబిక్ మీటర్ల పనులను పూర్తిచేయాలనేది మేఘా మైల్‌స్టోన్స్ నిర్దేశించుకుంది. ఎత్తు పెరిగేకొద్ది పనులు చేయడం క్లిష్టం అవుతోంది. అయినప్పటికీ పనిలో ఎటువంటి సమస్యలు ఎదురుకాకుండా యంత్ర సామాగ్రిని సమకూర్చుకోవడం ద్వారా లక్ష్యం మేరకు ముందుకు సాగుతోంది.
అదే సమయంలో స్పిల్‌వే బ్లాకుకు సంబంధించిన పియర్స్‌లో కూడా కాంక్రీట్ పనులు ఊపందుకున్నాయి. కనీసం రోజుకు 15 వందల క్యూబిక్ మీటర్ల పనిచేయాలనేది లక్ష్యం. ఈ ప్రాజెక్ట్‌లో కీలకమైన స్పిల్‌వేలోని పియర్స్, ఎర్త్‌కమ్ ర్యాక్‌ఫిల్‌లోని పునాది పనులు గతంలో నిలిచిపోయాయి. వాటిని ఇప్పుడు ప్రభుత్వ లక్ష్యం మేరకు మేఘా వేగం చేసింది.
జలాశయంలో మరో కీలకమైనవి 1,2,3 గ్యాప్‌లు. వీటిలో గ్యాప్-1,3కి సంబంధించి ఇంతవరకు డిజైన్ అనుమతి లభించలేదు. ప్రధాన జలాశయంలో భాగంగా ఉండే ఈ రెండు పనులకు సంబంధించిన డిజైన్లు ఆమోదం పొందే పనికూడా మేఘా చేపట్టింది.
జలాశయం మొత్తం ఒక్కటైనాప్పటికీ అందులో మూడు విభాగాలుగా పరిగణలోకి తీసుకుంటారు. గ్యాప్‌తో పాటు స్పిల్ వే, ఎర్త్ కమ్ ర్యాక్‌ఫిల్ డ్యాం కీలకమైనవి. ఇందులో గ్యాప్-3 చిన్నపాటి కాంక్రీట్ డ్యామ్‌గా 150 మీటర్ల పొడవుతో పూర్తిచేయాలి. గ్యాప్-2లో ఎర్త్‌కమ్ ర్యాక్‌ఫిల్ డ్యాం ఉంటుంది. దీనినే ప్రధానమైన జలాశయంగా పిలుస్తారు. దీని పొడవు 1.75 కిలోమీటర్లు ఉంటుంది. గ్యాప్-1లో కూడా ఎర్త్‌కమ్ ర్యాక్‌ఫిల్ డ్యామే నిర్మించాలి. దీని పొడవు 450 మీటర్లు ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు నిర్మించిన ఏ ప్రాజెక్ట్‌లోనూ లేనివిధంగా ఈ జలాశయం పొడవైనది. నిర్మాణానికి ఉపయోగించే ముడిసరుకు ముఖ్యంగా కాంక్రీట్, మట్టి పని మొదలైనవి ఎక్కడాలేనంత భారీ స్థాయిలో ఇక్కడ వినియోగిస్తారని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు.
ర్యాక్‌ఫిల్ డ్యాం పరీక్షలు సైతం ఇప్పుడే…
ప్రాజెక్ట్‌లో ర్యాక్‌ఫిల్ డ్యాం పనులు చేపట్టడానికి అవసరమైన ప్రాథమికమైన సాంకేతిక అంచనాలు మేఘా పనిచేపట్టే నాటికి పూర్తి కాలేదు. అందుకోసం ఇప్పుడు పరీక్షలు నిర్వహిస్తున్నారు. సాంకేతికంగా చెప్పాలంటే నది గర్భంలోని ఇసుక గట్టితనం తెలుసుకునేందుకు అవసరమైన వైబ్రో కంప్యాక్షన్ పరీక్షలను ప్రస్తుతం మేఘా నిర్వహిస్తోంది.
అదే సమయంలో ప్రాజెక్ట్‌కు ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పనులు కూడా పూర్తయ్యాయి. వీటి నిర్మాణం వల్ల ప్రాజెక్ట్ పనిజరుగుతున్నప్పుడు వరదలు వస్తే ఎటువంటి అవాంతరాలు ఎదురుకాకుండా నీటిని మళ్లించడం వీలవుతుంది. అదే విధంగా గ్యాప్-1లో డయాఫ్రం వాల్, స్పిల్ వే ఎగువ, దిగువన కాంక్రీట్ పనులు ప్రారంభించడానికి మేఘా ఏర్పాట్లు చేసుకుంది.
2021 ఏప్రిల్ లక్ష్యంగా మేఘా పోలవరం పనులు
పోలవరం ప్రాజెక్ట్‌ల్లో పనులను పూర్తిచేయడానికి మేఘా ఇంజనీరింగ్ సంస్థ మైల్‌స్టోన్స్‌ను నిర్దేశించింది. ఈ సంస్థకు సంబంధించిన పనులల్లో స్పిల్‌వే కాంక్రీట్ పనిని 5 నెలలో అంటే 2020 జూన్ నెలఖరు నాటికి పూర్తిచేయానేది లక్ష్యం. ఇందులో భాగంగానే ఉండే బీమ్‌లు అంతకన్నా ముందే మే నెలఖరు నాటికి పూర్తిచేయాలని ప్రణాళిక ప్రకారం పనులు వేగిరం అయ్యాయి.
స్పిల్‌వేకు సంబంధించిన బ్రిడ్జ్ పనులు ఈ ఏడాది ఆగష్టు నెలాఖరు నాటికి పూర్తికావాలి. అంటే ఈ పని ఏడు నెలల సమయం పడుతుంది. స్పిల్ వే చానెల్‌కు సంబంధించిన బ్రిడ్జ్ పనులు 2021 మే నాటికి పూర్తికావాలి. ఈ పని మొత్తంగా 14 నెలల సమయం పడుతుంది. అయితే ఇంతవరకు ఈ పనికి సంబంధించిన డిజైన్ అనుమతి లభించలేదు.
ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత డిజైన్ అనుమతి తీసుకోవడంతో మార్చి నెలలో పనులు ప్రారంభించడానికి చకచకా పనులు జరుగుతున్నాయి. డివైడ్ వాల్, ట్రైనింగ్‌వాల్, గైడ్ వాల్ లాంటివి 5 నెలల్లో అంటే ఈ ఏడాది మే నెలఖరుకు పూర్తిచేయాలి. స్పిల్‌వేతో సహా మొత్తం ప్రాజెక్ట్‌లో 3.07 లక్షల ఘనపు మీటర్ల కాంక్రీట్ పని ఉంటుంది.
ఇంత పెద్ద పనిని ఏడు నెలల్లో అంటే గోదావరికి వరదలు ప్రారంభం కాకముందే ఈ ఏడాది జులై నాటికి పూర్తి చేయాలనేది మేఘా లక్ష్యం. ఇతరత్రా పనులు ముఖ్యంగా ప్రాజెక్ట్ కోటింగ్, సర్‌ఫేస్ డ్రస్సింగ్, తారు రహదారి లాంటి ఫినిషింగ్ పనులు 2021 ఆగష్టు నాటికి పూర్తవుతాయి.