ఏదో ఒకటి చేయాలి... లేదంటే కేడర్ నిలబడదు...
తెలుగుదేశం పార్టీ అనుకున్నది ఒకటి అయితే జరుగుతోంది మరోకటి. రాష్ర్టంలో గడచిన ఆరునెలల్లో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి చేపడుతోన్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల అంశాలపై టీడీపీ సుదీర్ఘంగానే సమీక్షించింది. జగన్ పాలనపై ఆరునెలల వరకూ ఎలాంటి అంశాల్లోనూ స్పందించకుండా ఉండాలని ముందుగా టీడీపీ భావించింది. కానీ జగన్ వేగం చూసి, ఆరునెలల వరకూ ఆగితే అందనంత దూరం వెళతారనే నిశ్చయానికి వచ్చిన టీడీపీ ఎదురు దాడి చేపట్టింది. దీనికి ముందుగా ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. జగన్ పాలనపై […]
తెలుగుదేశం పార్టీ అనుకున్నది ఒకటి అయితే జరుగుతోంది మరోకటి. రాష్ర్టంలో గడచిన ఆరునెలల్లో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి చేపడుతోన్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల అంశాలపై టీడీపీ సుదీర్ఘంగానే సమీక్షించింది.
జగన్ పాలనపై ఆరునెలల వరకూ ఎలాంటి అంశాల్లోనూ స్పందించకుండా ఉండాలని ముందుగా టీడీపీ భావించింది. కానీ జగన్ వేగం చూసి, ఆరునెలల వరకూ ఆగితే అందనంత దూరం వెళతారనే నిశ్చయానికి వచ్చిన టీడీపీ ఎదురు దాడి చేపట్టింది. దీనికి ముందుగా ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. జగన్ పాలనపై అన్ని వర్గాల ప్రజల నుంచి సానుకూలమైన స్పందన రావడంతో, ముఖ్యంగా టీడీపీ వర్గాలు సైతం జగన్ పాలనపై సానుకూలంగా ఉండటంతో అధినేత తట్టుకోలేకపోతున్నారు.
దీంతో వైసిపి పై యుధ్దం ప్రకటించారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు యుద్దం చేయడం, అధికార పక్షానికి ఎదురు నిలవడం సమంజసమైన చర్యే. కానీ సమయమే అనుకూలించడం లేదు. ఇసుక పై టీడీపీ ధీక్ష చేపట్టింది. ధీక్ష చేసే సమయానికే ఇసుక సమస్య సర్దుబాటు అయింది. అందుకే చంద్రబాబు చేపట్టిన దీక్షకు అనుకున్నంత స్పందన రాలేదు.
రాజధాని ప్రాంతంలో చంద్రబాబు చేపట్టిన యాత్ర కూడా అనుకున్న స్థాయిలో మైలేజీని సంపాదించలేకపోయింది. చంద్రబాబు చేపట్టిన యాత్ర కంటే, అక్కడ చోటు చేసుకున్న సంఘటనలే మీడియాలో ఎక్కువ హైలైట్ అయ్యాయి.
వాస్తవంగా గడచిన ఆరునెలల కాలంలో వైసిపి ప్రభుత్వం రాజధాని లో ఒక్క పని కూడా చేయలేదని నిరూపించడమే టీడీపీ ధ్యేయం… దీన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్ళేలా కార్యాచరణ రూపొందించారు. ఈ విషయంలో వైసిపి ఎలాంటి ముందస్తు వ్యూహం లేకుండా వ్యవహరించింది. చంద్రబాబు కు రాజధానిలో పర్యటించే అధికారం నూరుశాతం ఉంది. అక్కడ జరిగే ప్రతి పనినీ స్వయంగా చూసే హక్కు కూడా ఉంది. కానీ దీన్ని రాజకీయ కోణంలో నుంచి చూసే సరికి గురి తప్పినట్లయింది.
రాజధానిలో జరిగిన పనులు, నిలిచి పోయిన విధానంపై టీడీపీ డిసెంబరు 5వ తేదీన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తోంది. విజయవాడలో నిర్వహించే ఈ కార్యక్రమానికి వైసిపి మినహా అన్ని పార్టీలనూ ఆహ్వానిస్తుంది. దీనిలో రాజధాని భవితవ్యం, ఇప్పటి వరకూ జరిగిన పనులు, వైసిపి నిర్లక్ష్యం చేసిన విధానంపై సుదీర్ఘంగా చర్చిస్తారు. భవిష్యత్ కార్యాచరణ రూపొందించి ప్రభుత్వంపై వత్తిడి తీసుకొచ్చి, రాజధాని పనులు చేపట్టేలా చూడటమే ఈరౌండ్ టేబుల్ లక్ష్యంగా చెబుతున్నారు.
అయితే దీనికి ముందుగా వారం క్రితమే రాజధానిలో పనులపై సిఆర్ డి ఎ సమీక్షలో ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పనులు కొనసాగించమని చెప్పారు. ఎలాగూ పనులు జరుగుతాయి కాబట్టి, ఈలోగానే రౌండ్ టేబుల్ నిర్వహిస్తే తాము చేసిన కృషివల్లనే రాజధానిలో పనులు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చన్నది టీడీపీ వ్యూహం. ప్రతిపక్షంగా టీడీపీ మాత్రం అందివచ్చిన అవకాశాన్ని మాత్రం పూర్తిస్థాయిలో వినియోగించుకుంటోంది. కానీ ప్రజల నుంచే సరైన స్పందన రావడం లేదు.