ఫిట్ నెస్ లో భారతజట్టు కొత్తపుంతలు
విరాట్ సేనతో ఫిట్ నెస్ గురు శంకర్ బాసు మ్యాజిక్ ప్రపంచ క్రికెట్లో ఫిట్టెస్ట్ టీమ్ భారత్ ప్రపంచ క్రికెట్లో ఫిట్ నెస్ పరంగా అత్యంత బలమైన జట్లు ఏవంటే..వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఆస్ట్ర్రేలియా, న్యూజిలాండ్ మాత్రమే అనుకొనే రోజులు పోయాయి. అంతర్జాతీయ క్రికెట్లో ఫిట్టెస్ట్ జట్టు ఏదంటే విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టు మాత్రమే అనుకొనే రోజులు వచ్చాయి. భారత జట్టు ఈ అసాధారణ ఫిట్ నెస్ వెనుక.. ఫిట్ నెస్ గురు శంకర్ బసు పాత్ర ఎంతో […]
- విరాట్ సేనతో ఫిట్ నెస్ గురు శంకర్ బాసు మ్యాజిక్
- ప్రపంచ క్రికెట్లో ఫిట్టెస్ట్ టీమ్ భారత్
ప్రపంచ క్రికెట్లో ఫిట్ నెస్ పరంగా అత్యంత బలమైన జట్లు ఏవంటే..వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఆస్ట్ర్రేలియా, న్యూజిలాండ్ మాత్రమే అనుకొనే రోజులు పోయాయి. అంతర్జాతీయ క్రికెట్లో ఫిట్టెస్ట్ జట్టు ఏదంటే విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టు మాత్రమే అనుకొనే రోజులు వచ్చాయి.
భారత జట్టు ఈ అసాధారణ ఫిట్ నెస్ వెనుక.. ఫిట్ నెస్ గురు శంకర్ బసు పాత్ర ఎంతో ఉంది.
క్రికెట్ కు… ఫిట్ నెస్ కు అవినాభావ సంబంధమే ఉంది. మూడున్నర గంటల్లో ముగిసిపోయే ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ నుంచి ఐదు రోజుల పాటు.. రోజుకు 90 ఓవర్ల చొప్పున సాగే సాంప్రదాయ టెస్ట్ మ్యాచ్ ల వరకూ… ఆటగాళ్లకు నూటికి నూరుశాతం ఫిట్ నెస్ ఉండితీరాలి. తగిన ఫిట్ నెస్ లేకుంటే వ్యక్తిగతంగా రాణించలేకపోడమే కాదు… జట్టుగానూ విఫలం కాక తప్పదు.
గత తరం క్రికెటర్లు గుండప్ప విశ్వనాథ్, సునీల్ గవాస్కర్ కాలం నుంచి నేటితరం క్రికెటర్లు విరాట్ కొహ్లీ, రవీంద్ర జడేజా, కెఎల్ రాహుల్ ల వరకూ ఫిట్ నెస్ లో సమూలమైన మార్పు చోటు చేసుకొంది.
ఫిట్ నెస్ గురు శంకర్ బసు మ్యాజిక్…
చెన్నైకి చెందిన శంకర్ బసు గత నాలుగేళ్లుగా భారత జట్టుకు ఫిట్ నెస్ కోచ్ కమ్ స్ట్ర్రెంత్, కండిషనింగ్ స్పెషలిస్ట్ గా సేవలు అందిస్తున్నారు.
ప్రముఖ తమిళ సినీ డైరెక్టర్ మహేంద్రన్ అల్లుడు శంకర్ బసు…ఇంగ్లండ్ లోని లీడ్స్ బెకెట్ యూనివర్శిటీ నుంచి స్ట్ర్రెంత్ అండ్ కండిషనింగ్ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ తీసుకొన్నారు. అంతటితో ఆగిపోకుండా క్రికెటర్ల ఫిట్ నెస్ కమ్ కండిషనింగ్ లో స్పెషలిస్ట్ గా గుర్తింపు పొందారు.
2015 లో భారతజట్టు బాధ్యతలు…
నాలుగేళ్ల క్రితమే బీసీసీఐ కాంట్రాక్టుతో భారతజట్టు స్ట్ర్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టారు. మొత్తం మూడు ఫార్మాట్లలో భారత ఆటగాళ్ల ఫిట్ నెస్ పై సమూల అధ్యయనం చేసి…. క్రికెటర్ల బలాలు, బలహీనతలపై సంపూర్ణ అవగాహనతో వినూత్న రీతిలో ఫిట్ నెస్ కార్యక్రమాలు రూపొందించారు.
