గ్లోబల్ గేమ్ టెన్నిస్ లో చాంపియన్ తల్లులు

ఆటకు మాతృత్వం అవరోధం కాదంటున్న క్లిస్టర్స్, సెరెనా అమ్మతనం పరిణతిని పెంచిందంటున్న సానియా క్రీడలకు మాతృత్వం, మాతృత్వానికి క్రీడలు అవరోధమా?… చాంపియన్లు తల్లులు కాలేరా? తల్లులైతే చాంపియన్లు కాలేరా?… ఈ ప్రశ్నలకు తమదైన శైలిలో సమాధానాలు చెప్పిన….చాంపియన్ తల్లులు….తల్లులైన తర్వాత తిరిగి చాంపియన్లుగా మారిన…. సూపర్ మామ్స్ ఎందరో టెన్నిస్ క్రీడలో మనకు కనిపిస్తారు. ఆ వరుసలోనే చేరాలని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సైతం కలలు కంటోంది. మహిళలు… నేర్పు ఓర్పు, శాంతి సహనాలకు మారు పేరు. […]

Advertisement
Update:2019-08-11 06:03 IST
  • ఆటకు మాతృత్వం అవరోధం కాదంటున్న క్లిస్టర్స్, సెరెనా
  • అమ్మతనం పరిణతిని పెంచిందంటున్న సానియా

క్రీడలకు మాతృత్వం, మాతృత్వానికి క్రీడలు అవరోధమా?… చాంపియన్లు తల్లులు కాలేరా? తల్లులైతే చాంపియన్లు కాలేరా?… ఈ ప్రశ్నలకు తమదైన శైలిలో సమాధానాలు చెప్పిన….చాంపియన్ తల్లులు….తల్లులైన తర్వాత తిరిగి చాంపియన్లుగా మారిన…. సూపర్ మామ్స్ ఎందరో టెన్నిస్ క్రీడలో మనకు కనిపిస్తారు. ఆ వరుసలోనే చేరాలని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సైతం కలలు కంటోంది.

మహిళలు… నేర్పు ఓర్పు, శాంతి సహనాలకు మారు పేరు. మహిళామ తల్లులు పుట్టుకతోనే శాంతమూర్తులు. ఓవైపు సంసారబాధ్యతలు నిర్వర్తిస్తూనే…మరోవైపు ఉద్యోగబాధ్యతలను అత్యంత సమర్ధవంతంగా నిర్వహించే ధీరలు.

రంగం ఏదైనా.. పురుషులతో సమానంగా రాణించడంలో మహిళలకు మహిళలు మాత్రమే సాటి. క్రీడారంగానికీ, సంసార బంధానికి… చాంపియన్ హోదాకీ, మాతృత్వానికి ఏమాత్రం పొసగదని….టెన్నిస్ క్రీడలో చాంపియన్లుగా నిలిచిన స్టార్లకు మాతృత్వం ఓ వరం కాదన్న …పొరపాటు అభిప్రాయం ప్రచారంలో ఉంది.

అయితే…ఇదంతా ఓ అపోహమాత్రమేనని….బెల్జియం టెన్నిస్ దిగ్గజం కిమ్ క్లిస్టర్స్, అమెరికన్ బ్లాక్ థండర్ సెరెనా విలియమ్స్, ఉక్రెయిన్ టెన్నిస్ క్వీన్ విక్టోరియా అజరెంకాల విజయాలు, అనుభవాలను చూస్తే ఇట్టే తెలిసిపోతుంది.

నాడు మార్గారెట్ కోర్ట్- నేడు సెరెనా విలియమ్స్

టెన్నిస్ చరిత్రలో తల్లులైన తర్వాత చాంపియన్లుగా నిలిచిన దిగ్గజాలు 1970 దశకంలోనే మనకు మార్గారెట్ కోర్ట్, ఇవనాన్ గులగాంగ్ కాలేలో రూపంలో కనిపిస్తారు.

