పంట నష్టం రైతులకు 15 శాతం అదనపు సాయం

ఇటీవల రాష్ట్రాన్ని వర్షాలు, వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఈ వరద నష్టంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నతస్ధాయి అధికారులు, వివిధ శాఖలకు చెందిన మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భారీ వర్షాలు, తుపానులు, వరదలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో రైతులకు ప్రస్తుతం ఇస్తున్న నష్టపరిహారానికి అదనంగా 15 శాతం ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వరదల కారణంగా రాష్ట్రంలో ఉద్యాన, ఆహార, వాణిజ్య పంటలకు కలిగిన నష్టాలపై మంత్రులు, అధికారులు […]

Advertisement
Update:2019-08-28 05:40 IST

ఇటీవల రాష్ట్రాన్ని వర్షాలు, వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఈ వరద నష్టంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నతస్ధాయి అధికారులు, వివిధ శాఖలకు చెందిన మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భారీ వర్షాలు, తుపానులు, వరదలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో రైతులకు ప్రస్తుతం ఇస్తున్న నష్టపరిహారానికి అదనంగా 15 శాతం ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

వరదల కారణంగా రాష్ట్రంలో ఉద్యాన, ఆహార, వాణిజ్య పంటలకు కలిగిన నష్టాలపై మంత్రులు, అధికారులు ముఖ్యమంత్రికి నివేదికలు అందజేశారు. రాష్ట్ర్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లోను పంటలు దెబ్బతిన్నాయని, ముఖ్యంగా కృష్ణా నది వరదలతో గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం బాగా దెబ్బతిందని మంత్రులు, అధికారులు తెలిపారు.

ఈ జిల్లాలోని అవనిగడ్డ, పెనమలూరు, పామర్రు నియోజక వర్గాలలో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ముఖ్యమంత్రికి నివేదించారు అధికారులు.
దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం ఇచ్చే పంట సాయాన్నిబ్యాంకులు పాత బాకీలలో మినహాయించుకోకుండా చూడాలని, ఇక పంటల నష్టానికి ఇచ్చే తక్షణ సాయాన్ని ప్రస్తుతం ఇస్తున్న దానికంటే మరో 15 శాతం అదనంగా ఇవ్వాలని ఆదేశించారు.

“ఇది రైతు సంక్షేమ ప్రభుత్వమని ప్రజలకు తెలియజేయండి. రైతులకు ఇచ్చే సాయంలో ఎలాంటి కోతలు లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులు, మంత్రులదే” అని సీఎం జగన్మోహన్ రెడ్డి సూచించారు. రైతులకు నాణ్యమైన ఎరువులు అందించాలని, తక్షణమే భూసార పరీక్షలు చేయించాలని, గ్రామ సచివాలయాల ద్వారా కౌలు రైతులకు కార్డులు మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు.

కౌలు రైతుల చట్టాలపై వారితో పాటు గ్రామ వలంటీర్లకు కూడా శిక్షణ ఇవ్వాలని, నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువులు, కల్తీ పురుగు మందులు సరఫరా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రైతులకు సలహాలు, సూచనలు చేసేందుకు తక్షణమే ఓ కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని, రైతుల కోసం ఓ యాప్ ను కూడా సిద్ధం చేయాలని, ఇదంతా నాలుగైదు నెలలలోపే పూర్తి కావాలని ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో పాటు మంత్రులు కురసాల కన్నబాబు, బుగ్గన రాజేంద్రనాథ్, మోపిదేవి వెంకట రమణ, పేర్ని నాని, మేకతోటి సుచరిత, కొడాలి నాని, సీఎం ముఖ్య సలహాదారు అజయ్‌ కల్లం, ధనుంజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News