భారత క్రికెట్ నయాఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ

హర్యానా వీధుల నుంచి భారతజట్టు వరకూ మ్యాచ్ కు 200 రూపాయలతో క్రికెట్ జీవనం ప్రపంచ మాజీ చాంపియన్ వెస్టిండీస్ తో జరిగే తీన్మార్ టీ-20 సిరీస్ లో పాల్గొనే 15 మంది సభ్యుల భారతజట్టులో తొలిసారిగా చోటు సంపాదించడం ద్వారా..హర్యానా కమ్ ఢిల్లీ ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ కలకలం రేపాడు. మల్లయోధులు, బాక్సర్లు, షూటర్ల రాష్ట్ర్రం హర్యానాలోని కర్నాల్ వీధుల్లో టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడుతూ..కేవలం కొద్ది సంవత్సరాల వ్యవధిలోనే.. ఏకంగా భారత జట్టులో చోటు సంపాదించడం […]

Advertisement
Update:2019-07-23 00:32 IST
  • హర్యానా వీధుల నుంచి భారతజట్టు వరకూ
  • మ్యాచ్ కు 200 రూపాయలతో క్రికెట్ జీవనం

ప్రపంచ మాజీ చాంపియన్ వెస్టిండీస్ తో జరిగే తీన్మార్ టీ-20 సిరీస్ లో పాల్గొనే 15 మంది సభ్యుల భారతజట్టులో తొలిసారిగా చోటు సంపాదించడం ద్వారా..హర్యానా కమ్ ఢిల్లీ ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ కలకలం రేపాడు.

మల్లయోధులు, బాక్సర్లు, షూటర్ల రాష్ట్ర్రం హర్యానాలోని కర్నాల్ వీధుల్లో టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడుతూ..కేవలం కొద్ది సంవత్సరాల వ్యవధిలోనే.. ఏకంగా భారత జట్టులో చోటు సంపాదించడం ద్వారా నవదీప్ సైనీ అందరి దృష్టీ ఆకర్షించాడు.

రాజధాని ఢిల్లీ నగరానికి కూతవేటు దూరంలో ఉండే హర్యానా రాష్ట్ర్ర పట్టణం కర్నాల్ వీధుల్లో సందీప్ సైనీ టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడుతూ మ్యాచ్ కు 200 రూపాయలు ఫీజుగా తీసుకొంటూ తన ప్రస్థానం కొనసాగించాడు.

గాడ్ ఫాదర్ గా గౌతం గంభీర్…

గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరే నవదీప్ సైనీలోని ప్రతిభను భారత మాజీ ఓపెనర్, ఢిల్లీ మాజీ కెప్టెన్ గౌతం గంభీర్ ఆదిలోనే గుర్తించి.. కర్నాల్ నుంచి ఢిల్లీ క్రికెట్ సంఘానికి రప్పించాడు.

ఢిల్లీ జట్టుకు నెట్ బౌలర్ గా సేవలు అందిస్తూ వచ్చిన నవదీప్ తన ప్రతిభకు సానపెట్టుకొన్నాడు. ఏకంగా ఢిల్లీ రంజీ జట్టులోనే చోటు సంపాదించాడు.

2013 నుంచే లెదర్ బాల్ క్రికెట్…

2012 సీజన్ వరకూ టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడుతూ కర్నాల్ వీధులకే పరిమితమైన నవదీప్..2013లో తొలిసారిగా క్రికెట్ లెదర్ బాల్స్ తో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.

ఢిల్లీ జట్టు ప్రాక్టీసు చేస్తున్న సమయంలో…నవదీప్ సైనీ గంటకు సగటున 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసరడాన్ని గమనించిన గంభీర్.. ఈ హర్యానా థండర్ ను వెన్నెంటి ప్రోత్సహిస్తూ వచ్చాడు.

జాతీయస్థాయి క్రికెట్ మ్యాచ్ లు ఆడటానికి అవసరమైన క్రికెట్ బూట్లు సైతం లేని నవదీప్ కు…గంభీర్ ఓ జత బూట్లను బహుమతిగా ఇచ్చి వెన్ను తట్టాడు.

