భారత చీఫ్ కోచ్ గా రవిశాస్త్రికే మళ్లీ చాన్స్?
రవి భాయినే కోచ్ గా కోరుతున్న కెప్టెన్ కొహ్లీ 2021 టీ-20 ప్రపంచకప్ వరకూ రవికి కాంట్రాక్టు భారత క్రికెట్ ప్రధాన శిక్షకుడుగా ప్రస్తుత చీఫ్ కోచ్ రవిశాస్త్రి మరో రెండేళ్లపాటు కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రపంచకప్ సెమీస్ లో భారత్ పరాజయం పొందినా.. .రవి శాస్త్రినే కోచ్ గా కొనసాగించాలని కెప్టెన్ విరాట్ కొహ్లీ తన మనసులో మాట బయటపెట్టాడు. బీసీసీఐ ప్రోటోకాల్ ను అతిక్రమించి మరీ…మీడియా సమావేశంలో రవి శాస్త్రి వైపే కొహ్లీ […]
- రవి భాయినే కోచ్ గా కోరుతున్న కెప్టెన్ కొహ్లీ
- 2021 టీ-20 ప్రపంచకప్ వరకూ రవికి కాంట్రాక్టు
భారత క్రికెట్ ప్రధాన శిక్షకుడుగా ప్రస్తుత చీఫ్ కోచ్ రవిశాస్త్రి మరో రెండేళ్లపాటు కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ప్రపంచకప్ సెమీస్ లో భారత్ పరాజయం పొందినా.. .రవి శాస్త్రినే కోచ్ గా కొనసాగించాలని కెప్టెన్ విరాట్ కొహ్లీ తన మనసులో మాట బయటపెట్టాడు.
బీసీసీఐ ప్రోటోకాల్ ను అతిక్రమించి మరీ…మీడియా సమావేశంలో రవి శాస్త్రి వైపే కొహ్లీ మొగ్గుచూపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
రవి కోచ్ గా 70 శాతం విజయాలు….
అయితే… సౌతాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ సాధించడంలోనూ, ప్రపంచకప్ టైటిల్ సాధించడంలోనూ
విఫలమై విమర్శకులకు అవకాశం ఇచ్చాడు.
రవిశాస్త్రి చీఫ్ కోచ్ గా భారతజట్టు 70 శాతం విజయాలు నమోదు చేసింది. రెండుసార్లు ఆసియాకప్ విజేతగా నిలవడం మాత్రమే కాదు.. ఆస్ట్ర్రేలియాను ఆస్ట్ర్లేలియా గడ్డపై ఓడించడం ద్వారా.. తొలిసారిగా భారతజట్టు టెస్ట్ సిరీస్ నెగ్గడం ద్వారా చరిత్ర సృష్టించింది.
కరీబియన్ టూర్ వరకూ కాంట్రాక్టు…
వాస్తవానికి చీఫ్ కోచ్ రవి శాస్త్రితో పాటు… మిగిలిన శిక్షకులు, సహాయసిబ్బంది కాంట్రాక్టు ప్రపంచకప్ తోనే ముగిసింది. అయితే… కొత్త కోచ్ ఎంపిక తంతు ముగిసే వరకూ…45 రోజుల పాటు కాంట్రాక్టును పొడిగించింది.
చీఫ్ కోచ్ రవి శాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ తో పాటు ఇతర సహాయసిబ్బంది సైతం.. వెస్టిండీస్ టూర్ ముగిసే వరకూ సేవలు అందిస్తారు.
రవి శాస్త్రి వైపే కొహ్లీ మొగ్గు…
భారత జట్టు చీఫ్ కోచ్ ఎంపిక కోసం…కపిల్ దేవ్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల సలహామండలిని బీసీసీఐ పాలకమండలి నియమించింది.
ఈ కమిటీలో కపిల్ తో పాటు అంశుమన్ గయక్వాడ్, శాంతా రంగస్వామి సభ్యులుగా ఉన్నారు. చీఫ్ కోచ్ ను ఎంపిక చేసే బాధ్యతను ఈ ముగ్గురు చేతిలోనే పెట్టారు.
