సౌరవ్ గంగూలీకి రవి శాస్త్రి కితాబు
తొలిసారిగా దాదాపై పెదవి విప్పిన శాస్త్రి సౌరవ్ గంగూలీ, రవి శాస్త్రి…ఇద్దరూ భారత క్రికెట్ కు కెప్టెన్లుగా నాయకత్వం వహించినవారే. అయితే…2016 తర్వాత నుంచి ఈ ఇద్దరి మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనేంత దూరం. తెలిసీ తెలియని వైరం. ఇద్దరూ ఎదురుపడినా ఎడమొకం, పెడమొకం. గత మూడేళ్లుగా భారత చీఫ్ కోచ్ గా రవిశాస్త్రి సేవలు అందిస్తుంటే…కొద్దిరోజుల క్రితమే సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు. ఒక్క మాటలో చెప్పాలంటే బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ బాధ్యతలు చేపట్టడంతో […]
- తొలిసారిగా దాదాపై పెదవి విప్పిన శాస్త్రి
సౌరవ్ గంగూలీ, రవి శాస్త్రి…ఇద్దరూ భారత క్రికెట్ కు కెప్టెన్లుగా నాయకత్వం వహించినవారే. అయితే…2016 తర్వాత నుంచి ఈ ఇద్దరి మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనేంత దూరం. తెలిసీ తెలియని వైరం. ఇద్దరూ ఎదురుపడినా ఎడమొకం, పెడమొకం.
గత మూడేళ్లుగా భారత చీఫ్ కోచ్ గా రవిశాస్త్రి సేవలు అందిస్తుంటే…కొద్దిరోజుల క్రితమే సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు.
ఒక్క మాటలో చెప్పాలంటే బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ బాధ్యతలు చేపట్టడంతో రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కొహ్లీల గొంతులో పచ్చివెలక్కాయి పడినట్లేనని అందరూ అనుకొన్నారు.
అంతేకాదు..బోర్డు అధ్యక్షుడుగా సౌరవ్ బాధ్యతలు చేపట్టిన మూడురోజుల వరకూ భారతజట్టు ప్రధాన శిక్షకుడిగా ఉన్న రవి శాస్త్రి అభినందనలు తెలపకుండా తటపటాయించడంతో క్రికెట్ వర్గాలు, అభిమానులు రకరకాల ఊహాగానాలలో మునిగి తేలారు.
అయితే…ఎట్టకేలకు రవిశాస్త్రి…సౌరవ్ గంగూలీని అభినందిస్తూ ఓ ప్రకటన విడుదల చేశాడు. సౌరవ్ గంగూలీ బోర్డు అధ్యక్షుడు కావడం…భారత క్రికెటర్లకు లభించిన గౌరవంగా అభివర్ణించాడు.
బెంగాల్ క్రికెట్ సంఘం కార్యదర్శిగా, అధ్యక్షుడుగా, సంయుక్త కార్యదర్శిగా గత నాలుగేళ్లుగా పనిచేస్తున్న సౌరవ్ గంగూలీ అనుభవం…బోర్డు అధ్యక్షుడిగా రాణించడానికి ఉపయోగపడుతుందని…గంగూలీ సహజనాయకుడని…రవిశాస్త్రి ప్రశంసించాడు.
సౌరవ్ నేతృత్వంలో భారత క్రికెట్ బోర్డు ప్రతిష్ట ఇనుమడించాలని తాను కోరుకొంటున్నట్లు చెప్పాడు.
ఇద్దరి మధ్య ఎందుకు వైరం….
2016లో భారత క్రికెట్ చీఫ్ కోచ్ పదవి కోసం అనీల్ కుంబ్లే, రవిశాస్త్రి పోటీపడిన సమయంలో…చీఫ్ కోచ్ ను ఎంపిక చేసే క్రికెట్ సలహామండలిలో సచిన్, లక్ష్మణ్ లతో పాటు..సౌరవ్ గంగూలీ సైతం సభ్యుడిగా ఉన్నాడు.
రవిశాస్త్రి ఇంటర్వ్యూ సమయంలో గంగూలీ మాత్రం బెంగాల్ క్రికెట్ సంఘం సమావేశానికి తాను అధ్యక్షత వహించాల్సి ఉందంటూ లేచి వెళ్లిపోడంతో.. ఇద్దరి మధ్యన దూరం పెరిగింది. అంతేకాదు..రవి శాస్త్రిని కాదని అనీల్ కుంబ్లేను కోచ్ గా చేయటానికి సౌరవ్ తెరవెనుక నుంచి నాటకం నడిపించాడంటూ.. అప్పట్లో రవిశాస్త్రి మండిపడ్డాడు.
ఇంటర్వ్యూ బోర్డులో సభ్యుడిగా ఉన్న సౌరవ్ గంగూలీపై రవిశాస్త్రి ఘాటైన విమర్శలతో విరుచుకుపడ్డాడు. తాను చేసే పనికి విలువ ఇవ్వటం గంగూలీకి తెలియదని.. పైగా తన ఎదుట ఇంటర్వ్యూకు హాజరైన వ్యక్తిని గౌరవించడం అసలే తెలియదంటూ మండిపడ్డాడు. దీనిపై గంగూలీ సైతం తీవ్రస్థాయిలోనే ప్రతిస్పందించాడు.
నాటినుంచే ఇద్దరి మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గున మండే పరిస్థితి కొనసాగుతూ వచ్చింది.
ఇప్పటికైనా ఈ ఇద్దరు దిగ్గజాలు మనస్పర్థలు వీడి…భారత క్రికెట్ బాగుకోసం తమవంతుగా పాటుపడటం ద్వారా క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా.. పెద్దమనుషుల క్రీడకు వన్నెతేవాలని కోరుకొందాం.