పత్రిక చదవడం మానేస్తే సమస్య తీరిపోతుందా?
టీడీపీ పత్రికలు రోజూ ఇష్టానుసారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నవి లేనివి రాస్తుంటే వైసీపీ నాయకులు గానీ, ప్రభుత్వ పెద్దలుగానీ ఎందుకు పట్టించుకోరు అంటూ వైసీపీ అభిమానులు బాగా ఆవేదన చెందుతుంటారు. కానీ వారు ఎందుకు స్పందించరు అన్న దానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిన్న క్లూ ఇచ్చారు. ఇటీవల జగన్ ప్రభుత్వంపై భారీగా వ్యతిరేక కథనాలను ప్రచురిస్తున్న ఒక టీడీపీ అనుకూల పత్రిక పట్ల ప్రభుత్వం నుంచి ఎలాంటి రియాక్షన్ కనిపించలేదు. ఆ కథనాల వల్ల ప్రజల్లో […]
టీడీపీ పత్రికలు రోజూ ఇష్టానుసారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నవి లేనివి రాస్తుంటే వైసీపీ నాయకులు గానీ, ప్రభుత్వ పెద్దలుగానీ ఎందుకు పట్టించుకోరు అంటూ వైసీపీ అభిమానులు బాగా ఆవేదన చెందుతుంటారు. కానీ వారు ఎందుకు స్పందించరు అన్న దానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిన్న క్లూ ఇచ్చారు.
ఇటీవల జగన్ ప్రభుత్వంపై భారీగా వ్యతిరేక కథనాలను ప్రచురిస్తున్న ఒక టీడీపీ అనుకూల పత్రిక పట్ల ప్రభుత్వం నుంచి ఎలాంటి రియాక్షన్ కనిపించలేదు. ఆ కథనాల వల్ల ప్రజల్లో లేనిపోని అపోహలు కలుగుతున్నా… నమ్మేవాళ్లు నమ్ముతున్నా వైసీపీ గానీ, ప్రభుత్వం గానీ మౌనంగా ఉంది. ఆ మీడియా సంస్థకు చెందిన ఛానల్ పై మాత్రం ఇన్ డైరెక్ట్ గా బ్యాన్ విధించారన్న ఆరోపణలు ఉన్నాయి. కానీ ఆ మీడియా సంస్థ పత్రిక మాత్రం ప్రభుత్వంపై విరుచుకుపడుతూనే ఉంది.
ఇలా సదరు ప్రతికలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న కథనాలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా… పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాను ఆ పత్రికను చదవడం మానేశానని చెప్పారు. లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడం జీర్ణించుకోలేక తప్పుడు కథనాలు రాస్తున్నారని విమర్శించారు. తప్పుడు వార్తలు రాస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
అయితే ఒక ప్రముఖ పత్రిక భారీగా వ్యతిరేక కథనాలు రాస్తుంటే వాటికి కౌంటర్ ఇవ్వడమో…. లేదంటే అవి తప్పుడు కథనాలు అయితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి గానీ… ఆ పత్రికనే చదవకుండా మానేయడం కార్యకర్తలు, సామాన్యుల వరకు ఓకే గానీ… మంత్రులు కూడా అదే పని చేస్తే ఎలా? అని వైసీపీ అభిమానులు అంటున్నారు.
మానసిక ప్రశాంతత కోసం వ్యతిరేక కథనాలు రాసే పత్రికలను చదవడం మంత్రులు మానేసినంత మాత్రాన జరగాల్సిన డ్యామేజ్ జరగుతూనే ఉంటుంది కదా!. ఒకవేళ అవి తప్పుడు కథనాలు అయితే ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలే గానీ… ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు పేపర్ చదవకుండా తప్పించుకు తిరిగితే మరి ఆ ప్రచారాన్ని నిలువరించేది ఎలా? అని వైసీపీ క్యాడర్ ప్రశ్నిస్తోంది.