ఆ తర్వాత..2010 లో బెల్జియం థండర్ కిమ్ క్లిస్టర్స్, 2017లో బ్లాక్ థండర్ సెరెనా విలియమ్స్ తల్లులైన తర్వాత సైతం తమ జోరు కొనసాగిస్తూ అసలు సిసలు చాంపియన్లుగా నిరూపించుకొన్నారు.

2009 సీజన్లో బెల్జియం టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్ కిమ్ క్లిస్టర్స్….ఓ బిడ్డకు జన్మనివ్వడం కోసం…ఆటకు విరామం చెప్పి…తల్లిగా గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో పాల్గొని..2010 యూఎస్ ఓపెన్ టైటిల్ ను…అన్ సీడెడ్ ప్లేయర్ హోదాతో నెగ్గి చరిత్ర సృష్టించింది.

కుమార్తె జడా సాక్షిగా ట్రోఫీ అందుకొని …మహిళా క్రీడాకారులకే స్ఫూర్తిగా నిలిచింది.

అంతేకాదు….ఉక్రెయిన్ టెన్నిస్ క్వీన్, ప్రపంచ మాజీ నంబర్ వన్ విక్టోరియా అజరెంకా…. ఓ బిడ్డకు జన్మినిచ్చి..ఏడాది విరామం తర్వాత… తిరిగి వింబుల్డన్ టైటిల్ వేటకు దిగింది.

విజయం వెంట విజయం సాధించడం ద్వారా సత్తా చాటుకొంది. బాబు రాక తన జీవితాన్నే మార్చేసిందని, ఇప్పుడు తనకు ఒత్తిడి అంటే ఏంటో తెలియడంలేదని మురిసిపోతూ చెబుతోంది.

మృత్యుంజయురాలు సెరెనా…

అమెరికన్ బ్లాక్ థండర్, గ్రాండ్ స్లామ్ క్వీన్ సెరెనా విలియమ్స్ సైతం….మాతృత్వం కోసం …టెన్నిస్ ఆటకు తాత్కాలికంగా విరామం ఇచ్చింది.

కాన్పు కష్టం కావడంతో ఓ దశలో సెరెనా బ్రతకడం కష్టమనే వైద్యులు ప్రకటించారు. అయితే టెన్నిస్ ఆటలో ప్రత్యర్థులతో పలుసార్లు అలుపెరుగని పోరాటం చేసి విజేతగా నిలిచిన సెరెనా..చివరకు మృత్యువుతో సైతం తుదివరకూ పోరాడి విజేతగా నిలిచింది. గత సెప్టెంబర్లో ఓ పాపకు జన్మినిచ్చింది.

ప్రస్తుత కూతురు ఒలింపియా, తన భర్తతో కలసి విజయానందాన్ని ఆస్వాదిస్తోంది.

గత కొద్ది సంవత్సరాలుగా… ఓ చాంపియన్ గా, ప్రపంచ నంబర్ వన్ ప్లేయర్ గా అనుభవించిన ఆనందం ఒక ఎత్తయితే…. నిండుగర్భిణిగా మాతృత్వపు మధురిమలు అనుభవించడం మరో ఎత్తుగా ఉందని…. సెరెనా ప్రకటించింది.

తన కెరియర్ లో 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తో పాటు…వెయ్యి కోట్ల రూపాయలకు పైగా ప్రైజ్ మనీ సంపాదించిన… సెరెనా….. తల్లిహోదాలోనూ టెన్నిస్ ప్లేయర్ గా సూపర్ స్టార్ గా కొనసాగాలని భావిస్తోంది.

అదేదారిలో సానియా….

భారత టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా… రెండేళ్లవిరామం తర్వాత తిరిగి ప్రొఫెషనల్ టెన్నిస్ రీ-ఎంట్రీకి తహతహలాడుతోంది. ఏడాది క్రితమే ఓ మగ బిడ్డకు జన్మనివ్వడం ద్వారా తల్లిహోదా పొందిన సానియా..నూటికి నూరుశాతం ఫిట్ నెస్ తో కెరియర్ లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాలన్న పట్టుదలతో ఉంది. టెన్నిస్ లో తాను సాధించాల్సింది, సరికొత్తగా నిరూపించుకోవాల్సింది ఏదీ లేదని తేల్చి చెప్పింది.

