భారత కుర్రాళ్లకు ప్రపంచకప్ పరీక్ష!

ప్రపంచ క్రికెట్ కు చిరునామా భారత్ కొత్త దశాబ్దంలోని తొలి సంవత్సరంలోనే జూనియర్ ప్రపంచకప్ టైటిల్ కు గురిపెట్టింది. దక్షిణాఫ్రికా వేదికగా మూడువారాలపాటు సాగే సమరంలో డిఫెండింగ్ చాంపియన్ గా, హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. జనవరి 17 నుంచి ఫిబ్రవరి 9 వరకూ జరిగే ఈ సమరంలో 16 దేశాలకు చెందిన జట్లు ఢీ కొనబోతున్నాయి. 2020 దశాబ్దంలో తొలి అండర్ -19 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీకి దక్షిణాఫ్రికాలో రంగం సిద్ధమయ్యింది. రెండుసంవత్సరాలకోసారి జరిగే […]

Advertisement
Update:2020-01-17 09:50 IST

ప్రపంచ క్రికెట్ కు చిరునామా భారత్ కొత్త దశాబ్దంలోని తొలి సంవత్సరంలోనే జూనియర్ ప్రపంచకప్ టైటిల్ కు గురిపెట్టింది. దక్షిణాఫ్రికా వేదికగా మూడువారాలపాటు సాగే సమరంలో డిఫెండింగ్ చాంపియన్ గా, హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.

జనవరి 17 నుంచి ఫిబ్రవరి 9 వరకూ జరిగే ఈ సమరంలో 16 దేశాలకు చెందిన జట్లు ఢీ కొనబోతున్నాయి.
2020 దశాబ్దంలో తొలి అండర్ -19 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీకి దక్షిణాఫ్రికాలో రంగం సిద్ధమయ్యింది. రెండుసంవత్సరాలకోసారి జరిగే ఈ టోర్నీలలో అత్యంత విజయవంతమైనజట్లలో ఒకటిగా పేరుపొందిన భారత్ టైటిల్ నిలుపుకోవాలన్న లక్ష్యంతో పటిష్టమైన జట్టుతో పోటీకి దిగుతోంది.

మొత్తం 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించి… గ్రూపులీగ్ కమ్ నాకౌట్ గా పోటీలు నిర్వహించబోతున్నారు.

రెండుదశాబ్దాలలో నాలుగు టైటిల్స్…

మహ్మద్ కైఫ్ నాయకత్వంలో 2000 సంవత్సరంలో ముగిసిన ప్రపంచకప్ ను తొలిసారిగా గెలుచుకొన్న భారత్ …ఆ తర్వాత మరో మూడు టైటిల్స్ సాధించింది.

బంగ్లాదేశ్ వేదికగా ముగిసిన 2004 ప్రపంచకప్ టోర్నీలో అంబటి రాయుడు నాయకత్వంలో బరిలోకి దిగిన భారతజట్టులో శిఖర్ ధావన్, సురేశ్ రైనా, దినేశ్ కార్తీక్, ఆర్పీ సింగ్, రాబిన్ ఊతప్ప మెరికల్లాంటి ఆటగాళ్లతో చెలరేగినా సెమీఫైనల్స్ ఓటమితో విఫలంకాక తప్పలేదు.

కొహ్లీ కెప్టెన్సీలో రెండోటైటిల్…

ఆ తర్వాత నాలుగేళ్లకు మలేసియా వేదికగా ముగిసిన 2008 ప్రపంచకప్ లో విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టు రెండోసారి ప్రపంచ టైటిల్ అందుకొంది.

విరాట్ కొహ్లీ మొత్తం 235 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

2012లో ఆస్ట్ర్రేలియా వేదికగా ముగిసిన ప్రపంచకప్ ను సైతం భారతజట్టు నిలుపుకొంది. ఉన్ముక్త్ చంద్ నాయకత్వంలోని భారతజట్టు మూడోసారి విశ్వవిజేత కాగలిగింది.

