పట్నం బ్రదర్స్ సైలెంట్.... రేవంత్ అడ్డాలో ఏం జరుగుతోంది?
పట్నం బ్రదర్స్ సైలెంట్ అయిపోయారు. కనీసం రంగారెడ్డి రాజకీయ తెరపై కూడా కనిపించడం లేదు. మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన తమ్ముడు కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి టీఆర్ఎస్‌లో యాక్టివ్‌గా తిరగడం లేదు. దీంతో ఈ బ్రదర్స్‌కు ఏమైంది అంటూ పలువురు నేతలు ఆరా తీయడం కనిపిస్తోంది. తాండూరులో మహేందర్‌రెడ్డి ఓడిపోయారు. అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి గెలిచారు. ఆ తర్వాత రోహిత్ టీఆర్ఎస్‌లో చేరిపోయారు. దీంతో ఇక్కడ టీఆర్ఎస్‌లో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. […]
పట్నం బ్రదర్స్ సైలెంట్ అయిపోయారు. కనీసం రంగారెడ్డి రాజకీయ తెరపై కూడా కనిపించడం లేదు. మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన తమ్ముడు కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి టీఆర్ఎస్‌లో యాక్టివ్‌గా తిరగడం లేదు. దీంతో ఈ బ్రదర్స్‌కు ఏమైంది అంటూ పలువురు నేతలు ఆరా తీయడం కనిపిస్తోంది.
తాండూరులో మహేందర్‌రెడ్డి ఓడిపోయారు. అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి గెలిచారు. ఆ తర్వాత రోహిత్ టీఆర్ఎస్‌లో చేరిపోయారు. దీంతో ఇక్కడ టీఆర్ఎస్‌లో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఎమ్మెల్యే రోహిత్‌దే పూర్తి ఆధిపత్యం అయింది. ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో ఎమ్మెల్సీ అవకాశం వస్తుందని మహేందర్ రెడ్డి ఆశపడ్డారు. కానీ ఆ ఆశ నెరవేరే సూచనలు కన్పించడం లేదు.
మరోవైపు తమ ప్రత్యర్థి సబితా ఇంద్రారెడ్డి కూడా టీఆర్ఎస్‌లోకి వచ్చారు. ఏకంగా మంత్రి అయ్యారు. దీంతో ఇన్నాళ్లు జిల్లా టీఆర్ఎస్‌లో పట్నం బ్రదర్స్‌దే ఆధిపత్యం ఉండేది. సబితా రాకతో ఆ ఆధిపత్యానికి కూడా గండిపడింది. అటు నియోజకవర్గంలో పోరు…ఇటు జిల్లాలో మరొక పోరుతో పట్నం సోదరులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట.
కొడంగల్‌లో కూడా పట్నం నరేందర్‌రెడ్డికి సెగ తగులుతుందట. ఎమ్మెల్యేగా గెలవడానికి డబ్బు బాగా ఖర్చు చేయాల్సి వచ్చిందట. ఇప్పుడు కార్యకర్తలను ఆయన పట్టించుకోవడం లేదట. అభివృద్ధి పనులు లేవు. హామీ ఇచ్చిన పనులు జరగడం లేదు. ఇటు టీఆర్ఎస్ పెద్దలు పట్టించుకోవడం లేదు. దీంతో పట్నం నరేందర్‌రెడ్డి కూడా కొడంగల్ వైపు వెళ్లడం లేదని తెలుస్తోంది.
మొత్తానికి గత ఐదేళ్లలో రంగారెడ్డిలో చక్రం తిప్పిన గులాబీ బ్రదర్స్‌కు ఇప్పుడు కష్టకాలమొచ్చింది. ఇంటా బయటా ఆధిపత్యపోరుతో సతమతమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారు రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.