ఆస్ట్ర్రేలియా మాజీ ఆల్ రౌండర్ టామ్ మూడీ, భారత మాజీ టెస్ట్ క్రికెటర్లు లాల్ చంద్ రాజ్ పుత్, రాబిన్ సింగ్ సైతం చీఫ్ కోచ్ పదవి కోసం దరఖాస్తు చేశారు.
అయితే…ప్రస్తుత చీఫ్ కోచ్ రవిశాస్త్రికి మాత్రం నేరుగా ఇంటర్వ్యూలో పాల్గొనే అవకాశం కల్పించారు. భారతజట్టు కరీబియన్ టూర్ కు బయలుదేరటానికి ముందు జరిగిన మీడియా సమావేశంలో రవి శాస్త్రినే కోచ్ గా కొనసాగించాలంటూ.. కెప్టెన్ కొహ్లీ తన మనసులో మాట బయటపెట్టాడు.
బీసీసీఐ ప్రోటోకాల్ ప్రకారం…కోచ్ గా పలానావారిని ఎంపిక చేయాలంటూ సిఫారసు చేసే అధికారం కెప్టెన్ కు లేదు. అయినా…విరాట్ కొహ్లీ మాత్రం బాహాటంగా రవి శాస్త్రినే కోచ్ గా కొనసాగించాలంటూ కోరడం చర్చనీయాంశంగా మారింది.
కొహ్లీమాట శిరోధార్యం కాదు..
మరోవైపు… కొహ్లీ కోరినంత మాత్రాన రవి శాస్త్రిని ఎంపిక చేయాలన్న రూలు ఏమీలేదని క్రికెట్ సలహామండలి సభ్యుడు అంశుమాన్ గయక్వాడ్ వ్యాఖ్యానించారు. కమిటీలోని మరో సభ్యురాలు శాంతా రంగస్వామి సైతం..సరికొత్త కోచ్ ను ఎంపిక చేసే బాధ్యత,హక్కు తమకే ఉందని తేల్చి చెప్పారు.
సలహామండలి చైర్మన్ కపిల్ దేవ్ మాత్రం…కెప్టెన్ కొహ్లీ మాటకు సైతం తాము గౌరవం ఇస్తామని…అయితే జట్టు అవసరాలకు తగ్గట్టుగా..తగిన అర్హత ఉన్న వ్యక్తినే ఎంపిక చేస్తామంటూ ప్రకటించారు.
విరాట్ కొహ్లీకి గంగూలీ బాసట…
భారతజట్టుకు కోచ్ గా ఎవరు ఉండాలో నిర్ణయించుకొనే హక్కు కెప్టెన్ గా విరాట్ కొహ్లీకి ఉంటుందని భారత మాజీ కెప్టెన్, క్రికెట్ వ్యాఖ్యాత సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. కొహ్లీకి బాసటగా నిలిచాడు.
మరోవైపు…మాజీ కెప్టెన్, సీనియర్ కామెంటీటర్ సునీల్ గవాస్కర్ మాత్రం..ప్రపంచకప్ సెమీస్ లో భారతజట్టు పరాజయం గురించి చర్చించకుండా.. నేరు గా కొహ్లీని కెప్టెన్ గా ఎలా కొనసాగిస్తారని…సెలెక్టర్లను నిలదీశారు.
భారత కెప్టెన్, చీఫ్ కోచ్ ఏదికోరితే అదే ఇస్తూ సెలెక్టర్లు గంగిరెద్దుల్లా తయారయ్యారంటూ గవాస్కర్ తనదైన శైలిలో చురకలంటించారు.
ఏది ఏమైనా..2021 టీ-20 ప్రపంచకప్ వరకూ ప్రస్తుత చీఫ్ కోచ్ రవి శాస్త్రినే కొనసాగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.