అజరుద్దీన్ కల నిజమాయెగా...!
హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా అజర్ ఎన్నిక 100 ఓట్ల తేడాతో నెగ్గిన భారత మాజీ కెప్టెన్ భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజరుద్దీన్ చిరకాల స్వప్నం ఎట్టకేలకు నెరవేరింది. హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు కావాలన్న లక్ష్యాన్ని 56 సంవత్సరాల వయసులో సాధించగలిగాడు. బీసీసీఐ పాలకమండలి నియమించిన ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో…సరికొత్త నియమావళి ప్రకారం జరిగిన హైదరాబాద్ క్రికెట్ సంఘం ఎన్నికల్లో… మహ్మద్ అజరుద్దీన్ 173 ఓట్లు సాధించడం ద్వారా విజేతగా నిలిచాడు. ప్రత్యర్థి ప్రకాశ్ చంద్ జైన్ […]
- హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా అజర్ ఎన్నిక
- 100 ఓట్ల తేడాతో నెగ్గిన భారత మాజీ కెప్టెన్
భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజరుద్దీన్ చిరకాల స్వప్నం ఎట్టకేలకు నెరవేరింది. హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు కావాలన్న లక్ష్యాన్ని 56 సంవత్సరాల వయసులో సాధించగలిగాడు.
బీసీసీఐ పాలకమండలి నియమించిన ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో…సరికొత్త నియమావళి ప్రకారం జరిగిన హైదరాబాద్ క్రికెట్ సంఘం ఎన్నికల్లో… మహ్మద్ అజరుద్దీన్ 173 ఓట్లు సాధించడం ద్వారా విజేతగా నిలిచాడు.
ప్రత్యర్థి ప్రకాశ్ చంద్ జైన్ కు 73 ఓట్లు మాత్రమే రావడంతో… అజర్ 100 ఓట్ల తేడాతో నెగ్గినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.
పడిలేచిన కెరటం అజర్…
1990 దశకంలో ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా పేరుపొందిన అజర్ భారత్ తరపున 99 టెస్ట్ మ్యాచ్ లు, 334 వన్డే మ్యాచ్ లు ఆడిన అసాధారణ రికార్డు ఉంది.
ఇంతేకాదు….భారతజట్టుకు 47 టెస్టులు, 174 వన్డేలతో పాటు… మూడు ప్రపంచకప్ టో్ర్నీలలో నాయకత్వం వహించిన ఏకైక ఆటగాడు అజరుద్దీన్ మాత్రమే.
మ్యాచ్ ఫిక్సింగ్ నీడలు..
గతంలో సైతం హెచ్ సిఏ ఎన్నికల బరిలో అజర్ నిలిచినా…సాంకేతిక కారణాలతో నామినేషన్ ను తిరస్కరించారు. అయితే ప్రస్తుత 2019 ఎన్నికల్లో మాత్రం అజర్ నిబంధనలకు అనుగుణంగానే, తగిన అర్హతలతో హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షపదవికి పోటీలో నిలిచారు.
హైదరాబాద్ క్రికెట్ సంఘానికి అనుబంధంగా ఉన్న వివిధ క్లబ్ లకు చెందిన ఓటర్లు చివరకు …మణికట్టు మాంత్రికుడు అజర్ వైపే మొగ్గుచూపారు. భారీ మెజారిటీతో గెలిపించుకొన్నారు.
రానున్న రెండేళ్ల కాలంలో హైదరాబాద్ క్రికెట్ సంఘానికి అజర్ ఎలాంటి సేవలు అందించగలడన్నదే ఇక్కడి అసలు పాయింట్.
కుట్రలు, కుతంత్రాలు, ముఠాల కుమ్ములాటలకు మరో పేరైన హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షపదవి..అజర్ సత్తాకు, నేర్పు ఓర్పులకు పరీక్షే అనడంలో ఏమాత్రం సందేహం లేదు.