లోకేష్ నాయకత్వంలో మునిగే టీడీపీని ధర్మాడి సత్యం కూడా బయటకు తీయలేడు

2029నాటికి తెలుగుదేశం పార్టీ ఉండదన్నారు. చంద్రబాబు కూడా గెలిచే పరిస్థితి లేదన్నారు. పవన్‌ కల్యాణ్ ఎప్పుడు ఎక్కడ ఉంటారో… ఎలా స్పందిస్తారో చెప్పలేమని… ఆయన వైరాగ్యం చెంది హిమాలయాలకు వెళ్లిపోవచ్చన్నారు. లేదంటే ఉన్నట్టు ఉండి ఒక రోజు వచ్చి ఆవేశపడి మాట్లాడవచ్చు… ఏమైనా జరగవచ్చు అన్నారు. సుజనాచౌదరితో మినహా టీడీపీలో ఉన్నప్పుడు ఎవరితోనూ తనకు ఎమోషనల్‌ కనెక్టివిటీ లేదన్నారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. చంద్రబాబుతో ఎలాంటి మానసిక సంబంధం లేదన్నారు. హెలికాప్టర్‌ ఎక్కే ముందో, దిగే ముందో […]

Advertisement
Update:2019-11-15 04:44 IST

2029నాటికి తెలుగుదేశం పార్టీ ఉండదన్నారు. చంద్రబాబు కూడా గెలిచే పరిస్థితి లేదన్నారు. పవన్‌ కల్యాణ్ ఎప్పుడు ఎక్కడ ఉంటారో… ఎలా స్పందిస్తారో చెప్పలేమని… ఆయన వైరాగ్యం చెంది హిమాలయాలకు వెళ్లిపోవచ్చన్నారు. లేదంటే ఉన్నట్టు ఉండి ఒక రోజు వచ్చి ఆవేశపడి మాట్లాడవచ్చు… ఏమైనా జరగవచ్చు అన్నారు.

సుజనాచౌదరితో మినహా టీడీపీలో ఉన్నప్పుడు ఎవరితోనూ తనకు ఎమోషనల్‌ కనెక్టివిటీ లేదన్నారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.

చంద్రబాబుతో ఎలాంటి మానసిక సంబంధం లేదన్నారు. హెలికాప్టర్‌ ఎక్కే ముందో, దిగే ముందో బ్లాక్‌ కాట్‌ సెక్యూరిటీ చేత మోచేతి పోట్లు పొడిపించుకుని… ఆ తర్వాత వినతిపత్రం మాత్రమే ఇచ్చే అవకాశం మాత్రమే చంద్రబాబు వద్ద ఉండేదన్నారు.

ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు నాయకత్వంలోకి టీడీపీ వచ్చిన తర్వాత ఓటు బ్యాంకు తగ్గుతూ వచ్చిందన్నారు. మొన్నటి ఎన్నికల్లో గ్రామాల్లో ఉన్న టీడీపీ సాంప్రదాయ ఓటు బ్యాంకు కూడా బ్రేక్‌ అయిపోయిందన్నారు. బీజేపీతోనూ, జనసేనతోనూ పొత్తుపెట్టుకుని మరో ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయవచ్చు ఏమో గానీ… 2029నాటికి టీడీపీ ఉండదన్నారు.

ఓటుకు నోటు కేసుకు భయపడి పారిపోయి వచ్చిన వారే… తాను కేసులకు భయపడి వైసీపీ వైపు వెళ్లినట్టు ప్రచారం చేస్తున్నారని వంశీ ఎద్దేవా చేశారు. ఈ ప్రచారం చేయిస్తున్నది దేవినేని ఉమానే అని, అతడో ఇన్‌సెక్యూర్‌ ఫెలో అని విమర్శించారు. దేవినేని ఉమాను మించిన వేస్ట్‌ ఫెలో మరొకరు లేరని.. కానీ చంద్రబాబుకు అతడే ఇష్టమన్నారు.

వర్థంతికి, జయంతికి తేడా తెలియని వ్యక్తుల నాయకత్వంలో టీడీపీ ఉండదని… అది మునిగిపోతుందని.. అప్పుడు టీడీపీ పడవను ధర్మాడి సత్యం కూడా బయటకు తీయలేరన్నారు. ప్రజలతో ఎమోషనల్‌ కనెక్టివిటీ ఉండబట్టే జగన్‌ మోహన్ రెడ్డి, కేసీఆర్ ఎన్నికల్లో గెలవగలిగారని… ప్రజలతో అలాంటి సంబంధం లేకపోవడం వల్లే టీడీపీ, సినిమావారు పెట్టిన పార్టీలు ఓడిపోయాయన్నారు.

టీడీపీ ఆఫీస్ కేంద్రంగా అరడజను వెబ్‌సైట్లను పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. వ్యక్తిత్వ హననం చేయడం ద్వారా పార్టీ మారే వారిని అడ్డుకోవాలనుకుంటున్నారని… కానీ అది సాధ్యం కాదన్నారు. రాష్ట్రంలో ఒక ప్రముఖ కుటుంబానికి చెందిన మహిళకు జూబ్లిహిల్స్‌లోని ఒకే ఇంటి నుంచి 10వేల మెయిల్స్ పెట్టారన్నారు. ఆ తర్వాత వెళ్లి తప్పు చేశామంటూ కాళ్లు పట్టుకున్నారని వంశీ వివరించారు. మనుషుల వ్యక్తిత్వాన్ని నాశనం చేయడంలో టీడీపీ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అన్నదానికి ఇది ఉదాహరణ అని వంశీ వివరించారు.

వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చాలా మంది తెలుగు దేశం పార్టీ వారు స్థానికంగా ఇబ్బందులు పడుతుంటే ఆ సమయంలో వారిని ఆయన వద్దకు తీసుకెళ్లి పని చేయించానన్నారు. తన ఇంట్లో పాతిక కులాల వారు ఉన్నారన్నారు. తన అక్కను వరంగల్‌కు చెందిన రెడ్డి కులస్తుడితో వివాహం చేశామన్నారు.

2009 ఎన్నికల సమయంలో ఒప్పించి జూనియర్ ఎన్టీఆర్‌ను ప్రచారానికి తీసుకొస్తే… ఎన్నికల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో టీడీపీ ఓడిపోయిందంటూ ఈనాడు పత్రికలో పెద్ద కథనం రాయించారన్నారు. అదంతా ఆర్గనైజ్డ్‌గానే రాయించి… జూనియర్ ఎన్టీఆర్‌ను పక్కన పెట్టారన్నారు.

2014 ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్ ఇంటికి వెళ్లిన చంద్రబాబు.. మరి ఎన్టీఆర్‌ను ఎందుకు తీసుకురాలేదన్నారు.

జూనియర్ ఎన్టీఆర్‌ వస్తే నారా లోకేష్‌కు ఇబ్బంది వస్తుందన్న ఉద్దేశంతో పద్దతి ప్రకారం జూనియర్ ఎన్టీఆర్‌ను దెబ్బతీశారన్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ వస్తే నారా లోకేష్‌ తట్టుకోలేడని… కార్యకర్తలు కూడా లోకేష్ వద్ద కాకుండా జూనియర్ ఎన్టీఆర్ వైపు వెళ్తారని అందుకే ఆయన్ను కావాలని దూరం పెట్టారన్నారు. టీడీపీకి వ్యతిరేకంగా జూనియర్ ఎన్టీఆర్‌ పొలిటికల్ లైన్ తీసుకుంటున్నారన్న ప్రచారం కేవలం జూనియర్ ఎన్టీఆర్‌ను దెబ్బతీసే వారు చేస్తున్న ప్రచారమేనన్నారు.

రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలు ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. వైసీపీ ఇన్‌చార్జ్ యార్లగడ్డ వెంకట్రావ్‌తో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, విభేదాలు లేవని… కలిసి పనిచేస్తామన్నారు. వైఎస్‌ జగన్‌తో పాతికేళ్ల నుంచి సంబంధాలున్నాయన్నారు. జగన్‌పై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు.

జనంలో పనిచేయకుండా పార్టీ ఆఫీస్ నుంచి సోషల్ మీడియాను నడిపించడం, పెయిడ్ ఎంప్లాయిస్‌ను పెట్టుకుని స్టోరీలు రాయించుకోవడం, వారితో ప్రత్యర్థులపై బురదజల్లడం వంటివి చేయడం వల్లే తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఈ దుస్థితికి వచ్చిందన్నారు. టీడీపీ ప్రస్తుతం ఉప ప్రాంతీయ పార్టీ అయిపోయిందని… వాస్తవం ఇలా ఉంటే కర్నాటక టీడీపీ, తమిళనాడు టీడీపీ అంటూ ప్రచారం చేసుకుంటున్నారన్నారు.

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు ఎవరితోనూ మాట్లాడలేదని… ఇప్పుడు ఓడిపోయిన తర్వాత పిలిచి భోజనాలు పెడుతున్నారన్నారు. లోకేష్ హెరిటేజ్‌ చూసుకుంటూ పాలుపెరుగు అమ్ముకోవడానికి పరిమితమైతే పార్టీకి మంచిదని… చంద్రబాబు ఉన్నంత వరకు కొద్దిమేర మేనేజ్ చేస్తారు కానీ… ఎన్నికల్లో గెలవడానికి అది సరిపోదన్నారు. 2024లో ఎన్నికల్లో టీడీపీ పోటీచేస్తుందని… కానీ గెలవదని… ఇక 2029నాటికి టీడీపీ ఉండదన్నారు.

వారసత్వ రాజకీయాలు తప్పుకాదని… కానీ వారసత్వాన్ని రుద్దడం తప్పన్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి వంశీకి ఇబ్బంది ఉందంటూ ఎన్నికల సమయంలో ప్రచారం చేసింది కూడా టీడీపీ వెబ్‌సైట్లేనన్నారు. తాను ఏ రోజూ ఆ విషయం చెప్పలేదన్నారు. తమ రక్తం పచ్చగా ఉంటుందని చెప్పుకుంటూ తిరుగుతున్న వారే పిచ్చికుక్కల్లా లేనిపోని విమర్శలు చేస్తున్నారన్నారు. చంద్రయాన్‌ విఫలమవడానికి కూడా వల్లభనేని వంశీనే అని నమ్మించేంతగా టీడీపీ ప్రచారం ఉంటుందన్నారు.

Tags:    
Advertisement

Similar News