దేవదాస్ కనకాల కన్నుమూత..... ఆయన ప్రస్థానం ఇదీ....
ప్రముఖ నటులకు ఓనమాలు నేర్పించిన దేవదాస్ కనకాల కన్నుమూశారు. రంగస్థల నటుడిగా, దర్శకుడిగా, సినీ నటుడిగా, ఎందరో హీరోలకు నట శిక్షకుడిగా వ్యవహరించిన దేవదాస్ కనకాల హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో శుక్రవారం నాడు కన్నుమూశారు. ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె. కుమారుడు రాజీవ్ కనకాల కూడా సినీ నటులే. ఇక కోడలు సుమ సుప్రసిద్ధ యాంకర్. ఆయన కుమార్తె శ్రీలక్ష్మి కూడా టీవీ సీరియల్స్ లో నటిస్తున్నారు. అల్లుడు పెద్ది రామారావు నాటక రంగానికి […]
ప్రముఖ నటులకు ఓనమాలు నేర్పించిన దేవదాస్ కనకాల కన్నుమూశారు. రంగస్థల నటుడిగా, దర్శకుడిగా, సినీ నటుడిగా, ఎందరో హీరోలకు నట శిక్షకుడిగా వ్యవహరించిన దేవదాస్ కనకాల హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో శుక్రవారం నాడు కన్నుమూశారు.
ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె. కుమారుడు రాజీవ్ కనకాల కూడా సినీ నటులే. ఇక కోడలు సుమ సుప్రసిద్ధ యాంకర్. ఆయన కుమార్తె శ్రీలక్ష్మి కూడా టీవీ సీరియల్స్ లో నటిస్తున్నారు. అల్లుడు పెద్ది రామారావు నాటక రంగానికి చెందిన వారే. ఆయన అనేక నాటకాలకు దర్శకత్వం వహించారు. ఇక దేవదాస్ కనకాల భార్య లక్ష్మీదేవి కూడా నటనలో సిద్ధ హస్తురాలు.
దేవదాస్ కనకాల, ఆయన భార్య లక్ష్మీదేవి వందలాది మందికి నటనలో శిక్షణ ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లాలోని యానాంలోని కనకాల పేట గ్రామంలో 1945 సంవత్సరం జూలై 30న దేవదాస్ కనకాల జన్మించారు. ఎనిమిది మంది సంతానంలో దేవదాస్ కనకాలే మొదటి వారు.
బాల్యంలోనే పాఠశాలలో తొలిసారిగా నాటకం వేశారు దేవదాస్ కనకాల. అక్కడ ప్రారంభమైన దేవదాస్ కనకాల నట ప్రస్థానం వందలాది నాటకాలు, సినిమాలు, టీవీల్లో నటించే వరకూ వెళ్లింది.
తెలుగు, తమిళ చిత్ర రంగాలలో ఓ వెలుగు వెలిగిన స్టార్లు రజనీకాంత్, చిరంజీవి, రాజేంద్రప్రసాద్, నాగార్జున, వెంకటేష్, నాజర్, రఘువరన్ వంటి వారికి నటనలో ఓనమాలు నేర్పించింది దేవదాస్ కనకాలే. పలు ఫిలిం ఇనిస్టిస్టూట్ లలో నటులకు శిక్షణ ఇచ్చిన దేవదాస్ కనకాల ఆ తర్వాత తానే తన శ్రీమతితో కలిసి సొంతంగా శిక్షణాలయాన్ని ప్రారంభించారు.
తొలిసారిగా 1969 సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు బాపు దర్శకత్వంలో వచ్చిన బుద్ధిమంతుడు చిత్రం ద్వారా చిత్రరంగ ప్రవేశం చేశారు. ఓ సీత కథ చిత్రంలో దేవదాస్ కనకాల నటన అమోఘం. చెట్టు కింద ప్లీడర్, సిరిసిరిమువ్వ, మల్లీశ్వరి వంటి వందలాది చిత్రాలలో నటించారు దేవదాస్ కనకాల. ఆయన పోషించిన పాత్రల్లో ఎక్కువ లాయర్ పాత్రలే కావడం గమనార్హం.
ఇదే విషయాన్ని ఆయన వద్ద కొందరు ప్రస్తావిస్తే అవన్నీ మెహమాటపు పాత్రలు అని నవ్వేసే వారు. మణికొండలో ఉన్న రాజీవ్ కనకాల స్వగ్రహంలో దేవదాస్ కనకాల భౌతిక కాయాన్ని సందర్శకులు, అభిమానుల కోసం శనివారం మధ్యాహ్నం వరకూ ఉంచుతారు. అనంతరం మహాప్రస్తానంలో దేవదాస్ కనకాల భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహిస్తారని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.
దేవదాస్ కనకాల మరణానికి చింతిస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు కూడా తమ సంతాపం తెలిపారు.