క్రికెటర్ల అసాధారణ పురస్కారం హాల్ ఆఫ్ ఫేమ్.....

పెద్దమనుషుల క్రీడ క్రికెట్లో అసాధారణంగా రాణించడమే కాదు..అసమాన సేవలు అందించిన క్రికెటర్లను వివిధ దేశాల క్రికెట్ సంఘాలు, సంస్థలు పలు రకాల అవార్డులు,పురస్కారాలు ఇచ్చి సత్కరించడం సాధారణ విషయమే. అయితే..అంతర్జాతీయ క్రికెట్ మండలి మాత్రం వివిధ దేశాలకు చెందిన దిగ్గజ క్రికెటర్లకు ఓ అసాధారణ పురస్కారాన్ని ఇస్తూ గౌరవిస్తూ వస్తోంది. రెండున్నర శతాబ్దాల క్రికెట్ చరిత్రలో వివిధ దేశాలకు చెందిన అతికొద్దిమంది క్రికెటర్లు మాత్రమే ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ పురస్కారం సాధించి తమ జీవితాన్ని పరిపూర్ణం చేసుకొన్నారు. 2009 నుంచే […]

Advertisement
Update:2019-07-21 09:30 IST

పెద్దమనుషుల క్రీడ క్రికెట్లో అసాధారణంగా రాణించడమే కాదు..అసమాన సేవలు అందించిన క్రికెటర్లను వివిధ దేశాల క్రికెట్ సంఘాలు, సంస్థలు పలు రకాల అవార్డులు,పురస్కారాలు ఇచ్చి సత్కరించడం సాధారణ విషయమే.

అయితే..అంతర్జాతీయ క్రికెట్ మండలి మాత్రం వివిధ దేశాలకు చెందిన దిగ్గజ క్రికెటర్లకు ఓ అసాధారణ పురస్కారాన్ని ఇస్తూ గౌరవిస్తూ వస్తోంది. రెండున్నర శతాబ్దాల క్రికెట్ చరిత్రలో వివిధ దేశాలకు చెందిన అతికొద్దిమంది క్రికెటర్లు మాత్రమే ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ పురస్కారం సాధించి తమ జీవితాన్ని పరిపూర్ణం చేసుకొన్నారు.

2009 నుంచే హాల్ ఆఫ్ ఫేమ్…

గ్లోబల్ గేమ్స్ టెన్నిస్, గోల్ఫ్ క్రీడలకు మాత్రమే పరిమితమైన హాల్ ఆఫ్ ఫేమ్ పురస్కారాల సంస్కృతిని అంతర్జాతీయ క్రికెట్ మండలి సైతం అలవాటు చేసుకొంది.

18వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకూ క్రికెట్ కు అసమాన సేవలు అందించిన వివిధ దేశాల క్రికెటర్లు ఎందరో ఉన్నారు. అలాంటి క్రికెటర్లను గుర్తించి.. హాల్ ఆఫ్ ఫేమ్ లో చేర్చాలని దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి నిర్ణయించింది.

అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య, ప్రపంచ గోల్ఫ్ సమాఖ్యల స్ఫూర్తితో క్రికెట్లో సైతం హాల్ ఆఫ్ ఫేమ్ పురస్కారాలు ఏర్పాటు చేయాలని ఐసీసీ నిర్ణయించింది.

2009 నుంచి ఈ పురస్కారాలు అంద చేస్తూ వస్తున్నారు. నాటితరం నుంచి నిన్నటి తరానికి చెందిన అసాధారణ క్రికెటర్లను హాల్ ఆఫ్ ఫేమ్ తో గౌరవిస్తూ వస్తున్నారు.

మహిళా క్రికెటర్లకు సైతం….

పురుషులకు మాత్రమే కాదు…మహిళా క్రికెటర్లకు సైతం హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవాన్ని ఇవ్వాలని ఐసీసీ నిర్ణయించింది. ఇప్పటి వరకూ టెస్ట్ హోదా పొందిన ఎనిమిది దేశాలకు చెందిన 87 మంది క్రికెటర్లకు హాల్ ఆఫ్ ఫేమ్ పురస్కారంతో సత్కరించారు. వీరిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ దేశాలకు చెందిన ఎనిమిది మంది మహిళా క్రికెటర్లు సైతం ఉన్నారు.

భారత క్రికెటర్ సచిన్ టెండుల్కర్ వరకూ మొత్తం 79 మంది పురుష క్రికెటర్లు సైతం హాల్ ఆఫ్ ఫేమ్ సాధించగలిగారు.

