ప్రపంచ బాక్సింగ్ లో అమిత్ పంగల్ అపూర్వ విజయం

అన్న త్యాగం ఫలితమే తమ్ముడి ప్రపంచ రజతం ఆర్థిక సమస్యలను అధిగమించిన అమిత్ పంగల్ రష్యాలోని ఎక్ తెరీన్ బర్గ్ వేదికగా ముగిసిన 2019 ప్రపంచ బాక్సింగ్ పోటీలలో భారత బాక్సర్, 23 ఏళ్ల అమిత్ పంగల్ 49 కిలోల విభాగంలో రజత పతకం సాధించడం ద్వారా చరిత్ర సృష్టించాడు. భారత బాక్సింగ్ కే గర్వకారణంగా నిలిచాడు. ప్రపంచ బాక్సింగ్ లో రజత పతకం సాధించిన తొలి భారత బాక్సర్ గా రికార్డు సాధించాడు.  అయితే…అమిత్ పంగల్ ఈ విజయం […]

Advertisement
Update:2019-09-27 05:46 IST
  • అన్న త్యాగం ఫలితమే తమ్ముడి ప్రపంచ రజతం
  • ఆర్థిక సమస్యలను అధిగమించిన అమిత్ పంగల్

రష్యాలోని ఎక్ తెరీన్ బర్గ్ వేదికగా ముగిసిన 2019 ప్రపంచ బాక్సింగ్ పోటీలలో భారత బాక్సర్, 23 ఏళ్ల అమిత్ పంగల్ 49 కిలోల విభాగంలో రజత పతకం సాధించడం ద్వారా చరిత్ర సృష్టించాడు. భారత బాక్సింగ్ కే గర్వకారణంగా నిలిచాడు. ప్రపంచ బాక్సింగ్ లో రజత పతకం సాధించిన తొలి భారత బాక్సర్ గా రికార్డు సాధించాడు.

అయితే…అమిత్ పంగల్ ఈ విజయం వెనుక…కడుపునిండా తిండికి గతిలేని పేదరికం, బాక్సింగ్ పరికరాలు సమకూర్చుకోలేని దుస్థితి, అన్న అజయ్ పంగల్ త్యాగం దాగి ఉన్నాయి.

అన్న ప్రేరణతో బాక్సింగ్ బరిలో…

బాక్సింగ్, కుస్తీ, షూటింగ్ క్రీడాకారుల ఖిల్లా హర్యానాలోని రోహ్ తక్ జిల్లా మయానా గ్రామంలోని ఓ నిరుపేద రైతు కుటుంబంలో జన్మించిన అమిత్ పంగల్.. ప్రపంచ స్థాయి బాక్సర్ గా ఎదగటానికి పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు.

తనకంటే పెద్దవాడైన సోదరుడు అజయ్ పంగల్ జాతీయ స్థాయి బాక్సర్ కావడంతో…అన్న ప్రేరణతో అమిత్ సైతం బాక్సింగ్ క్రీడలో అడుగుపెట్టాడు.

తగిన ఆర్థిక స్థోమత లేకపోడం, తన తమ్ముడు సైతం బాక్సర్ కావాలని లక్ష్యంగా ఎంచుకోడంతో.. అజయ్ బాక్సింగ్ నుంచి విరమించుకొని భారత సైన్యంలో సిపాయిగా చేరి హవల్దార్ స్థాయికి చేరాడు. తానే కుటుంబ భారాన్ని మోస్తూ…తమ్ముడు అమిత్ పంగల్ కు అండగా నిలిచాడు.

తన కెరియర్ ప్రారంభంలో ..బాక్సింగ్ ప్రాక్టీసుకు అవసరమైన గ్లవ్స్, పౌష్టికాహారం లేకపోడంతో అమిత్ పలురకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.

అన్న అజయ్ తన సంపాదనలో అధికభాగం తమ్ముడు అమిత్ కే ఖర్చు చేస్తూ రావడంతో…అంచెలంచెలుగా ఎదిగాడు.
తనను ప్రపంచస్థాయి బాక్సర్ గా చూడాలని సోదరుడు అజయ్ చెప్పిన మాటలు తనలో స్ఫూర్తిని నింపాయని, తరచూ గుర్తు చేసుకొంటూ తన ప్రస్థానం కొనసాగిస్తూ వచ్చానని అమిత్ గుర్తు చేసుకొంటూ ఉంటాడు.

