2019లో ఆ ఐదుగురు
మేరీ, మను, హంపి, సింధు, వినేశ్ సంచలనం భారత క్రీడారంగంలో మహిళలు సైతం అపూర్వ విజయాలతో తమ ఉనికిని చాటుకొంటూ వస్తున్నారు. వివిధ క్రీడల్లో పురుషులతో సమానంగా మహిళలు సైతం రాణిస్తూ తమ సత్తా చాటుకొన్నారు. 2019 సంవత్సరాన్ని బాక్సర్ మేరీ కోమ్, షూటర్ మను బాకర్, వస్తాదు వినేశ్ పోగట్, తెలుగుతేజాలు కోనేరు హంపి, పీవీ సింధు ప్రపంచ టైటిల్ విజయాలతో చిరస్మరణీయం చేసుకోగలిగారు. ముగ్గురు బిడ్డల తల్లిగా… భారత ఎవర్ గ్రీన్ బాక్సర్ మేరీకోమ్ తన సుదీర్ఘ […]
- మేరీ, మను, హంపి, సింధు, వినేశ్ సంచలనం
భారత క్రీడారంగంలో మహిళలు సైతం అపూర్వ విజయాలతో తమ ఉనికిని చాటుకొంటూ వస్తున్నారు. వివిధ క్రీడల్లో పురుషులతో సమానంగా మహిళలు సైతం రాణిస్తూ తమ సత్తా చాటుకొన్నారు.
2019 సంవత్సరాన్ని బాక్సర్ మేరీ కోమ్, షూటర్ మను బాకర్, వస్తాదు వినేశ్ పోగట్, తెలుగుతేజాలు కోనేరు హంపి, పీవీ సింధు ప్రపంచ టైటిల్ విజయాలతో చిరస్మరణీయం చేసుకోగలిగారు.
ముగ్గురు బిడ్డల తల్లిగా…
భారత ఎవర్ గ్రీన్ బాక్సర్ మేరీకోమ్ తన సుదీర్ఘ ప్రస్థానంలో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ప్రపంచ మహిళా బాక్సింగ్ చరిత్రలోనే ఎనిమిది పతకాలు సాధించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది.
ముగ్గురు బిడ్డల తల్లిగా ఈ ఘనత సాధించిన మేరీకోమ్ తన రికార్డులను తానే తిరగరాసింది. 2019 ప్రపంచ బాక్సింగ్ 51 కిలోల విభాగంలో మేరీకోమ్ కాంస్య పతకం సాధించడం ద్వారా తన ప్రపంచ కప్ పతకాల సంఖ్యను ఎనిమిదికి పెంచుకో గలిగింది. ఇందులో ఆరు బంగారు, ఒక్కో రజత, కాంస్య పతకాలు ఉండటం విశేషం.
అంతేకాదు…ఒలింపిక్స్ అర్హత కోసం నిర్వహించిన ట్రైల్స్ లో తెలంగాణా బాక్సర్ నిఖత్ జరీన్ ను చిత్తు చేయడం ద్వారా మేరీ కోమ్..టోక్యో ఒలింపిక్స్ బెర్త్ ఖాయం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది.
వినేశ్ పోగట్ కలనిజమాయెగా…
మహిళల కుస్తీలో ప్రపంచ పతకం సాధించాలని గత కొద్ది సంవత్సరాలుగా కలలుకన్న హర్యానా వస్తాదు వినేశ్ పోగట్ 2019 ప్రపంచ కుస్తీలో తన స్వప్నాన్ని సాకారం చేసుకోగలిగింది.
ప్రపంచ కుస్తీలో కాంస్య విజేతగా నిలవడం ద్వారా 2020 ఒలింపిక్స్ లోసైతం పాల్గొనటానికి అర్హత సంపాదించగలిగింది.
గోల్డెన్ షూటర్ మను బాకర్…
ప్రపంచకప్ లోని మొత్తం నాలుగు విభాగాలలోనూ బంగారు పతకాలు సాధించడం తో పాటు ప్రపంచ యువజన షూటింగ్ పోటీల 10మీటర్ల విభాగంలో సైతం బంగారు పంట పండించుకొంది.
సౌరవ్ వర్మతో కలసి టోక్యో ఒలింపిక్స్ 10మీటర్ల పిస్టల్ విభాగంలో పాల్గొనటానికి అర్హత సంపాదించింది. కేవలం 2019 సీజన్లోనే మను బాకర్ ఐదు ప్రపంచ బంగారు పతకాలు సాధించడం ఓ రికార్డుగా మిగిలిపోతుంది.
సింధు తొలి ప్రపంచ టైటిల్..
ప్రపంచ మహిళా బ్యాడ్మింటన్ సింగిల్స్ లో బంగారు పతకం సాధించిన భారత తొలిమహిళగా తెలుగుతేజం పీవీ సింధు చరిత్ర సృష్టించింది. 1980 ప్రపంచ బ్యాడ్మింటన్లో ప్రకాశ్ పడుకోనే విశ్వవిజేతగా నిలిస్తే…ఆ తర్వాత 39 సంవత్సరాల విరామం తర్వాత అదే ఘనతను సింధు సాధించగలిగింది. 2019లో విజయాల కంటే పరాజయాలే అధికంగా చవిచూసిన సింధు…తన కెరియర్ లో సాధించిన అతిపెద్ద విజయం ప్రపంచ టైటిల్ మాత్రమే.
32 ఏళ్ల వయసులో హంపి….
14 సంవత్సరాల వయసులో ప్రపంచ జూనియర్ చెస్ టైటిల్ సాధించిన తెలుగు మహిళా గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి.. 2019 సంవత్సరాన్ని మరో ప్రపంచ టైటిల్ తో ముగించగలిగింది.
మాస్కో వేదికగా ముగిసిన 2019 ప్రపంచ ర్యాపిడ్ మహిళల చెస్ సమరంలో చైనా గ్రాండ్ మాస్టర్ టియాంగ్ లీని అధిగమించడం ద్వారా హంపి విశ్వవిజేతగా నిలిచింది.
మొత్తం 12 రౌండ్లలో 9 పాయింట్లు సాధించడం ద్వారా గ్రాండ్ మాస్టర్ హంపి తన కెరియర్ లో రెండో ప్రపంచ టైటిల్ సొంతం చేసుకోగలిగింది.
సూపర్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ ర్యాపిడ్ టైటిల్ సాధించిన రెండో భారత చెస్ ప్లేయర్ హంపి మాత్రమే కావడం విశేషం.
32 సంవత్సరాల వయసులో ఓ బిడ్డకు తల్లిగా కోనేరు హంపి ప్రపంచ టైటిల్ సాధించడం 2019లో ఓ భారత మహిళా గ్రాండ్ మాస్టర్ సాధించిన అరుదైన విజయంగా నిలిచిపోతుంది.