ఇంగ్లండ్ దే సింహభాగం…

ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ పురస్కారం అందుకొన్న వివిధ దేశాల క్రికెటర్లలో ..ఇంగ్లండ్ కు చెందిన 28 మంది, ఆస్ట్రేలియాకు చెందిన 25 మంది క్రికెటర్లు ఉన్నారు.

వెస్టిండీస్ కు చెందిన 18 మంది క్రికెటర్లు సైతం హాల్ ఆఫ్ ఫేమ్ లో నిలువగలిగారు. భారత్ కు చెందిన ఆరుగురు, పాక్ కు చెందిన ఐదుగురు క్రికెటర్లు హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవాన్ని దక్కించుకోగలిగారు.

న్యూజిలాండ్ కు చెందిన ముగ్గురు, సౌతాఫ్రికాకు చెందిన ఇద్దరితో పాటు శ్రీలంకకు చెందిన ఒక్క ఆటగాడు హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవాన్ని సంపాదించగలిగారు.

బిషిన్ సింగ్ బేడీ టు సచిన్ టెండుల్కర్..

ఎనిమిది దశాబ్దాల భారత క్రికెట్ చరిత్రలో ఎందరో గొప్పగొప్ప క్రికెటర్లున్నా..కేవలం ఆరుగురికి మాత్రమే హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవం దక్కింది.

 

ఈ ఘనత సాధించిన భారత క్రికెట్ దిగ్గజాలలో మాజీ కెప్టెన్లు బిషిన్ సింగ్ బేడీ, సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, రాహుల్ ద్రావిడ్, అనీల్ కుంబ్లే, సచిన్ టెండుల్కర్ ఉన్నారు.

2009లో బిషిన్ సింగ్ బేడీ హాల్ ఆఫ్ ఫేమ్ సాధించిన భారత తొలి క్రికెటర్ గా చరిత్ర సృష్టించారు. సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ సైతం 2009లోనే హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవాన్ని అందుకొన్నారు.

2015 లో అనీల్ కుంబ్లే, 2018లో రాహుల్ ద్రవిడ్ లను హాల్ ఆఫ్ ఫేమ్ తో ఐసీసీ సత్కరించింది. అనీల్ కుంబ్లేకి 132 టెస్టుల్లో 619 వికెట్లు, 271 వన్డేల్లో 337 వికెట్లు పడగొట్టిన అసాధారణ రికార్డు ఉంది.

ఇక..ఇండియన్ క్రికెట్ వాల్ రాహుల్ ద్రవిడ్ కు 164 టెస్టుల్లో 13 వేల 288 పరుగులు, 344 వన్డేల్లో 10 వేల 889 పరుగులు సాధించిన ఘనత ఉంది.

ఆలస్యంగా సచిన్ కు హాల్ ఆఫ్ ఫేమ్…

భారత క్రికెట్ కు 22 సంవత్సరాలపాటు అసమాన సేవలు అందించిన భారత క్రికెటర్ మాస్టర్ సచిన్ టెండుల్కర్ 2014లో క్రికెట్ నుంచి పూర్తిగా రిటైరైతే…2019లో కానీ హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవాన్ని దక్కించుకోలేకపోయాడు.

2019 సంవత్సరానికి ఐసీసీ ప్రకటించిన హాల్ ఆఫ్ ఫేమ్ పురస్కార గ్రహీతలలో మాస్టర్ సచిన్ టెండుల్కర్, సౌతాఫ్రికా వెటరన్ ఫాస్ట్ బౌలర్ అలన్ డోనాల్డ్, మహిళల విభాగంలో ఆస్ట్ర్లేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ ఫిట్జ్ ప్యాట్రిక్స్ ఉన్నారు.

అంతర్జాతీయ క్రికెట్లో 100 సెంచరీలు, 30 వేలకు పైగా పరుగులు సాధించిన ఒకేఒక్కడు మాస్టర్ సచిన్ టెండుల్కర్ ను.. ఆలస్యంగానైనా ఐసీసీ కరుణించి హాల్ ఆఫ్ ఫేమ్ లో చేర్చడం ద్వారా తన గౌరవాన్ని పెంచుకోగలిగింది.

లండన్ లో ముగిసిన ఓ కార్యక్రమంలో భార్య అంజలి తో కలసి సచిన్ హాల్ ఆఫ్ ఫేమ్ పురస్కారాన్ని స్వీకరించాడు. రానున్న కాలంలో మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కొహ్లీ సైతం హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు సంపాదించే అవకాశం ఉంది.

Tags:    
Advertisement

Similar News