ప్రపంచ పతకంతో సరికొత్త చరిత్ర…

ప్రపంచ బాక్సింగ్ రజత పతకం సాధించిన వెంటనే తన ఆనందాన్ని సోదరుడు అజయ్ తోనే పంచుకొన్నానని..అన్న అజయ్ లేకపోతే తాను లేనని కంటనీరు పెట్టుకొని మరీ అమిత్ పంగల్ గుర్తు చేసుకొన్నాడు.

మరోవైపు…అమిత్ పంగల్ తండ్రి విజిందర్ సింగ్ మాత్రం…తన చిన్నకుమారుడు ప్రపంచ పతకం సాధించడం గర్వకారణమని… అయితే పెద్దకుమారుడు అజయ్ కు సైతం బాక్సింగ్ లో రాణించగల సత్తా ఉన్నా తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా ఉద్యోగం కోసం తన కెరియర్ ను త్యాగం చేయాల్సి వచ్చిందని గుర్తు చేసుకొన్నారు.

అన్నఖాతాలోకే ప్రైజ్ మనీ…

అంతర్జాతీయ బాక్సర్ గా తాను ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్, ప్రపంచ బాక్సింగ్ పోటీల్లో సాధించిన పతకాలకు…. కేంద్ర , రాష్ట్ర్ర ప్రభుత్వాలు ఇచ్చిన నగదు బహుమతిని తన అన్న అజయ్ పంగల్ ఖాతాలోనే జమచేస్తున్నానని అమిత్ ప్రకటించాడు.

తనతో పాటు తన కుటుంబం బాగోగులు సోదరుడు అజయ్ చూస్తున్నాడని..తన కోసం తన బాక్సింగ్ కెరియర్ నే త్యాగం చేసిన సోదరుడే తనకు కొండంత అండని అమిత్ పంగల్ పొంగిపోతున్నాడు.

23 ఏళ్ల వయసుకే పతకాల మోత…

23 సంవత్సరాల వయసులోనే అమిత్ పంగల్ 2018 ఆసియాక్రీడల్లో బంగారు పతకం, 2019 ప్రపంచ బాక్సింగ్ పోటీలలో రజత పతకం, గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ లో రజతం, 2017, 2019 ఆసియా బాక్సింగ్ పోటీలలో కాంస్య, రజత పతకాలు సాధించడంతో పాటు…అర్జున పురస్కారం సైతం అందుకొన్నాడు.

ప్రపంచ బాక్సింగ్ లో రజత పతకం సాధించిన అమిత్ పంగల్ కు కేంద్ర ప్రభుత్వం 14 లక్షల రూపాయలు నజరానాగా ఇచ్చి ప్రోత్సహించింది.

అంతేకాదు…హర్యానా ప్రభుత్వం సైతం అమిత్ కు భారీ మొత్తంలోనే నగదుతో పాటు…డీఎస్పీ ఉద్యోగం సైతం ఇవ్వనుంది.
టార్గెట్ టోక్యో ఒలింపిక్స్ బెర్త్… టోక్యో వేదికగా వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్ కు అర్హత సాధించడమే తన లక్ష్యమని… తనపైన ఏమాత్రం ఒత్తిడిలేదని అమిత్ పంగల్ చెప్పాడు.

చైనాలోని వూహాన్ వేదికగా 2020 ఫిబ్రవరి 3 నుంచి 14 వరకూ జరిగే ఆసియా-ఓషియానా బాక్సింగ్ పోటీలలో పాల్గోనున్నాడు. ఈ టోర్నీలో విజేతగా నిలవడం ద్వారా టోక్యో ఒలింపిక్స్ బెర్త్ సాధించాలన్న పట్టుదలతో ఉన్నాడు.

ఏదిఏమైనా…భారత బాక్సింగ్ చరిత్రలో ఇంతవరకూ ఏ బాక్సరూ సాధించలేని ఘనతను..ప్రపంచ రజత పతకంతో అమిత్ పంగల్ సాధించడం.. అపూర్వం…అసాధారణమనడంలో ఏమాత్రం సందేహం లేదు.

Tags:    
Advertisement

Similar News