రోజుకు 4 గంటలపాటు సాధన….

మాతృత్వం కోసం గత రెండేళ్లుగా టెన్నిస్ కు దూరంగా ఉన్న సానియా..పదకొండు మాసాల క్రితమే ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. తన కుమారుడు ఇజాన్ ఆలనాపాలనా చూస్తూనే…పూర్తిస్థాయి ఫిట్ నెస్ కోసం రోజుకు రెండు విడతలుగా నాలుగు గంటలపాటు కఠోర సాధన చేస్తోంది.

ప్రసవం తర్వాత సానియా అనూహ్యంగా బరువు పెరిగిపోయింది. దీంతో బరువు తగ్గడం ద్వారా ప్రొఫెషనల్ టెన్నిస్ కు అవసరమైన ఫిట్ నెస్ కోసం జిమ్ లోనే గంటలపాటు గడుపుతోంది.

26 కిలోల బరువు తగ్గిన సానియా..

మూడుపదుల వయసులో తల్లిగా మారిన సానియా. .రోజుకు నాలుగు గంటలపాటు జిమ్ లో వర్కవుట్ చేయడం ద్వారా 26 కిలోల మేర బరువు తగ్గింది.

2020 టోక్యో ఒలింపిక్స్ నాటికి ఫిట్ నెస్ సాధించి…భారతజట్టులో చోటు సంపాదించాలన్న పట్టుదలతో ఉంది. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ తో కలసి దుబాయ్ లో కాపురముంటున్న సానియా…అక్కడ కసరత్తులు చేస్తోంది.

వచ్చే ఏడాది నాటికి పూర్తి ఫిట్ నెస్ తో ప్రొఫెషనల్ టెన్నిస్ లో తిరిగి అడుగుపెట్టాలన్న పట్టుదలతో ఉంది.

నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు…

తన కెరియర్ లో ఇప్పటికే మూడు మిక్సిడ్ టైటిల్స్ తో సహా మొత్తం ఆరు గ్రాండ్ స్లామ్ డబుల్స్ టైటిల్స్ నెగ్గిన సానియా..మహిళల డబుల్స్ లో నంబర్ వన్ ర్యాంక్ సైతం సాధించింది.

ఆసియా క్రీడలు,శాఫ్ గేమ్స్, జాతీయ క్రీడల టెన్నిస్ సింగిల్స్, మిక్సిడ్ డబుల్స్ విభాగాలలో పతకాలు సాధించింది. అయితే…రీ-ఎంట్రీలో తాను సరికొత్తగా నిరూపించుకోవాల్సి ఏమీలేదని…తనకు లక్ష్యాలు అంటూ ఏవీలేవని..సంపూర్ణ ఫిట్ నెస్ తో తిరిగి అంతర్జాతీయ టెన్నిస్ ఆడటమే లక్ష్యమని ప్రకటించింది.

టెన్నిస్ ఆడటమన్నా…పోటీపడటమన్నా తనకు చెప్పలేని ఇష్టమని..తన కుమారుడు ఇజాన్ మాలిక్ మీర్జా ప్రేరణతో తిరిగి టెన్నిస్ ఆడాలని నిర్ణయించినట్లు సానియా చెబుతోంది.

భారత మహిళా టెన్నిస్ చరిత్రలోనే అరుదైన విజయాలతో పాటు…వందకోట్ల రూపాయలకు పైగా ఆర్జించిన సానియా… హైదరాబాద్ లో తనపేరుతో ఓ అకాడమీని సైతం నిర్వహిస్తోంది.

ఇదంతా చూస్తుంటే… అమ్మతనానికి, మాతృత్వానికీ క్రీడలు ఏమాత్రం అవరోధంకాదని ప్రత్యేకంగా చెప్పాలా మరి.

Tags:    
Advertisement

Similar News