విరాట్ కొహ్లీ, రవీంద్ర జడేజా, రాహుల్, మహేంద్రసింగ్ ధోనీ లాంటి క్రికెటర్లు ఫిట్ గా ఉండటంలో ప్రధానపాత్ర వహించారు. ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షమీ, జస్ ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ గంటకు 145 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగలుగు తున్నారంటే.. ఆ ఘనత ఫిట్ నెస్ గురు శంకర్ బసుకు మాత్రమే దక్కుతుంది.
భారత జట్టు ఫిట్ నెస్ తో హ్యాపీ…
ప్రపంచక్రికెట్లో అత్యంత ఫిట్ గా ఉన్నజట్టు భారత్ మాత్రమేనని అందరూ అనుకోడం తనకు సంతృప్తినిచ్చిందంటూ 50 ఏళ్ల శంకర్ బసు మురిసిపోతున్నారు.
గత రెండేళ్ల కాలంలో కెప్టెన్ విరాట్ కొహ్లీ ఫిట్ నెస్ సెషన్ కు కనీసం ఒక్కసారి కూడా డుమ్మా కొట్టలేదని…ఫిట్ నెస్ అంటే కొహ్లీకి అంత మక్కువని శంకర్ బసు అంటున్నారు.
విరాట్ కొహ్లీకి హ్యాట్సాఫ్…
భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ ఫిట్ నెస్ కు ఇచ్చే ప్రాధాన్యం అంతాఇంతా కాదని… ఫిట్ గా ఉంటేనే అనుకొన్న లక్ష్యాలు సాధించ గలమని కొహ్లీ ప్రగాఢంగా నమ్ముతాడని..తమజట్టు నాయకుడే ఫిట్ నెస్ లో ముందుండటం ద్వారా సహ ఆటగాళ్లకు ఆదర్శంగా నిలుస్తున్నాడని గుర్తు చేశారు.
తన దృష్టిలో రవీంద్ర జడేజాను మించిన ఫిట్టెస్ట్ క్రికెటర్ మరొకరులేరని, జడేజాకు పుట్టుకతోనే వచ్చిన సహజసిద్ధమైన ఫిట్ నెస్ ఓ వరమని, ఫీల్డ్ లో అత్యంత సహజంగా, మెరుపువేగంతో కదలడంలో జడేజా తర్వాతే ఎవరైనానని శంకర్ బసు కితాబిస్తున్నారు.
ఓపెనర్ రాహుల్, వెటరన్ మహేంద్ర సింగ్ ధోనీ సైతం ఫిట్ గా ఉండడంలో మొనగాళ్లేనని కొనియాడారు.
ఇద్దరూ ఇద్దరే…
తరచూ గాయాలబారిన పడే భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఫిట్ నెస్ పైన తాను ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించానని..
షమీ ప్రస్తుతం గాయాలకు దూరంగా ఉన్నాడని..తన బౌలింగ్ వేగాన్ని గంటకు 135 కిలోమీటర్ల నుంచి 145 కిలోమీటర్లకు పెంచుకోగలిగాడని శంకర్ బసు గుర్తు చేశారు.
బుమ్రా బౌలింగ్ యాక్షన్ విచిత్రంగా, గాయాలబారిన పడే విధంగా ఉన్నా…సూపర్ ఫిట్ నెస్ తో అధిగమిస్తూ వస్తున్నాడని చెప్పారు.
టెస్ట్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం రోజుకు 90 ఓవర్లపాటు అలుపుసొలుపు లేకుండా బౌలింగ్ చేయగల ఫిట్ నెస్ ను సొంతం చేసుకొన్నాడని శంకర్ బసు గర్వంగా చెబుతున్నారు.
భారత ప్రస్తుత క్రికెటర్లు అత్యుత్తమ ఫిట్ నెస్ తో ఉండటం వెనుక తాను పడిన కష్టం ఎంతో ఉందని పొంగిపోతున్నారు.
భారతజట్టు బాధ్యతలకు దూరం…
భారతజట్టును ఫిట్ నెస్ పరంగా గత నాలుగేళ్లుగా తీర్చిదిద్దిన శంకర్ బసు… బీసీసీఐతో తన కాంట్రాక్టును పొడిగించుకొనే ఉద్దేశంలేదని తేల్చి చెప్పారు.
తన కుటుంబం కోసం పూర్తి సమయం కేటాయించాల్సిన తరుణం వచ్చిందని…భారతజట్టు అవసరం అనుకొంటే తాను ఎల్లవేళలా అందుబాటులో ఉండటానికి సిద్ధమని ఫిట్ నెస్ గురు శంకర్ బసు ప్రకటించారు.
శంకర్ బసు లాంటి ఫిట్ నెస్ గురువు భారతజట్టుకు లభించడం నిజంగా అదృష్టమే మరి.