ఆరేళ్లలో అంతైఇంతై ..అంతింతై…

ఢిల్లీ రంజీజట్టులో నవదీప్ సైనీకి చోటు కోసం…ఢిల్లీ క్రికెట్ సంఘం సెలెక్టర్లతో గంభీర్ గొప్పపోరాటమే చేయాల్సి వచ్చింది. ఢిల్లీ కెప్టెన్ గా తన పలుకుబడిని ఉపయోగించి…నవదీప్ కు తమజట్టులో చోటు ఖాయం చేశాడు.

గంభీర్ ఇచ్చిన ఊతం, ప్రేరణ, నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆడటమే కాదు…దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణించడం ద్వారా.. నవదీప్ తనలోని అపారప్రతిభను బయటపెట్టాడు.

2013-14 సీజన్ నుంచి ఢిల్లీ జట్టులో సభ్యుడిగా ఆడుతూ వచ్చిన నవదీప్ సైనీ 8 మ్యాచ్ ల్లో 34 వికెట్లు పడగొట్టడం ద్వారా నంబర్ వన్ ఢిల్లీ బౌలర్ గా నిలిచాడు.

2017-18 సీజన్లో ఢిల్లీ జట్టు రంజీట్రోఫీ ఫైనల్స్ చేరడంలో నవదీప్ ప్రధానపాత్ర పోషించాడు. బెంగాల్ తో ముగిసిన సెమీఫైనల్లో నవదీప్ చెలరేగిపోయాడు.తొలి ఇన్నింగ్స్ లో 3 వికెట్లు, రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లు పడగొట్టడం ద్వారా మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు. ఢిల్లీకి రంజీ ఫైనల్స్ బెర్త్ ఖాయం చేశాడు.

ఐపీఎల్ లో రాయల్ చాలెంజ్ క్యాప్…

2019 ఐపీఎల్ సీజన్లో విరాట్ కొహ్లీ నాయకత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో నవదీప్ సైనీ చోటు సంపాదించాడు. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన లోస్కోరింగ్ మ్యాచ్ లో దిగ్గజ ఓపెనర్ షేన్ వాట్సన్ కు ఓ మెరుపు బౌన్సర్ తో…ఫ్లడ్ లైట్ల వెలుగులోనే చుక్కలు చూపించాడు.

ఆ తర్వాత సెలెక్టర దృష్టిని ఆకర్షించడం ద్వారా…ఆప్ఘనిస్థానంతో గత జూన్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో పాల్గొన్న భారతజట్టులో నవదీప్ చోటు సంపాదించినా..తుది 11 మందిలో చోటు దక్కించుకోలేకపోయాడు.

ప్రపంచకప్ లో నెట్ బౌలర్ గా…

ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా ముగిసిన వన్డే ప్రపంచకప్ సమయంలో…నవదీప్ సైనీ…నెట్ బౌలర్ గా భారతజట్టుకు సేవలు అందించాడు.

వెస్టిండీస్ -ఏ జట్టుతో జరుగుతున్న సిరీస్ లో భారత-ఏ జట్టు సభ్యుడిగా ఆడుతున్న సమయంలోనే సీనియర్ జట్టులో చోటు సంపాదించాడు.

గంభీర్ కు రుణపడి ఉంటా…నవదీప్

వెస్టిండీస్ తో ఆగస్టు 3 నుంచి జరిగే తీన్మార్ టీ-20 సిరీస్ లో పాల్గొనే 15 మంది సభ్యుల భారతజట్టులో తనకు తొలిసారిగా చోటు దక్కడం పట్ల.. 26 ఏళ్ల నవదీప్ సైనీ సంతృప్తి వ్యక్తం చేశాడు.

తాను అంతర్జాతీయ క్రికెటర్ గా ఎదగడం వెనుక గౌతం గంభీర్ ప్రేరణ ఎంతో ఉందని…గంభీర్ లేకపోతే తాను లేనని…గంభీర్ రుణం తీర్చుకోలేదని.. తన కృతజ్ఞతను చాటుకొన్నాడు.

మరి…కరీబియన్ ఫాస్ట్- బౌన్సీ పిచ్ లపై కర్నాల్ బాంబర్ నవదీప్ సైనీ ఏ రేంజ్ లో రాణించగలడన్నదే ఇక్కడి అసలు పాయింట్.

Tags:    
Advertisement

Similar News