త్రిమూర్తులు లేఖాస్త్రం... "దేశం"లో కలకలం

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు తోట త్రిమూర్తులు పార్టీ అధ్యక్షుడికి రాసిన లేఖ తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతోంది. ఇంతవరకూ పార్టీని వీడిన వారు ఎవరిని నొప్పించకుండా…. కామ్ గానే పార్టీ మారారు. వారి మనసులో ఏమున్నా దాన్ని బయటపెట్టకుండానే తెలుగుదేశం పార్టీని వీడారు. అయితే తాజాగా పార్టీకి రాజీనామా చేసిన తోట త్రిమూర్తులు మాత్రం పార్టీ తీరును, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిని ప్రశ్నిస్తూ రాసిన లేఖ అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది అంటున్నారు. […]

Advertisement
Update:2019-09-14 05:20 IST

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు తోట త్రిమూర్తులు పార్టీ అధ్యక్షుడికి రాసిన లేఖ తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతోంది. ఇంతవరకూ పార్టీని వీడిన వారు ఎవరిని నొప్పించకుండా…. కామ్ గానే పార్టీ మారారు. వారి మనసులో ఏమున్నా దాన్ని బయటపెట్టకుండానే తెలుగుదేశం పార్టీని వీడారు.

అయితే తాజాగా పార్టీకి రాజీనామా చేసిన తోట త్రిమూర్తులు మాత్రం పార్టీ తీరును, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిని ప్రశ్నిస్తూ రాసిన లేఖ అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది అంటున్నారు.

ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు కులస్థుల హవా ఎక్కువగానే ఉంటుంది. వారి మద్దతు ఎవరికి ఉంటే వారే అధికారంలోకి వస్తారని రాజకీయ పార్టీల నమ్మకం. గతంలో కాపులు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే వ్యవహరించారు. అయితే కాపు రిజర్వేషన్ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడడం, కాపులు పార్టీకి దూరం కావడం ప్రారంభమైంది.

దీంతో చంద్రబాబు నాయుడు తన చాణక్య రాజకీయాలకు తెరతీసి పార్టీలో ఉన్న కాపు నాయకులు తోట త్రిమూర్తులు, నిమ్మకాయల చినరాజప్ప, మెట్ల సత్యనారాయణ వారసులు, తోట కుటుంబీకులను తెలివిగా తనవైపు తిప్పకున్నారు. యధావిధిగా తన అవసరం తీరగానే వారిని కూరలో కరివేపాకులా వదిలేశారు.

దీంతో ఉభయ గోదావరి జిల్లాల్లోని కాపులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసేందుకు సమయం కోసం ఎదురు చూశారు. ఆ సమయంలో ఎన్నికలు రావడంతో రెండు జిల్లాల్లోను కాపులు తెలుగుదేశం పార్టీకి చుక్కలు చూపించారు.

తాజాగా తోట త్రిమూర్తులు తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ లేఖ రాయడం తెలుగుదేశం నాయకులను కలవరపెడుతోంది. రోజు రోజుకు పార్టీకి చెందిన సీనియర్ నాయకులు వెళ్లిపోతుంటే తాజాగా తోట త్రిమూర్తులు పార్టీ నేత చంద్రబాబు నాయుడికి లేఖ రాయడం మరో తలనొప్పిగా మారిందని అంటున్నారు. పైగా లేఖలో వాడిన పదజాలం పట్ల కూడా చంద్రబాబు నాయుడు సన్నిహితుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. పార్టీ మారాలని లోలోపల భావిస్తున్న వారికి తోట త్రిమూర్తులు లేఖ అనంతరం బలం వచ్చినట్లు అయ్యిందని అంటున్నారు.

పైగా పార్టీని వీడిన సుజనా చౌదరి, సీఎం రమేష్ లు మీ సూచనలతోనే వెళ్లారు కదా అని ప్రశ్నించడం కూడా సీనియర్ నాయకుల్లో చర్చకు దారి తీస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పరిస్థితి దింపుడుకళ్లెంలా ఉందని, కొత్తగా పార్టీ నాయకులు ఇలా బహిరంగ లేఖలతో మరింత ఇబ్బందులు పెట్టడం సీనియర్ నాయకులకు మింగుడు పడడం లేదని అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News