పైస్థాయిలో అవినీతి తగ్గింది అంటూనే చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలని జగన్‌కు ఉండవల్లి హెచ్చరిక

నవరత్నాల అమలు మొదలైన తర్వాతే ప్రభుత్వంపై కామెంట్ చేయాల్సి ఉంటుందన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్. రివర్స్ టెండరింగ్‌లో ఇన్ని కోట్లు మిగులుతాయని తాను కూడా ఊహించలేదన్నారు. మేఘా లాంటి పెద్ద సంస్థలు పోలవరం కట్టేందుకు ముందుకొచ్చాయంటే ఆషామాషీగా తీసుకోలేమన్నారు. చిన్నచిన్న కంపెనీలు అయితే ఏవో ఉద్దేశాలతో తక్కువ ధరకు టెండర్ వేస్తాయని కానీ మేఘా లాంటి పెద్ద కంపెనీ ముందుకు రావడాన్ని తక్కువ అంచనా వేయలేమన్నారు. విద్యుత్‌ బస్సులకు, పోలవరం కాంట్రాక్టుకు చంద్రబాబు లింక్ […]

Advertisement
Update:2019-10-01 11:08 IST

నవరత్నాల అమలు మొదలైన తర్వాతే ప్రభుత్వంపై కామెంట్ చేయాల్సి ఉంటుందన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్. రివర్స్ టెండరింగ్‌లో ఇన్ని కోట్లు మిగులుతాయని తాను కూడా ఊహించలేదన్నారు.

మేఘా లాంటి పెద్ద సంస్థలు పోలవరం కట్టేందుకు ముందుకొచ్చాయంటే ఆషామాషీగా తీసుకోలేమన్నారు. చిన్నచిన్న కంపెనీలు అయితే ఏవో ఉద్దేశాలతో తక్కువ ధరకు టెండర్ వేస్తాయని కానీ మేఘా లాంటి పెద్ద కంపెనీ ముందుకు రావడాన్ని తక్కువ అంచనా వేయలేమన్నారు. విద్యుత్‌ బస్సులకు, పోలవరం కాంట్రాక్టుకు చంద్రబాబు లింక్ పెడుతున్నారని…కానీ చంద్రబాబు వ్యాఖ్యలను తాను విశ్వసించడం లేదన్నారు.

ప్రస్తుత ప్రభుత్వం నిజాయితీగా నడుస్తున్నట్టుగా ఉందన్నారు. పైస్థాయిలో అవినీతి చాలా వరకు కంట్రోల్ అయిందన్నారు. కిందిస్థాయిలో అవినీతి కొనసాగుతోందన్నారు. తానొక్కడే మంచిగా ఉంటే అందరూ మంచిగా ఉంటారు అని జగన్‌ అనుకోకూడదని… అలా నిజాయితీగా ఉండాల్సిన తప్పనిసరి పరిస్థితిని వ్యవస్థలో ముఖ్యమంత్రి తీసుకురావాల్సి ఉంటుందన్నారు.

ఒక ఎంపీ, ఒక మంత్రి పనులు చేస్తామని డబ్బులు తీసుకుంటే వాటిని తిరిగి ముఖ్యమంత్రి వెనక్కు ఇప్పించిన ఉదంతాలు కూడా తన దృష్టికి వచ్చాయని ఉండవల్లి చెప్పారు. అయితే మొత్తం నిజాయితీగా వ్యవస్థ పనిచేయాలంటే అందుకు అవసరమైన పరిస్థితులను తీసుకురావాల్సి ఉంటుందన్నారు.

ఈ వంద రోజుల్లో విద్యుత్ విషయంలో మాత్రం ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందని ఉండవల్లి చెప్పారు. విద్యుత్ కొరతకు కారణం ఎవరైనా సరే ప్రజలకు అవన్నీ పట్టవని… కరెంట్ సరిగా ఇస్తున్నారా లేదా అన్నదే వారు చూస్తారని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. ఒకటి రెండు రోజుల్లోనే విద్యుత్ సమస్య పరిష్కారం అవుతుందని అధికారులు చెప్పారని ఏం జరుగుతుందో చూడాలన్నారు.

50 శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇది చూసి శాశ్వతం అని జగన్‌ అనుకోవద్దని సలహా ఇచ్చారు. 1972లో ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ 51 శాతం పైగా ఓట్లతో అధికారంలోకి వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి అయిన పీవీ నర్సింహరావుని… తిరిగి 9 నెలల్లోనే దింపేశారని గుర్తు చేశారు. 1994లో కమ్యూనిస్టులు, టీడీపీ కలిసి ఎన్నికలకు వెళ్తే 54 శాతం ఓట్లు వచ్చాయన్నారు. 34 సీట్లు కమ్యూనిస్టులకు, టీడీపీకి 213 సీట్లు వచ్చాయన్నారు. కానీ తొమ్మిది నెలలకు ఎన్టీఆర్‌ను దించేసి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు.

ఇప్పుడు జగన్‌ కూడా ఈ మెజారిటీని చూసి శాశ్వతం అనుకోవద్దన్నారు. ప్రజలతో పాటు గెలిచిన ఎమ్మెల్యేలను కూడా సంతృప్తి పరచాల్సి ఉంటుందని… ముఖ్యమంత్రి తమకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఎమ్మెల్యేలు ఫీల్ కావాల్సి ఉంటుందన్నారు. ఆ పరిస్థితి లేకుంటే సొంత ఎమ్మెల్యేలే తిరగబడతారన్నారు. ఎన్టీఆర్‌ను దించినప్పుడు ప్రజల్లో ఆయనపై వ్యతిరేకత ఏమీ లేదని… కానీ ఎమ్మెల్యేల్లో ఉన్న వ్యతిరేకత కారణంగా పదవి పోగొట్టుకున్నారని ఉండవల్లి విశ్లేషించారు. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకుంటేనే నిజమైన నాయకుడు అవుతారని… జగన్‌ కు కూడా అది వర్తిస్తుందన్నారు.

ఎన్నికల్లో జగన్‌ ఒంటరిగా పోరాడి గెలిచాడని…. కానీ దాన్ని నిలుపుకునేందుకు చరిత్రలోనే అనుభవాలను పరిశీలన చేయాలన్నారు. భారీ సినిమాలో చిన్న తేడా ఉన్నా భారీ నష్టం ఉంటుందని… ఇప్పుడు జగన్‌ పరిస్థితి కూడా అలాగే ఉందన్నారు. చిన్న తేడా వచ్చినా దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నారు. జగన్ ప్రభుత్వం మీద సీరియస్‌గా ఆరోపణలు చేసేందుకు ఇప్పటికి అవకాశమే లేదన్నారు.

అవినీతి లేకుండా నిజాయితీగా పాలన చేస్తున్నారన్నది ప్లస్‌ అయితే… విద్యుత్, ఇసుక సమస్యలు మాత్రం మైనస్‌గా ఉన్నాయన్నారు.

ప్రస్తుతం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసేంత నెగిటివ్‌ గానీ… అదే సమయంలో ఆహోఓహో అనేంత పాజిటివ్‌గా ఏమీ లేదన్నారు. జగన్‌ కొత్తగా వచ్చారు కాబట్టి కొద్దికాలం వేచి చూడాల్సి ఉంటుందన్నారు. గోదావరిలో మునిగిన బోటును వరద తగ్గితే గానీ తీయలేరని అక్కడి గ్రామస్తులు చెబుతున్నారని ఉండవల్లి చెప్పారు.

Tags:    
Advertisement

Similar News