2018 ప్రపంచకప్ లో భారత్ విశ్వరూపం

2018లో న్యూజిలాండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్ లో బంగ్లాదేశ్ ను, సెమీఫైనల్లో పాకిస్తాన్ ను చిత్తు చేసిన భారత్… టైటిల్ సమరంలో ఆస్ట్ర్రేలియాను అధిగమించింది.

పవర్ ఫుల్ బ్యాటింగ్… పదునైన బౌలింగ్… చురుకైన ఫీల్డింగ్ తో… రాహుల్ ద్రావిడ్ కోచ్ గా, పృథ్వీ షా కెప్టెన్ గా భారతజట్టు నాలుగోసారి ప్రపంచ ట్రోఫీ అందుకొంది. మొత్తం ఆరుమ్యాచ్ ల్లో ప్రథ్వీషా 261 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

భారత్ విజయంలో ప్రధానపాత్ర వహించిన ఓపెనర్ మన్ జోత్ కాల్రాకు ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్స్, స్టార్ బ్యాట్స్ మన్ శుభ్ మాన్ గిల్ కు ప్లేయర్ ఆఫ్ ది చాంపియన్షిప్ అవార్డులు గెలుచుకొన్నారు.

మొత్తం ఐదుమ్యాచ్ ల్లో ఓ సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలతో సహా 372 పరుగులు సాధించిన శుభ్ మాన్ గిల్ కు ప్లేయర్ ఆఫ్ ది ప్రపంచకప్ అవార్డు దక్కింది. 2006, 2016 టోర్నీల్లో మాత్రం రన్నరప్ స్థానాలతో సరిపెట్టుకొన్న భారత్….మొత్తం మీద ఆరు ఫైనల్స్ ఆడి…నాలుగు విన్నర్స్, రెండు రన్నరప్ ట్రోఫీలు అందుకొన్న తొలిజట్టుగా రికార్డుల్లో చేరింది.

జూనియర్ స్థాయి నుంచే హేమాహేమీలు…

1988 ప్రారంభ ప్రపంచకప్ నుంచి 2018 వరకూ జరిగిన మొత్తం 12 టోర్నీల ద్వారా…జూనియర్ ప్రపంచకప్ వేదికగా యువరాజ్ సింగ్, శిఖర్ ధావన్‌, విరాట్ కొహ్లీ, రవీంద్ర జడేజా, అంబటి రాయుడు, కేన్ విలియమ్స్ సన్, వెయిన్ పార్నెల్, ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ, స్టీవ్ స్మిత్, జోస్ బట్లర్, మోజెస్ హెన్రికేస్, బెన్ స్టోక్స్, జో రూట్ లాంటి స్టార్ ప్లేయర్లు ప్రపంచక్రికెట్లోకి దూసుకువచ్చినవారే.

ప్రియం గార్గ్ నాయకత్వం…

2020 ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టుకు ప్రియం గార్గ్ నాయకత్వం వహించనున్నాడు. జట్టులోని ఇతర ఆటగాళ్లలో యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, దివ్యాంశు సక్సేనా,ధృవ్ చంద్ జూరెల్, షషావత్ రావత్, దివ్యాంశ్ జోషీ, శుభాంగ్ హెగ్డే, రవి బిష్నోయ్, ఆకాశ్ సింగ్, కార్తీక్ త్యాగీ, అధర్వ్ అన్ కోల్కర్, కుమార్ కుషాగ్రా, కుమార్ మిశ్రా, విద్యాధర్ పాటిల్ ఉన్నారు.

ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా దక్షిణాఫ్రికాతో ముగిసిన మూడుమ్యాచ్ ల సిరీస్ తో పాటు… నాలుగు దేశాల టోర్నీలో సైతం భారత్ విజేతగా నిలవడం ద్వారా…. టైటిల్ వేటకు దిగుతోంది. డిఫెండింగ్ చాంపియన్ భారత్ కు ఆస్ట్ర్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్ల నుంచి ప్రధానంగా పోటీ ఎదురుకానుంది.

Tags:    
Advertisement

Similar News