తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ కు మేరీకోమ్ పంచ్

టోక్యో ఒలింపిక్స్ అర్హత పోటీలకు మేరీ కోమ్ టోక్యో వేదికగా వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్ మహిళల 51 కిలోల అర్హత పోటీల బరిలో దిగటానికి భారత బాక్సింగ్ క్వీన్, వెటరన్ మేరీకోమ్ అర్హత సంపాదించింది. తెలంగాణ యువబాక్సర్ నిఖత్ జరీన్ పై 9-1తో నెగ్గి తన సత్తా చాటుకొంది. హాటు హాటుగా ఫైట్… గతంలో 48 కిలోల విభాగంలో ఆరు ప్రపంచ టైటిల్స్ తో పాటు బంగారు పతకాలు సైతం సాధించిన మేరీ కోమ్…ఒలింపిక్స్ లో మాత్రం […]

Advertisement
Update:2019-12-29 02:23 IST
  • టోక్యో ఒలింపిక్స్ అర్హత పోటీలకు మేరీ కోమ్

టోక్యో వేదికగా వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్ మహిళల 51 కిలోల అర్హత పోటీల బరిలో దిగటానికి భారత బాక్సింగ్ క్వీన్, వెటరన్ మేరీకోమ్ అర్హత సంపాదించింది. తెలంగాణ యువబాక్సర్ నిఖత్ జరీన్ పై 9-1తో నెగ్గి తన సత్తా చాటుకొంది.

హాటు హాటుగా ఫైట్…

గతంలో 48 కిలోల విభాగంలో ఆరు ప్రపంచ టైటిల్స్ తో పాటు బంగారు పతకాలు సైతం సాధించిన మేరీ కోమ్…ఒలింపిక్స్ లో మాత్రం 51 కిలోల విభాగంలో పోటీకి దిగాలని నిర్ణయించింది. భారత బాక్సింగ్ సంఘం సైతం 51 కిలోల ఎంపిక పోటీల కోసం మేరీ కోమ్ ను నేరుగా ఎంపిక చేయడం వివాదానికి దారితీసింది.

నిఖత్ జరీన్ సవాల్…

మహిళల 51 కిలోల విభాగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొన్న తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ మాత్రం… ఒలింపిక్స్ ట్రైల్స్ కు మేరీకోమ్ ను నేరుగా ఎంపిక చేయటాన్ని తప్పుపట్టింది.48 కిలోల విభాగానికి మాత్రమే పరిమితం కావాల్సిన మేరీకోమ్ ను …సెలెక్షన్ ట్రైల్స్ నిర్వహించ కుండా 51 కిలోల విభాగానికి ఎలా ఎంపిక చేస్తారని నిలదీసింది.

మేరీ కోమ్ కు దమ్ముంటే…అర్హత పోటీలలో తనతో తలపడి నెగ్గిన తర్వాతే ఒలింపిక్స్ కు వెళ్లాలని డిమాండ్ చేసింది. మేరీ కోమ్ మాత్రం…అసలు నిఖత్ జరీన్ ఎవరంటూ ప్రశ్నించింది.

మేరీకోమ్- నిఖత్ జరీన్ వివాదం కేంద్ర క్రీడామంత్రికి మాత్రమే కాదు…భారత బాక్సింగ్ సమాఖ్యకు సైతం తలనొప్పిగా మారింది. దీంతో నిబంధనల ప్రకారం… మేరీ కోమ్, నిఖత్ జరీన్ ల మధ్య అర్హత పోటీ నిర్వహించక తప్పని పరిస్థితి ఏర్పడింది.

మేరీ కోమ్ అయిష్టంగానే….

ప్రపంచ బాక్సింగ్ పోటీలలో స్వర్ణ, రజత పతకాలు సాధించిన బాక్సర్లకు మాత్రమే నేరుగా ఒలింపిక్స్ ట్రైల్స్ లో పాల్గొనే వెసలుబాటు ఉంటుంది. మేరీ కోమ్ మాత్రం.. ప్రపంచ బాక్సింగ్ పోటీలలో కాంస్య పతకం మాత్రమే నెగ్గడంతో…సెలెక్షన్ ట్రైల్స్ లో పాల్గొనక తప్పని పరిస్థితి ఏర్పడింది.

చైనాలోని వూహాన్ వేదికగా ఫిబ్రవరి 3 నుంచి జరిగే ఒలింపిక్స్ అర్హత పోటీలకు ముందే…మేరీకోమ్- నిఖత్ జరీన్ ఫైట్ ను నిర్వహించాలని భారత బాక్సింగ్ సమాఖ్య నిర్ణయించింది. అందులో భాగంగానే జరిగిన సెలెక్షన్ టోర్నీలో ఇటు నిఖత్, అటు మేరీ కోమ్ తమతమ ప్రత్యర్థులను చిత్తు చేసి ఫైనల్స్ కు చేరుకొన్నారు.

తుదిసమరం లో మాత్రం అపారఅనుభవం ఉన్న మేరీకోమ్ కు నిఖత్ జరీన్ ఏమాత్రం సరిజోడీ కాలేకపోయింది.

క్రీడాస్ఫూర్తి లేని మేరీ కోమ్…

ఉద్రిక్త వాతావరణం నడుమ జరిగిన ఫైనల్ పోరులో ఇద్దరు బాక్సర్లు పరస్పరం ఒకరినొకరు తిట్టుకొంటూ, రెచ్చగొట్టుకొంటూ పోటీకి దిగారు. చివరకు మేరీ అలవోకగా నెగ్గి తానేమిటో నిరూపించుకొంది. తనను ఆలింగనం చేసుకోడానికి ప్రయత్నించిన నిఖత్ జరీన్ ను పక్కకు నెట్టడం ద్వారా మేరీ కోమ్ దురుసుగా ప్రవర్తించింది.

మొత్తం మీద ఎనిమిదిసార్లు ప్రపంచ పతకాల విజేతగా ఉన్న తనను నిఖత్ జరీన్ సవాలు చేయటాన్ని మేరీకోమ్ ఏమాత్రం భరించలేకపోయిందన్నది ముమ్మాటికీ వాస్తవం అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

Tags:    
Advertisement

Similar News