కుస్తీలో జూనియర్ ప్రపంచ విజేత దీపక్ పూనియా
18 ఏళ్ల విరామం తర్వాత భారత్ కు తొలి స్వర్ణం భారత జూనియర్ వస్తాదు దీపక్ పూనియా చరిత్ర సృష్టించాడు. గత 18 సంవత్సరాలలో ప్రపంచ కుస్తీలో బంగారు పతకం సాధించిన భారత తొలి రెజ్లర్ గా రికార్డుల్లో చేరాడు. ఎస్తోనియాలోని తలినిన్ వేదికగా ముగిసిన 2019 జూనియర్ ప్రపంచ కుస్తీ 86 కిలోల విభాగంలో దీపక్ పూనియా విశ్వవిజేతగా నిలిచాడు. భుజం గాయంతోనే పోటీలలో పాల్గొన్న దీపక్…ఫైనల్లో రష్యా వస్తాదు అలిక్ షెబ్జుకోవ్ ను అధిగమించి బంగారు […]
- 18 ఏళ్ల విరామం తర్వాత భారత్ కు తొలి స్వర్ణం
భారత జూనియర్ వస్తాదు దీపక్ పూనియా చరిత్ర సృష్టించాడు. గత 18 సంవత్సరాలలో ప్రపంచ కుస్తీలో బంగారు పతకం సాధించిన భారత తొలి రెజ్లర్ గా రికార్డుల్లో చేరాడు.
భుజం గాయంతోనే పోటీలలో పాల్గొన్న దీపక్…ఫైనల్లో రష్యా వస్తాదు అలిక్ షెబ్జుకోవ్ ను అధిగమించి బంగారు పతకం అందుకొన్నాడు.
హోరాహోరీగా సాగిన ఫైనల్లో ఇద్దరూ చెరో 2 పాయింట్ల చొప్పున సాధించి సమఉజ్జీలుగా నిలిచారు. అయితే…నిబంధనల ప్రకారం చివరి పాయింటు సాధించిన దీపక్ పూనియానే విజేతగా ప్రకటించారు.
2001 ప్రపంచ జూనియర్ కుస్తీ 69 కిలోల విభాగంలో రమేశ్ కుమార్, 130 కిలోల విభాగంలో పల్విందర్ సింగ్ చీమా స్వర్ణ పతకాలు సాధించిన 18 ఏళ్ల విరామం తర్వాత దీపక్ పూనియా బంగారు పతకం అందుకోడం విశేషం.
కజకిస్థాన్ వేదికగా త్వరలో జరిగే ప్రపంచ సీనియర్ కుస్తీ టోర్నీలో పాల్గొనటానికి సైతం దీపక్ పూనియా అర్హత సంపాదించాడు.
హర్యానాలోని జజ్జర్ జిల్లాకు చెందిన 20 ఏళ్ల దీపక్ పూనియా…సీనియర్ విభాగంలో సైతం సత్తా చాటుకోడానికి తహతహలాడుతున్నాడు.